
IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు ఆటగాళ్ల ట్రేడింగ్ విషయంలో ఓ సంచలన వార్త బయటకు వచ్చింది. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి మారడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. శాంసన్‌ను తమ జట్టులోకి తీసుకోవడానికి, సీఎస్‌కే ఇద్దరు స్టార్ ఆల్-రౌండర్‌లను రాజస్థాన్‌కు బదిలీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు ESPN Cricinfo నివేదించింది. ఆ ఇద్దరిలో ఒకరు సీనియర్ ప్లేయర్ రవీంద్ర జడేజా కాగా, రెండో ఆటగాడు ఎవరు? ఈ మెగా ట్రేడ్ డీల్‌పై ఉన్న తాజా అప్‌డేట్స్ ఏంటో చూద్దాం.
ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు ట్రేడింగ్ విండోలో అత్యంత కీలకమైన ట్రేడ్‌గా ఇది నిలవనుంది. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు వెళ్లడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ESPN Cricinfo నివేదిక ప్రకారం.. సంజు శాంసన్‌ను తీసుకోవడానికి చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్‌కు బదులుగా రవీంద్ర జడేజా, ఇంగ్లాండ్‌కు చెందిన స్టార్ ఆల్-రౌండర్ సామ్ కరన్ అనే ఇద్దరు ఆటగాళ్లను ట్రేడ్ చేయనుంది.
ఒకవేళ ఈ డీల్ ఖరారైతే, రవీంద్ర జడేజా దాదాపు 17 సంవత్సరాల తర్వాత మళ్లీ రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి తిరిగి వచ్చినట్లవుతుంది. ఈ ట్రేడింగ్‌కు సంబంధించి చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ టీమ్ అధికారులు ఇప్పటికే రవీంద్ర జడేజా, సంజు శాంసన్, సామ్ కరన్‌లతో చర్చలు జరిపినట్లు సమాచారం. డీల్ దాదాపు ఖరారైనప్పటికీ, ఏ ఫ్రాంఛైజీ కూడా దీనిని అధికారికంగా ధృవీకరించలేదు. ఈ ట్రేడ్‌ను అధికారికం చేయాలంటే, ఫ్రాంఛైజీలు ఈ ముగ్గురు ఆటగాళ్ల గురించి ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌కు తెలియజేయాలి.
ట్రేడింగ్ నిబంధనల ప్రకారం.. ఆటగాళ్ల నుంచి లిఖితపూర్వక అనుమతి లభించిన తర్వాత మాత్రమే ఫ్రాంఛైజీలు తుది ఒప్పంద ప్రక్రియను ముందుకు తీసుకెళ్లగలవు. సంజు శాంసన్, రవీంద్ర జడేజా ఇద్దరూ తమ తమ ఫ్రాంఛైజీలతో సుదీర్ఘ అనుబంధం కలిగి ఉన్నారు. సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్స్ జట్టులో 11 సంవత్సరాలు గడిపాడు. అతను రాజస్థాన్ రాయల్స్‌ను వీడాలని నిర్ణయించుకున్నట్లు ఇప్పటికే స్పష్టం చేశాడు. రవీంద్ర జడేజా సుదీర్ఘంగా 12 సీజన్‌ల పాటు చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడాడు.
జడేజా తన ఐపీఎల్ కెరీర్‌లో ఇప్పటివరకు 254 మ్యాచ్‌లు ఆడాడు. అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో అతను విరాట్ కోహ్లీ, ధోనీ, రోహిత్ శర్మ, దినేష్ కార్తీక్‌ల కంటే మాత్రమే వెనుకబడి ఉన్నాడు. ఐపీఎల్ 2022 సీజన్‌లో అతను సీఎస్కే కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు, కానీ జట్టు పేలవ ప్రదర్శన కారణంగా సీజన్ మధ్యలో కెప్టెన్సీని తిరిగి ధోనీకి అప్పగించాడు. సీఎస్కే తరఫున అతను 143 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..