Lizelle Lee : ఫిజిక్ కాదు, పవరే ముఖ్యం..మైదానంలో ఆమెను చూసి బౌలర్లు బెంబేలెత్తుతున్నారు

Lizelle Lee : డబ్ల్యూపీఎల్ 2026లో లిజెలీ లీ తన భారీ కాయంతోనే కాకుండా పవర్ హిట్టింగ్‌తో సంచలనం సృష్టిస్తోంది. ముంబై ఇండియన్స్‌పై అద్భుత క్యాచ్, 210 పరుగుల చేజ్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో అందరి నోళ్లూ మూయించిన ఈ సౌతాఫ్రికా స్టార్ గురించి తెలుసుకుందాం.

Lizelle Lee : ఫిజిక్ కాదు, పవరే ముఖ్యం..మైదానంలో ఆమెను చూసి బౌలర్లు బెంబేలెత్తుతున్నారు
Lizelle Lee

Updated on: Jan 13, 2026 | 9:29 AM

Lizelle Lee : మహిళల ప్రిమియర్ లీగ్ నాలుగో సీజన్‌లో ఒక వింత దృశ్యం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. సాధారణంగా అథ్లెట్లు అంటే స్లిమ్‌గా, సిక్స్ ప్యాక్ బాడీతో ఉండాలనుకుంటాం. కానీ, ఇప్పుడు ఒక భారీ కాయం కలిగిన క్రికెటర్ తన అద్భుతమైన ఆటతీరుతో అందరి నోళ్లూ మూయిస్తోంది. ఆమె మరెవరో కాదు, సౌతాఫ్రికా మాజీ స్టార్ బ్యాటర్ లిజెలీ లీ. డెల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్న ఆమె, తన ఫిజిక్ గురించి వస్తున్న విమర్శలను తన బ్యాట్‌తోనే సమాధానం చెబుతూ లీగ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అమేలియా కెర్ కొట్టిన షాట్‌ను వికెట్ కీపర్ స్థానంలో ఉన్న లిజెలీ లీ డైవ్ చేస్తూ అద్భుతంగా అందుకున్నప్పుడు స్టేడియం ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది. అంత భారీ శరీరంతో ఆమె అంత వేగంగా ఎలా స్పందించిందా అని ఫ్యాన్స్ నోరెళ్లబెట్టారు. ఆ తర్వాత గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 210 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో లిజెలీ ఆడిన సుడిగాలి ఇన్నింగ్స్ చూసి కామెంటర్లు సైతం షాక్ అయ్యారు. ఆమె బాదిన ప్రతి సిక్సర్ గ్యాలరీలో పడుతుంటే, మైదానంలో అందరి చూపు ఆమెపైనే నిలిచింది. మహిళల క్రికెట్‌లో ఇలాంటి భారీ ఆకారాన్ని చూడటం ఇదే మొదటిసారి కావడంతో లిజెలీ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.

నిజానికి లిజెలీ లీ ప్రస్థానం చాలా గొప్పది. ఆమె ఏదో సరదాగా క్రికెట్ ఆడటానికి రాలేదు, ఇప్పటికే సౌతాఫ్రికా తరపున ఒక దిగ్గజ ప్లేయర్‌గా గుర్తింపు పొందింది. 2013లో దేశవాళీ క్రికెట్‌లో కేవలం 84 బంతుల్లోనే 169 పరుగులు చేసి అప్పట్లోనే సంచలనం సృష్టించింది. 2014లో జాతీయ జట్టులోకి వచ్చిన ఆమె, దాదాపు ఎనిమిదేళ్ల పాటు సౌతాఫ్రికాకు వెన్నెముకగా నిలిచింది. 100 వన్డేల్లో 3,315 పరుగులు, 82 టీ20ల్లో 1,896 పరుగులు చేసి తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లను వణికించింది. అంతర్జాతీయ క్రికెట్‌లోనే కాకుండా బిగ్ బాష్ లీగ్‌లోనూ 100కు పైగా మ్యాచ్‌లు ఆడి 5 సెంచరీలు బాదిన రికార్డు ఆమె సొంతం.

అయితే 2022లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన లిజెలీ, బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఇంటికే పరిమితమైపోయింది. ఆ సమయంలో ఆమె బరువు బాగా పెరగడంతో ఇక క్రికెట్ ఆడటం అసాధ్యమని అందరూ భావించారు. కానీ పట్టుదలతో మళ్ళీ బ్యాట్ పట్టిన ఆమె బిగ్ బాష్ లీగ్‌లో రీఎంట్రీ ఇచ్చి తన సత్తా చాటింది. ఈ క్రమంలోనే 2026 డబ్ల్యూపీఎల్ వేలంలో దిల్లీ క్యాపిటల్స్ ఆమెను రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది. 34 ఏళ్ల వయసులో, భారీ కాయంతో లీగ్‌లోకి అడుగుపెట్టిన లిజెలీ.. తన ఆటతో ఫిట్‌నెస్ అనేది కేవలం రూపంలోనే కాదు, చేసే పనిలో ఉంటుంది అని నిరూపిస్తోంది. ప్రస్తుతం ఆస్ట్రేలియా పౌరసత్వం పొంది అక్కడ స్థిరపడిన ఈమె, డబ్ల్యూపీఎల్ ముగిసే వరకు తన పవర్‌ఫుల్ షాట్లతో వార్తల్లో నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..