
MI vs DC WPL 2026 : మహిళా ప్రీమియర్ లీగ్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ మళ్ళీ తన పాత ఫామ్‌ను అందిపుచ్చుకుంది. శనివారం నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన హై-వోల్టేజ్ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ముంబై చిత్తుగా ఓడించింది. బ్యాటింగ్‌లో పరుగుల సునామీ సృష్టించిన ముంబై, బౌలింగ్‌లోనూ అదే పదును చూపిస్తూ ఢిల్లీని కట్టడి చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 196 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై బౌలర్ల ధాటికి తట్టుకోలేక 145 పరుగులకే కుప్పకూలింది. దీంతో ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌లో తన మొదటి విజయాన్ని ఘనంగా నమోదు చేసింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌కు ఆరంభంలో ఎదురుదెబ్బలు తగిలినా, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మరియు నేట్ సీవర్ బ్రంట్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. అమెలియా కెర్ డకౌట్ అవ్వడం, కమలిని (16) త్వరగా వెనుదిరగడంతో ముంబై కాస్త తడబడింది. కానీ, సీవర్ బ్రంట్ (46 బంతుల్లో 70), హర్మన్‌ప్రీత్ కౌర్ (34 బంతుల్లో 74 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడారు. వీరిద్దరి మెరుపులతో ముంబై 4 వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఢిల్లీ బౌలర్లలో నందిని శర్మ రెండు వికెట్లు తీసి పర్వాలేదనిపించింది.
196 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఏదీ కలిసి రాలేదు. ఓపెనర్లు షెఫాలీ వర్మ (8), లిజెల్ లీ (10) పూర్తిగా నిరాశపరిచారు. ఇక కెప్టెన్ జెమిమా రోడ్రిగ్స్ (1) కూడా ఘోరంగా విఫలమవ్వడంతో ఢిల్లీ కోలుకోలేకపోయింది. స్టార్ ప్లేయర్లు లారా వోల్వార్డ్ (9), మారిజన్ కాప్ (10) కూడా తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరడంతో ఢిల్లీ పరాజయం ఖాయమైపోయింది. ఒక దశలో ఢిల్లీ 74 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
వరుసగా వికెట్లు పడుతున్నా చినెలే హెన్రీ అద్భుత పోరాటాన్ని కనబరిచింది. కేవలం 33 బంతుల్లోనే 56 పరుగులు చేసి జట్టు ఆశలను సజీవంగా ఉంచే ప్రయత్నం చేసింది. ఇందులో 5 ఫోర్లు, 3 భారీ సిక్సర్లు ఉన్నాయి. అయితే ఆమెకు మిగిలిన వారి నుండి సహకారం లభించలేదు. చివర్లో మిన్నూ మణి (7) కూడా అవుట్ అవ్వడంతో ఢిల్లీ 145 పరుగుల వద్ద తన ఆఖరి వికెట్‌ను కోల్పోయింది. ముంబై బౌలర్లలో షబ్నిమ్ ఇస్మాయిల్, అమెలియా కెర్, సీవర్ బ్రంట్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ఢిల్లీ పతనాన్ని శాసించారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..