
Litton Das 0 Runs: ఆస్ట్రేలియా సిరీస్ ప్రారంభానికి ముందు అనుమతి లేకుండా చైనా పర్యటనకు వెళ్లిన వ్యవహారంలో క్రమశిక్షణా చర్యలు ఎదుర్కొన్న లిటన్ దాస్, తీవ్ర గందరగోళం నడుమ జట్టులోకి వచ్చాడు. ఫిట్‌నెస్ సమస్యల వల్ల తొలి టెస్టుకు దూరమవుతాడని భావించినప్పటికీ, వేగంగా కోలుకుని ఆఖరి క్షణంలో జట్టులో చోటు దక్కించుకున్నాడు. అయితే మైదానంలోకి దిగిన తర్వాత అతడి ప్రదర్శన ఘోరంగా సాగింది. మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 12 బంతులు ఎదుర్కొని సున్నా పరుగులకే వెనుదిరిగాడు. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఇక కేవలం రెండు రోజుల్లోనే ముగిసిన రెండో టెస్టులో పరిస్థితి మరింత దిగజారింది. మొదటి ఇన్నింగ్స్‌లో 10 బంతుల్లో డకౌట్, రెండో ఇన్నింగ్స్‌లో 5 బంతుల్లో డకౌట్ అయ్యాడు. మొత్తంగా మూడు ఇన్నింగ్స్‌లు ఆడి ఒక్క పరుగు కూడా చేయకుండా సిరీస్ ముగించాడు.
టెస్ట్ క్రికెట్ చరిత్రలో కనీసం రెండు మ్యాచ్‌ల సిరీస్ ఆడి ఒక్క పరుగు కూడా సాధించని ఆటగాళ్లు గతంలోనూ ఉన్నారు:
దీనానాథ్ రామ్‌నారాయణ్ (వెస్టిండీస్): 2001లో శ్రీలంక పర్యటనకు వెళ్లిన ఈ విండీస్ ఆటగాడు మూడు టెస్టుల సిరీస్‌లో ఆరు ఇన్నింగ్స్‌లు ఆడి ఒక్క పరుగు కూడా చేయలేదు. నాలుగు సార్లు డకౌట్ అవ్వగా, రెండు ఇన్నింగ్స్‌ల్లో సున్నా వద్ద నాటౌట్‌గా నిలిచాడు.
పీజే పోకాక్ (ఇంగ్లండ్): 1984లో వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్టుల హోమ్ సిరీస్‌లో వరుసగా నాలుగు ఇన్నింగ్స్‌ల్లోనూ డకౌట్ అయ్యాడు. బంతితో నాలుగు వికెట్లు తీసినప్పటికీ, బ్యాట్‌తో మాత్రం ఖాతా తెరవలేకపోయాడు.
ఈ అవాంఛనీయ జాబితాలో ఒక భారత ఆటగాడి పేరు కూడా ఉంది. మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా 2003-04 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాపై ఈ చెత్త రికార్డు నమోదు చేశాడు. నాలుగు టెస్టుల సుదీర్ఘ సిరీస్‌లో నెహ్రా 5 సార్లు డకౌట్ అయి ఒక్క పరుగు కూడా సాధించలేకపోయాడు.
బంగ్లాదేశ్ పేసర్ ఎబాదత్ హొస్సేన్ 2019లో తన అరంగేట్ర సిరీస్‌లోనే నాలుగు ఇన్నింగ్స్‌ల్లో రెండు డకౌట్లు, రెండు నాటౌట్లతో సున్నా పరుగులకే పరిమితమయ్యాడు. ఆ తర్వాత 2022లో దక్షిణాఫ్రికాపై కూడా ఇదే ప్రదర్శనను పునరావృతం చేసి రెండుసార్లు ఈ జాబితాలో చేరాడు. శ్రీలంక బౌలర్ నువాన్ ప్రదీప్ కూడా 2015లో వెస్టిండీస్‌పై, 2017లో పాకిస్తాన్‌పై సిరీస్ మొత్తం ఒక్క పరుగు కూడా చేయకుండానే ముగించాడు.
సుదీర్ఘ ఫార్మాట్‌లో బ్యాటర్లు లయ తప్పితే ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో లిటన్ దాస్ తాజా ప్రదర్శన నిరూపిస్తోంది. లోయర్ ఆర్డర్ బౌలర్లు గతంలో ఈ తరహా చెత్త రికార్డును నమోదు చేసినా, ఒక ప్రధాన స్పెషలిస్ట్ బ్యాటర్ సిరీస్ మొత్తం ఒక్క పరుగు కూడా చేయకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..