టుక్, టుక్, టుక్.. టీ20లో టెస్ట్ బ్యాటింగ్.. 20 ఓవర్లలో 30 పరుగులు.. క్రికెట్‌కే అవమానం..

టీ20 క్రికెట్ అంటేనే ఫోర్లు, సిక్సర్ల హోరు.. మెరుపు వేగంతో సాగే బ్యాటింగ్. కానీ, ఒక జట్టు మాత్రం టీ20 మ్యాచ్‌ను కాస్తా టెస్ట్ మ్యాచ్‌లా ఆడి క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరిచింది. నిర్ణీత 20 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసినా కనీసం 50 పరుగులు కూడా చేయలేకపోయిన ఉదంతం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

టుక్, టుక్, టుక్.. టీ20లో టెస్ట్ బ్యాటింగ్.. 20 ఓవర్లలో 30 పరుగులు.. క్రికెట్‌కే అవమానం..
T20 Cricket Records

Updated on: Dec 22, 2025 | 3:16 PM

నేటి వేగవంతమైన టీ20 క్రికెట్ యుగంలో, బ్యాటర్లు తొలి బంతి నుంచే ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతున్నారు. 200 కంటే ఎక్కువ పరుగులు చేయడం ఇప్పుడు ఒక సాధారణ విషయంగా మారిపోయింది. కానీ, ఒక మహిళా క్రికెట్ జట్టు మాత్రం ఇందుకు భిన్నంగా ఆడి అందరినీ విస్మయానికి గురిచేసింది. పూర్తి 20 ఓవర్ల పాటు క్రీజులో ఉన్నప్పటికీ, ఆ జట్టు చేసిన పరుగులు చూసి క్రికెట్ ప్రపంచం నోరెళ్లబెట్టింది.

ఏమిటా రికార్డు? ఎక్కడ జరిగింది?

ఈ వింత ఘటన 2019 క్విబుకా మహిళల టీ20 టోర్నమెంట్‌లో చోటుచేసుకుంది. కిగాలిలోని ఘాంగా అంతర్జాతీయ మైదానంలో మాలి మరియు రువాండా మహిళల జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌ ఇది. సాధారణంగా టీ20ల్లో వికెట్లు త్వరగా పడిపోయినప్పుడు తక్కువ స్కోర్లు నమోదు కావడం చూస్తుంటాం. కానీ ఇక్కడ విచిత్రం ఏమిటంటే, మాలి జట్టు పూర్తి 120 బంతులు ఆడి కేవలం 30 పరుగులు మాత్రమే చేయగలిగింది.

బ్యాటింగ్ కాదు.. పరుగుల కోసం పోరాటం!

రువాండా విధించిన 247 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో మాలి బ్యాటర్లు కనీసం ప్రతిఘటన కూడా చూపలేకపోయారు. ఓవర్‌కు కేవలం 1.5 పరుగుల సగటుతో బ్యాటింగ్ చేయడం టీ20 ఫార్మాట్‌కే అవమానకరమని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. మొత్తం ఇన్నింగ్స్‌లో మాలి బ్యాటర్లు కొట్టింది కేవలం రెండు ఫోర్లు మాత్రమే.

బ్యాటర్ల వైఫల్యం: జట్టులో అత్యధిక స్కోరు 9 పరుగులు (సమకే). మిగిలిన వారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. మాలి చేసిన 30 పరుగులలో 11 పరుగులు ఎక్స్‌ట్రాల (వైడ్లు, నోబాల్స్) రూపంలో వచ్చినవే. అంటే ఆ జట్టు బ్యాటర్లు తమ బ్యాట్లతో సృష్టించిన పరుగులు కేవలం 19 మాత్రమే!

రువాండా విశ్వరూపం..

అంతకుముందు బ్యాటింగ్ చేసిన రువాండా జట్టు పరుగుల వరద పారించింది. మేరీ బిమెనిమానా 114 పరుగులతో వీరవిహారం చేయడంతో ఆ జట్టు నిర్ణీత ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 246 పరుగులు చేసింది. చివరకు మాలి జట్టును 30 పరుగులకే కట్టడి చేసి, 216 పరుగుల భారీ తేడాతో చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది.

క్రికెట్‌లో రికార్డులు సృష్టించడం సహజం, కానీ ఇలాంటి ‘నెమ్మదైన’ రికార్డులు క్రీడాభిమానులకు మింగుడుపడవు. టీ20 ఫార్మాట్‌లో దూకుడుగా ఆడాల్సింది పోయి, రక్షణాత్మక ధోరణితో ఆడి మాలి జట్టు తన పేరు మీద ఒక చేదు జ్ఞాపకాన్ని లిఖించుకుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..