Indian Women Cricketer Radha Yadav Life Journey: భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ బౌలర్ రాధా యాదవ్‌కు ప్రస్తుతం గుర్తింపు అవసరం లేదు. తన కఠోర శ్రమ, అలుపెరగని ప్రయత్నాల ఆధారంగా క్రికెట్‌లో తనకంటూ ఒక ముఖ్యమైన స్థానాన్ని ఏర్పరుచుకుని అభిమానుల్లో తన పేరును చాటి చెప్పుకుంది. రాధ మహిళా క్రికెట్‌లో వర్ధమాన తార. అయితే క్రికెట్ ఫీల్డ్‌కి ఆమె ప్రయాణం అంత సులభం కాదండోయ్. తాజాగా ఆమె అక్టోబర్‌లో యూఏఈలో జరగనున్న మహిళల టీ20 ప్రపంచకప్‌నకు కూడా ఎంపికైంది.
రాధా యాదవ్ నేడు ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నప్పటికీ, ఆమె జీవిత కథ వర్థమాన క్రికెటర్లకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. ఈ వ్యాసంలో రాధా యాదవ్ జీవితంలోని కొన్ని సంఘటనలు ఇప్పుడు తెలుసుకుందాం..
రాధా యాదవ్ 21 ఏప్రిల్ 2000 సంవత్సరంలో జన్మించింది. ఆమె వాస్తవానికి ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్ జిల్లాలోని అజోషి గ్రామం. ఆమె తన ప్రాథమిక విద్యను తన గ్రామం నుంచి పూర్తి చేసింది. ఆ తరువాత రాధ కెఎన్ ఇంటర్ కాలేజ్ బంకి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. ఆమె కుటుంబంలోని నలుగురు తోబుట్టువులలో రాధ చిన్నది. రాధ తండ్రికి ముంబైలో చిన్న కిరాణా దుకాణం ఉంది. అది ఇంటి ఖర్చులకు సరిపోదు. ఇటువంటి పరిస్థితిలో, రాధకు బ్యాట్ కొనడానికి కూడా డబ్బులే లేవు. అప్పుడు ఆమె చెక్కతో బ్యాట్ తయారు చేసి దానితో సాధన చేసేది. క్రమంగా రాధ ముంబైలో క్రికెట్ కోచింగ్ ప్రారంభించింది.
రాధకు చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఇష్టం. ఆమె స్థానికంగా ఉండే అబ్బాయిలతో క్రికెట్ ఆడేది. అబ్బాయిలతో క్రికెట్ ఆడుతున్న రాధను చూసిన జనాలు.. ఆడపిల్లకు ఇంత స్వేచ్ఛ ఇవ్వడం మంచిది కాదంటూ ఆమెను, ఆమె కుటుంబాన్ని అవమానించేవారు. కానీ రాధతోపాటు ఆమె కుంటుంబం ఈ మాటలను ఎప్పుడూ పట్టించుకోలేదు. తన కోరిక మేరకు కూతురికి ఎప్పుడూ స్వేచ్ఛగా ఆడుకునే స్వేచ్ఛను ఇచ్చింది.
రాధా యాదవ్ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంటే, 2018లో, రాజేశ్వరి గైక్వాడ్ స్థానంలో దక్షిణాఫ్రికా టూర్‌కు టీమ్ ఇండియా తరపున ఎంపికైంది. నిజానికి, రాజేశ్వరి మ్యాచ్ సమయంలో గాయపడింది. దాని కారణంగా ఆమె స్థానంలో రాధకు అవకాశం వచ్చింది. కోచ్ ప్రఫుల్లా నాయక్ వద్ద శిక్షణ తీసుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో ఈ స్పిన్ బౌలర్ చెప్పుకొచ్చింది. 2015-16 సమయంలో ఆమె ముంబై నుంచి వడోదరకు వచ్చింది. దీంతో ముంబై జట్టును వదిలి వడోదర జట్టులో చేరింది. అక్కడ ఆమె వడోదర క్రికెట్ అసోసియేషన్‌లో చేరింది. తన మొదటి సంపాదనతో, రాధ తన తండ్రి కోసం ఒక దుకాణాన్ని కొనుగోలు చేసింది. ఇప్పుడు రాధ తన కుటుంబంతో కలిసి హాయిగా జీవించడానికి ఒక ఇల్లు కొనాలనుకుంటోంది.
మరిన్న క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..