
Moises Henriques : ఆస్ట్రేలియా క్రికెట్‌లో ఒక అద్భుతమైన అధ్యాయం ముగిసింది. 2009లో ఆస్ట్రేలియా జాతీయ జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన స్టార్ ఆల్‌రౌండర్ మోయిసెస్ హెన్రిక్స్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించారు. ఆస్ట్రేలియా డొమెస్టిక్ క్రికెట్‌కు పూర్తిగా దూరమవ్వాలని ఆయన నిర్ణయించుకున్నారు. సుదీర్ఘ కాలంగా తను ప్రాతినిధ్యం వహిస్తున్న న్యూ సౌత్ వేల్స్, బిగ్ బాష్ లీగ్ జట్టు సిడ్నీ సిక్సర్స్ నుంచి తప్పుకుంటున్నట్లు అధికారికంగా వెల్లడించారు. అయితే ఆయన పూర్తిగా క్రికెట్‌కు గుడ్‌బై చెప్పడం లేదు, అలాగే అంతర్జాతీయ క్రికెట్ నుంచి కూడా తప్పుకోవడం లేదు. మరి డొమెస్టిక్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ఇచ్చి అంతర్జాతీయ క్రికెట్ ఎలా ఆడతారా అని ఆశ్చర్యపోతున్నారా? ఎందుకంటే ఆయన ఇకపై ఒక సరికొత్త దేశం తరఫున బరిలోకి దిగబోతున్నారు.
ప్రస్తుతం 39 ఏళ్ల వయసున్న మోయిసెస్ హెన్రిక్స్ గత 22 సంవత్సరాలుగా ప్రొఫెషనల్ క్రికెటర్‌గా కొనసాగుతున్నారు. తన జీవితంలో ఆటను ఒక మైలురాయి వద్ద ఆపేసి, జీవిత తదుపరి దశలోకి అడుగుపెట్టడానికి ఇదే సరైన సమయమని ఆయన భావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు బిగ్ బాష్ లీగ్‌లో ఇతర జట్ల నుంచి కూడా ఆడాలని భారీ ఆఫర్లు వచ్చాయని తెలిపారు. కానీ సిడ్నీ సిక్సర్స్, న్యూ సౌత్ వేల్స్ జట్లతో తనకు ఉన్న అనుబంధం ఎంతో ప్రత్యేకమైనదని, వాటిని వదిలి వేరే ఆస్ట్రేలియా జట్టు తరఫున ఆడటం తనకు ఇష్టం లేదని ఎమోషనల్ అయ్యారు. తన సుదీర్ఘ ప్రయాణంలో తోడుగా నిలిచిన ఆటగాళ్లకు, కోచ్‌లకు, సహాయక సిబ్బందికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఒకవేళ వీరితో ఇంతటి బలమైన బంధం లేకపోయి ఉంటే, తాను ఎప్పుడో క్రికెట్ నుంచి తప్పుకునేవాడినని హెన్రిక్స్ చెప్పుకొచ్చారు.
హెన్రిక్స్ తన 17 ఏళ్ల చిన్న వయసులోనే న్యూ సౌత్ వేల్స్ జట్టుతో మొదటి ప్రొఫెషనల్ కాంట్రాక్ట్‌పై సంతకం చేశారు. బిగ్ బాష్ లీగ్ చరిత్రలో జరిగిన అన్ని 15 సీజన్లలోనూ ఆయన సిడ్నీ సిక్సర్స్ జట్టుతోనే కలిసి ప్రయాణించారు. అంతేకాకుండా ఆ జట్టు మూడు సార్లు ఛాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా బిగ్ బాష్ లీగ్ 9, 10వ సీజన్లలో సిక్సర్స్ జట్టు వరుసగా రెండుసార్లు ట్రోఫీని ముద్దాడటంలో హెన్రిక్స్ లీడర్‌షిప్ ఎంతో దోహదపడింది. తన సుదీర్ఘ దేశవాళీ కెరీర్‌లో న్యూ సౌత్ వేల్స్, సిడ్నీ సిక్సర్స్ జట్ల తరఫున అన్ని ఫార్మాట్లలో కలిపి మొత్తం 420 మ్యాచ్‌లు ఆడారు. ఇందులో 110 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు, 112 లిస్ట్-ఏ మ్యాచ్‌లు, 198 టీ20 మ్యాచ్‌లు ఉన్నాయి. ఈ అద్భుతమైన ప్రయాణంలో ఆయన మొత్తం 14 ప్రతిష్టాత్మక ట్రోఫీలను గెలుచుకోవడం విశేషం.
ఆస్ట్రేలియా జాతీయ జట్టు తరఫున హెన్రిక్స్ మూడు ఫార్మాట్లలోనూ ప్రాతినిధ్యం వహించారు. 2013లో ఆస్ట్రేలియా టెస్ట్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చి, 432వ నంబర్ టెస్ట్ క్యాప్‌ను అందుకున్నారు. ఆస్ట్రేలియా డొమెస్టిక్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ, ఆయన గ్లోబల్ టీ20 లీగ్‌లలో ఆడటం కొనసాగిస్తారు. దీనితో పాటు తన సొంత దేశమైన పోర్చుగల్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడబోతున్నారు. వచ్చే నెలలో జరగనున్న 2028 టీ20 వరల్డ్ కప్ యూరోపియన్ క్వాలిఫైయింగ్ టోర్నమెంట్‌లో పుర్చుగల్ జట్టు తరఫున ఆయన బరిలోకి దిగనున్నారు. అలాగే ఆగస్టు నుంచి ప్రారంభం కానున్న సరికొత్త యూరోపియన్ టీ20 లీగ్‌లో గ్లాస్గో కాస్మిక్ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు. ఆస్ట్రేలియా మైదాన వీరుడిగా గుర్తింపు తెచ్చుకున్న హెన్రిక్స్, ఇకపై యూరప్ క్రికెట్‌లో ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తారో చూడాలి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..