IND vs SA : కోహ్లీ ఉంటే ఇలా జరిగేది కాదు.. భారత్ ఓటమిపై మాజీ ఆటగాడి సంచలన కామెంట్స్

భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ఘోర ప్రదర్శన నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ శ్రీవత్స్ గోస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ ఆడటం కొనసాగించి, వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించి ఉండాల్సింది అని ఆయన అభిప్రాయపడ్డారు.

IND vs SA : కోహ్లీ ఉంటే ఇలా జరిగేది కాదు.. భారత్ ఓటమిపై మాజీ ఆటగాడి సంచలన కామెంట్స్
Virat Kohli

Updated on: Nov 25, 2025 | 9:50 AM

IND vs SA : భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ఘోర ప్రదర్శన నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ శ్రీవత్స్ గోస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ ఆడటం కొనసాగించి, వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించి ఉండాల్సింది అని ఆయన అభిప్రాయపడ్డారు. కోహ్లీ కెప్టెన్సీలో జట్టులో కనిపించిన ఎనర్జీ, నమ్మకం ఇప్పుడు టీమిండియాలో లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతేడాది న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఓటమి తర్వాత ఇప్పుడు రిషబ్ పంత్ సారథ్యంలోని భారత జట్టు సౌతాఫ్రికా పై కూడా స్వదేశంలో సిరీస్ కోల్పోయే ప్రమాదంలో పడింది.

శ్రీవత్స్ గోస్వామి తన X ఖాతాలో ఈ విధంగా పోస్ట్ చేశారు: “నిజానికి, విరాట్ కోహ్లీ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించి, టెస్ట్ క్రికెట్‌ను కొనసాగించి ఉండాల్సింది. టెస్ట్ క్రికెట్ అతన్ని చాలా మిస్సవుతోంది. కేవలం ఆటగాడిగా మాత్రమే కాదు. అతను జట్టులోకి తీసుకొచ్చే ఆ ఎనర్జీ, ఏ పరిస్థితుల్లోనైనా గెలవగలం అనే నమ్మకాన్ని జట్టు కోల్పోయింది” అని ఆయన అన్నారు. ప్రస్తుతం భారత టెస్ట్ జట్టు ప్రదర్శన చూస్తుంటే, కోహ్లీ ప్రభావం ఎంత ఉండేదో అర్థమవుతోందని ఆయన అన్నారు.

గౌహతి టెస్ట్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా పూర్తి ఆధిపత్యంలో ఉంది. మొదటి ఇన్నింగ్స్‌లో 489 పరుగులు చేసిన సౌతాఫ్రికా, భారత్‌ను కేవలం 201 పరుగులకే ఆలౌట్ చేసింది. దీంతో వారికి 288 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. ఓపెనర్లు రియాన్ రికెల్టన్ (13), ఐడెన్ మార్క్రామ్ (12) క్రీజులో ఉన్నారు. మొత్తం మీద దక్షిణాఫ్రికా జట్టు 314 పరుగుల ఆధిక్యంతో ఉంది.

భారత్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం యశస్వి జైస్వాల్ (97 బంతుల్లో 58), వాషింగ్టన్ సుందర్ (92 బంతుల్లో 48) మాత్రమే చెప్పుకోదగిన పరుగులు చేశారు. కేఎల్ రాహుల్ (22), సాయి సుదర్శన్ (15), ధ్రువ్ జురెల్ (0), కెప్టెన్ రిషబ్ పంత్ (7), రవీంద్ర జడేజా (6), నితీష్ కుమార్ రెడ్డి (10) వంటి ఆటగాళ్లు తక్కువ స్కోరుకే అవుటయ్యారు.

సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో యాన్సెన్ 6/48 తో భారత బ్యాటింగ్‌ను కూల్చగా, స్పిన్నర్ సైమన్ హార్మర్ 3/64 తో అతనికి సహకరించాడు. 122/7 తో కష్టాల్లో ఉన్న భారత జట్టుకు వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్ (19) కలిసి 8వ వికెట్‌కు 72 పరుగుల భాగస్వామ్యాన్ని అందించి కాస్త పోరాటం చేశారు. కానీ ఆ పోరాటం కూడా పరాజయాన్ని ఆపలేకపోయింది. సౌతాఫ్రికా ఇప్పటికే కోల్‌కతాలో మొదటి టెస్ట్‌ను 30 పరుగుల తేడాతో గెలిచింది. ఈ టెస్ట్‌లో కూడా భారత్ ఓడిపోతే స్వదేశంలో భారత్‌కు ఇది మరో టెస్ట్ సిరీస్ పరాజయం అవుతుంది.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..