Rohit Sharma : అంతా తూచ్.. కోహ్లీ, రోహిత్‎లపై వస్తున్న వార్తల్లో నిజం లేదు.. బీసీసీఐ ఉపాధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ వార్తలపై బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పష్టత ఇచ్చారు. వారిద్దరూ ఇంకా వన్డేలు ఆడుతున్నారని, రిటైర్మెంట్ గురించి మాట్లాడటం తొందరపాటు అని ఆయన అన్నారు.ఈ పుకార్లను పక్కన పెడుతూ కోహ్లీ, రోహిత్ ఇద్దరూ వైట్-బాల్ క్రికెట్‌లోకి తిరిగి రావడానికి ట్రైనింగ్ ప్రారంభించినట్లు తెలిపారు.

Rohit Sharma : అంతా తూచ్.. కోహ్లీ, రోహిత్‎లపై వస్తున్న వార్తల్లో నిజం లేదు.. బీసీసీఐ ఉపాధ్యక్షుడి సంచలన వ్యాఖ్యలు
Kohli And Rohit

Updated on: Aug 23, 2025 | 12:25 PM

Rohit Sharma : టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ గురించి వస్తున్న వార్తలను బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా పూర్తిగా ఖండించారు. ఈ ఇద్దరు ఆటగాళ్లు ఇంకా వన్డేలు ఆడుతున్నారని, రిటైర్మెంట్ గురించి మాట్లాడటం ఇంకా తొందరపాటు అని ఆయన అన్నారు. టీ20లు, టెస్ట్‌ల నుంచి రిటైర్ అయిన తర్వాత ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్ల భవిష్యత్తుపై చాలా ఊహాగానాలు వచ్చాయి. అక్టోబర్‌లో ఆస్ట్రేలియా పర్యటనతో ఈ ఇద్దరు ఆటగాళ్లకు వీడ్కోలు పలికే అవకాశం ఉందని పుకార్లు వినిపించాయి. అయితే, ఈ పుకార్లను పక్కన పెడుతూ కోహ్లీ, రోహిత్ ఇద్దరూ వైట్-బాల్ క్రికెట్‌లోకి తిరిగి రావడానికి ట్రైనింగ్ ప్రారంభించారు. ఈ విషయంపై బీసీసీఐ కూడా ఎలాంటి తొందరపడడం లేదని, వారికి ఫ్రీడమ్ ఇచ్చిందని ఒక నివేదిక తెలిపింది. ఒక టీవీ షోలో మాట్లాడినప్పుడు.. సచిన్ టెండూల్కర్ మాదిరిగా కోహ్లీ, రోహిత్‌లకు కూడా వీడ్కోలు కార్యక్రమం ఉంటుందా అని హోస్ట్ అడిగాడు.

దానికి రాజీవ్ శుక్లా సమాధానమిస్తూ.. “వారు ఎప్పుడు రిటైర్ అయ్యారు? రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరూ ఇంకా వన్డేలు ఆడుతున్నారు. వారు ఇంకా ఆడుతున్నప్పుడు వీడ్కోలు గురించి ఎందుకు మాట్లాడటం? ప్రజలు ఎందుకు ముందే కంగారు పడుతున్నారు?” అని ప్రశ్నించారు. అంతేకాకుండా, ఏ ఆటగాడిని రిటైర్ అవ్వమని బీసీసీఐ ఎప్పుడూ చెప్పదని, ఆ నిర్ణయం ఆటగాడిదే అని ఆయన స్పష్టం చేశారు. “మా పాలసీ చాలా స్పష్టంగా ఉంది – బీసీసీఐ ఏ ఆటగాడిని రిటైర్ అవ్వమని చెప్పదు. ఆ నిర్ణయం వాళ్ళే తీసుకోవాలి” అని శుక్లా అన్నారు.

విరాట్ కోహ్లీ ఇంకా చాలా ఫిట్‌గా ఉన్నాడని, రోహిత్ శర్మ అద్భుతమైన వన్డే ఆటగాడని అన్నారు. ఈ స్టార్ ద్వయం గురించి ఇప్పుడే వీడ్కోలు గురించి ఆలోచించవద్దని ఆయన అభిమానులకు సూచించారు. “ఆ సమయం వచ్చినప్పుడు, దాన్ని ఎలా దాటాలో మేము మీకు చెబుతాం. మీరంతా ఇప్పటి నుంచే వీడ్కోలు గురించి మాట్లాడుతున్నారు. కోహ్లీ చాలా ఫిట్‌గా ఉన్నాడు, రోహిత్ శర్మ చాలా బాగా ఆడుతున్నాడు. మీరంతా ఇప్పటి నుంచే వీడ్కోలు గురించి కంగారు పడుతున్నారు” అని శుక్లా అన్నారు. అక్టోబర్ 19 నుంచి 25 వరకు ఆస్ట్రేలియాలో జరగబోయే వన్డే సిరీస్‌లో కోహ్లీ, రోహిత్ మళ్ళీ మైదానంలోకి అడుగుపెట్టనున్నారు.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..