
IPL Auctioneer : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ కోసం మినీ ఆక్షన్ అబు దాబిలోని ఎతిహాద్ అరేనాలో మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ వేలంపాటలో మొత్తం 369 మంది ఆటగాళ్లను వేలం వేసే బాధ్యత మల్లికా సాగర్ దే. గతంలో ఐపీఎల్ ఆక్షన్‌లను రిచర్డ్ మ్యాడ్లీ, హ్యూ ఎడ్మీడ్స్, చారు శర్మ వంటి వారు నిర్వహించారు. కానీ 2024 నుంచి మల్లికా సాగర్ ఈ కీలక బాధ్యతను స్వీకరించారు. ఆమె ఐపీఎల్ 2024 మినీ ఆక్షన్‌ను, సౌదీ అరేబియాలోని జెద్దాలో జరిగిన ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్‌ను విజయవంతంగా నిర్వహించారు. మల్లికా సాగర్ ఇప్పుడు ఐపీఎల్ వేలంపాటలో ఒక చరిత్ర సృష్టించే వ్యక్తిగా స్థిరపడ్డారు.
1975లో ముంబైలో వ్యాపార కుటుంబంలో జన్మించిన మల్లికా సాగర్.. ఫైన్ ఆర్ట్, క్రీడా ఈవెంట్ల వేలంపాట అనే రెండు విభిన్న రంగాలను కలిపే కెరీర్‌ను ఎంచుకున్నారు. చిన్నతనంలో ఒక పుస్తకంలో మహిళా వేలంపాట నిర్వహకురాలు ప్రధాన పాత్రగా ఉండటంతో, ఆమెకు వేలంపాటపై ఆసక్తి పెరిగింది. మల్లికా ఫిలడెల్ఫియాలోని బ్రైన్ మౌర్ కాలేజ్ నుంచి ఆర్ట్ హిస్టరీలో డిగ్రీ పూర్తి చేశారు.
ఆమె కేవలం 26 ఏళ్ల వయసులోనే న్యూయార్క్‌లోని క్రిస్టీస్ అనే ప్రఖ్యాత సంస్థలో తొలి భారతీయ మహిళా వేలంపాట నిర్వహకురాలిగా రికార్డు సృష్టించారు. ఇదే ఆమెకు అంతర్జాతీయ వేలం మార్కెట్‌లో గొప్ప గుర్తింపును తెచ్చిపెట్టింది. మల్లికా సాగర్ క్రీడా రంగంలోనూ అనేక కొత్త చరిత్రలు సృష్టించారు. 2021లో ప్రో కబడ్డీ లీగ్ వేలంపాటను నిర్వహించిన తొలి మహిళా ఆక్షనీర్‌గా ఆమె నిలిచారు. ఆ తర్వాత రెండేళ్లకు ఆమెకు తొలిసారిగా మహిళా ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) వేలం పాట నిర్వహించే బాధ్యత అప్పగించారు.
దీంతో పాటు గత నెలలో జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మెగా ఆక్షన్‌ను కూడా మల్లికానే నిర్వహించారు. ఈ అనుభవం, నైపుణ్యం కారణంగా ఆమెకు ఇప్పుడు ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్‌ను కూడా నిర్వహించే అవకాశం లభించింది. ఫైన్ ఆర్ట్ ప్రపంచం నుంచి వచ్చి, క్రీడా రంగంలో అతిపెద్ద వేలంపాటలను విజయవంతంగా నిర్వహిస్తూ మల్లికా సాగర్ భారత క్రీడా చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..