Laura Harris: 15 బంతుల్లోనే 50..మైదానంలో బౌలర్ల ఊచకోత..ప్రపంచ రికార్డు సమం చేసిన ఆస్ట్రేలియా క్రికెటర్

Laura Harris: కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాది ప్రపంచ రికార్డును సమం చేసింది. ఉమెన్స్ సూపర్ స్మాష్ లీగ్‌లో 305 స్ట్రైక్ రేట్‌తో లారా సృష్టించిన విధ్వంసం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. కేవలం కొన్ని నిమిషాల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి, ప్రపంచ రికార్డును సమం చేసింది.

Laura Harris: 15 బంతుల్లోనే 50..మైదానంలో బౌలర్ల ఊచకోత..ప్రపంచ రికార్డు సమం చేసిన ఆస్ట్రేలియా క్రికెటర్
Laura Harris

Updated on: Dec 28, 2025 | 2:42 PM

Laura Harris: క్రికెట్ మైదానంలో పరుగుల వర్షం కురవడం మనం చూస్తుంటాం, కానీ ఆదివారం న్యూజిలాండ్‌లో జరిగిన ఒక మ్యాచ్‌లో పరుగుల సునామీ వచ్చింది. ఆస్ట్రేలియా పవర్‌ హిట్టర్‌ లారా హారిస్ తన బ్యాటింగ్‌తో స్టేడియాన్ని ఊపేసింది. కేవలం కొన్ని నిమిషాల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి, ప్రపంచ రికార్డును సమం చేసింది. మహిళల టీ20 క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ బాదిన ప్లేయర్‌గా లారా నిలిచింది.

న్యూజిలాండ్ దేశవాళీ టీ20 లీగ్ మహిళా సూపర్ స్మాష్‎లో లారా హారిస్ ఒక సంచలనం సృష్టించింది. ఓటాగో స్పార్క్స్ జట్టు తరపున అరంగేట్రం చేసిన ఆమె, క్యాంటర్బరీ మ్యాజిషియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరుచుకుపడింది. కేవలం 15 బంతుల్లోనే 50 పరుగులు పూర్తి చేసి, 2022లో ఇంగ్లండ్ ప్లేయర్ మేరీ కెల్లీ నెలకొల్పిన వరల్డ్ రికార్డును సమం చేసింది. లారా మొత్తం 17 బంతులు ఎదుర్కొని 52 పరుగులు చేసింది. ఇందులో 6 ఫోర్లు, 4 సిక్సర్లు ఉండటం విశేషం. ఆమె స్ట్రైక్ రేట్ ఏకంగా 305.88గా నమోదైంది.

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన క్యాంటర్బరీ జట్టు 145 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో ఓటాగో జట్టు 46 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్నప్పుడు లారా హారిస్ క్రీజులోకి వచ్చింది. ఆమె వచ్చినప్పటి నుంచి బంతి బౌండరీ లైన్ దాటడమే పనిగా పెట్టుకుంది. లారా మెరుపు ఇన్నింగ్స్ ధాటికి ఓటాగో జట్టు మరో 31 బంతులు మిగిలి ఉండగానే, కేవలం 14.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి అద్భుత విజయాన్ని అందుకుంది. మొన్నటి వరకు జరిగిన ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్‎లో సరిగ్గా రాణించలేకపోయిన లారా, ఈ ఇన్నింగ్స్‌తో విమర్శకుల నోళ్లు మూయించింది.

లారా హారిస్‌కు ఇలాంటి విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడటం కొత్తేమీ కాదు. మహిళల టీ20 క్రికెట్‌లో ఆమె ఇప్పటివరకు చేసిన ఆరు హాఫ్ సెంచరీలు కూడా 20 కంటే తక్కువ బంతుల్లోనే రావడం విశేషం. మూడుసార్లు 18 బంతుల్లో, ఒకసారి 19 బంతుల్లో, ఒకసారి 17 బంతుల్లో హాఫ్ సెంచరీలు బాదిన లారా.. ఇప్పుడు ఏకంగా 15 బంతుల్లోనే ఈ ఫీట్ సాధించింది. ప్రపంచంలో ఏ ఇతర మహిళా క్రికెటర్ కూడా ఒకటి కంటే ఎక్కువ సార్లు 20 లోపు బంతుల్లో హాఫ్ సెంచరీ చేయలేదు. ఈ ఏడాది మొదట్లో వార్విక్‌షైర్ తరపున ఆడుతూ 17 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన లారా, అప్పట్లో తృటిలో రికార్డును మిస్ చేసుకున్నా.. ఇప్పుడు మాత్రం పక్కాగా దాన్ని తన ఖాతాలో వేసుకుంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..