టీం ఇండియా యువ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ డిసెంబర్ 30న రూర్కీలో ఘోరమైన కారు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. పంత్ గాయం దృష్ట్యా కనీసం మూడు నెలల నుంచి ఆరు నెలల వరకు అతడు మళ్లీ మైదానంలోకి రాలేడని వైద్యులు చెబుతున్నారు. ఇటువంటి పరిస్థితిలో, వచ్చే నెలలో ఆస్ట్రేలియాతో ప్రారంభమయ్యే టెస్ట్ సిరీస్‌లో పంత్ కనిపించడు. పంత్ స్థానంలో జట్టులో చేరేందుకు కొందరు ఆటగాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అలాంటి వారేవరో ఇప్పుడు చూద్దాం.
టెస్ట్ ఫార్మాట్‌లో రిషబ్ పంత్ స్థానంలో కేఎస్ భరత్ ఏంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఫస్ట్ క్లాస్‌లో అతని ప్రదర్శన కూడా అద్భుతంగా ఉంది. అతను ఇప్పటివరకు 84 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో అతను 4533 పరుగులు చేశాడు. అదే సమయంలో, ఫస్ట్ క్లాస్‌లో భరత్ పేరు మీద 9 సెంచరీలు కూడా నమోదయ్యాయి. అతడిని టీమిండియా టెస్టు జట్టులో చేర్చాలన్న డిమాండ్ చాలా కాలంగా వినిపిస్తోంది.
రిషబ్ పంత్ గైర్హాజరీలో టీమిండియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్ పేరు వినిపిస్తోంది. అతను ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లో అరంగేట్రం చేసే అవకాశం ఉంది. సంజూ కెరీర్‌ను పరిశీలిస్తే.. భారత్ తరపున 11 వన్డేలు ఆడాడు. ఇందులో అతను 66 సగటుతో 330 పరుగులు చేశాడు. టీ20 ఇంటర్నేషనల్ పరిశీలిస్తే.. అతను టీమ్ ఇండియా తరపున 16 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 21.14 సగటుతో 296 పరుగులు చేశాడు.
ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్‌లో పంత్ స్థానంలో ఇషాన్ కిషన్ కూడా అవకాశం పొందవచ్చు. ఇటీవల వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించాడు. అదే సమయంలో, అతను ఇటీవల రంజీ ట్రోఫీలో ఫాస్ట్ సెంచరీ సాధించాడు. అతని ఆటతీరు కూడా పంత్ తరహాలోనే ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో పంత్ స్థానంలో కూడా అతనికి అవకాశం దక్కవచ్చని భావిస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..