ICC Womes T20I Rankings : వరల్డ్ కప్ వేళ మారిన టాప్-5 స్థానాలు.. నంబర్-1గా భారత సంచలనం శ్రీ చరణి

ICC Womes T20I Rankings : ఐసీసీ తాజా మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో భారత స్పిన్ సంచలనం శ్రీ చరణి బౌలర్లలో నంబర్-1 స్థానాన్ని నిలబెట్టుకుంది. వరల్డ్ కప్ ప్రదర్శనతో ఎలిస్ పెర్రీ, సోఫీ ఎక్లెస్టోన్, లారెన్ బెల్ సహా పలువురు ఆటగాళ్లు ర్యాంకింగ్స్‌లో భారీగా మెరుగుపడ్డారు.

ICC Womes T20I Rankings : వరల్డ్ కప్ వేళ మారిన టాప్-5 స్థానాలు.. నంబర్-1గా భారత సంచలనం శ్రీ చరణి
Icc Womes T20i Rankings

Updated on: Jun 30, 2026 | 3:09 PM

ICC Womes T20I Rankings : ఐసీసీ మహిళల టి20 వరల్డ్ కప్ 2026 ఉత్కంఠభరితంగా సాగుతున్న వేళ, ఐసీసీ మహిళా క్రికెటర్ల తాజా టి20 ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఈ మెగా టోర్నమెంట్‌లో భారత జట్టు సెమీఫైనల్‌కు చేరుకోలేక అభిమానులను తీవ్రంగా నిరాశపరిచినప్పటికీ.. వ్యక్తిగత ప్రదర్శనలో మాత్రం ఒక భారత ఆటగాడు అగ్రస్థానాన్ని కైవసం చేసుకుని దేశ గర్వకారణంగా నిలిచింది. టీమిండియా యువ స్పిన్ సంచలనం శ్రీ చరణి ఐసీసీ టి20 బౌలర్ల జాబితాలో తన నంబర్-1 స్థానాన్ని పదిలం చేసుకుంది. ఈ వరల్డ్ కప్ టోర్నీలో ఆమె అత్యద్భుతంగా రాణించి ఏకంగా 14 వికెట్లు పడగొట్టింది. ఆస్ట్రేలియాతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ ఓడిపోయినప్పటికీ, ఆ మ్యాచ్‌లో చరణి రెండు కీలక వికెట్లు తీసి తన స్థానాన్ని కాపాడుకుంది.

మరోవైపు, ఐసీసీ బౌలర్ల టాప్-5 ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ టోర్నమెంట్‌లో 8 వికెట్లు తీసిన ఇంగ్లాండ్ స్పిన్నర్ సోఫీ ఎక్లెస్టోన్ ఒక స్థానం ఎగబాకి మూడో ర్యాంకుకు చేరుకుంది. ఆమెతో పాటు తోటి ఇంగ్లాండ్ బౌలర్ లారెన్ బెల్ మూడు స్థానాలు మెరుగుపరుచుకుని నాల్గవ ర్యాంకును సొంతం చేసుకుంది. సౌతాఫ్రికా స్పిన్నర్ నాన్‌కులులేకో మ్లాబా ఐదో స్థానానికి, పాకిస్థాన్ సీనియర్ బౌలర్ నష్రా సంధు తొమ్మిదో స్థానానికి చేరుకుని టాప్-10 లో నిలిచారు. అలాగే టాప్-10 వెలుపల సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ మరిజానే కాప్ 14వ స్థానానికి, న్యూజిలాండ్ బౌలర్ బ్రీ ఇల్లింగ్ 31వ స్థానానికి చేరుకున్నారు.

బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా హవా

టి20 బ్యాటర్ల జాబితాను పరిశీలిస్తే.. ఆస్ట్రేలియా మహిళల ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఆసీస్ స్టార్ బ్యాటర్ జార్జియా వోల్ తన నంబర్-1 స్థానాన్ని నిలబెట్టుకోగా, అదే జట్టుకు చెందిన బెత్ మూనీ రెండో స్థానంలో కొనసాగుతోంది. సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ మూడో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక ఐర్లాండ్‌పై అద్భుతమైన సెంచరీతో చెలరేగిన శ్రీలంక కెప్టెన్ చమారి ఆటపట్టు రెండు స్థానాలు ఎగబాకి ఏడో ర్యాంకుకు చేరుకుంది. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో 56 పరుగులతో హాఫ్ సెంచరీ బాదిన ఆస్ట్రేలియా లెజెండరీ క్రికెటర్ ఎలిస్ పెర్రీ ఏకంగా ఐదు స్థానాలు ఎగబాకి 17వ ర్యాంకుకు చేరుకోవడం విశేషం. ఇంగ్లాండ్ ఓపెనర్ డానీ వ్యాట్ 11వ స్థానంలో నిలిచింది.

ఆల్ రౌండర్లలో హేలీ మాథ్యూస్ టాప్

ఆల్ రౌండర్ల కేటగిరీలో వెస్టిండీస్ పవర్‌ఫుల్ కెప్టెన్ హేలీ మాథ్యూస్ తన నంబర్-1 స్థానాన్ని విజయవంతంగా కాపాడుకుంది. న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ అమేలియా కెర్ రెండో స్థానంలో నిలిచింది. ఐర్లాండ్‌కు చెందిన ఓర్లా ప్రెండర్‌గాస్ట్ రెండు స్థానాలు మెరుగుపరుచుకుని సంయుక్తంగా మూడో స్థానానికి చేరుకుంది. కాగా, మహిళల టి20 వరల్డ్ కప్ సెమీఫైనల్ రేసు క్లైమాక్స్‌కు చేరుకుంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్లు సెమీస్ బెర్త్‌లను ఖరారు చేసుకున్నాయి. లండన్‌లోని ప్రసిద్ధ కేనింగ్టన్ ఓవల్ మైదానంలో ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్ల మధ్య మొదటి సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us