
Mumbai Cricketer: క్రికెట్‌లోకి రావాలనే కల ఉన్నా, దాన్ని కొనసాగించేందుకు కావాల్సిన పరిస్థితులు అందరికీ ఒకేలా ఉండవు. కొందరికి లక్ కలసి వస్తే.. మరికొందరికి లక్ చాలా దూరంలో ట్రావెల్ చేస్తుంటుంది. ఎన్ని కఠిన పరిస్థితులు ఎదురైనా, అన్నింటిని ఎదుర్కొని ఓ క్రికెటర్ గా మారాడు. తన కల కోసం ఏ చిన్న పనైనా చేసేందుకు వెనుకాడలేదు. ఆ కష్టానికి తగిన ఫలితం దక్కడంతో అతను తన కలను నెరవేర్చుకున్నాడు. ఇలాంటోళ్లు ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో జునేద్ ఖాన్ (Juned Khan) ఒకడు. ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్‌కు చెందిన అతడు 2014లో ముంబైకి వచ్చాడు. అప్పటికి అతడి ప్రధాన లక్ష్యం క్రికెట్ కాదు.. జీవనం సాగించడం. ముంబైలో తొలుత జీన్స్ ఫ్యాక్టరీలో సహాయకుడిగా పని చేశాడు. తరువాత థానేలో పావ్ అమ్మాడు. 2016లో ఆటో నడపడం మొదలుపెట్టాడు. ఉదయం బయలుదేరి మధ్యాహ్నం వరకు ఆటో నడిపి వచ్చిన డబ్బుతో తల్లి ఖర్చులకు సహాయం చేసేవాడు. అదే సమయంలో క్రికెట్ ప్రాక్టీస్, జిమ్ ఖర్చులు కూడా చూసుకోవాల్సి వచ్చేది. పరిస్థితులు కఠినంగా ఉన్నా బౌలింగ్‌పై అతడికి ఉన్న ఆసక్తి మాత్రం తగ్గలేదు.
ఆటో అతడిది కాదు. యజమానికి రోజుకు సుమారు రూ.200 ఇవ్వాలి. సుమారు మరో రూ.200 సొమ్ము సీఎన్‌జీ కోసం ఖర్చయ్యేది. మిగిలిన డబ్బే జునేద్ చేతిలో ఉండేది. సాధారణంగా రోజుకు రూ.300-400 వరకు మిగిలేవని అతడు వెల్లడించాడు. కొన్ని సందర్భాల్లో లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయడం వల్ల ట్రాఫిక్ పోలీసుల జరిమానా కూడా పడేది. అలాంటి రోజుల్లో చేతిలో పొదుపు ఉండేది కాదు. ఆ డబ్బుతో ఆహారం, అద్దె, క్రికెట్, జిమ్ ఖర్చులతో పాటు కన్నౌజ్‌లో ఉన్న తల్లికి కూడా సాయం చేయాల్సి వచ్చేది.
ఎక్కువమంది చదివినది: రోహిత్ @ 73.. కోహ్లీ @ 100.. గౌహతీలో అరుదైన రికార్డులపై కన్నేసిన రోకో..!
జునేద్ సీరియస్‌గా క్రికెట్ ఆడటం 2019లో మొదలైంది. బాంద్రాలోని సంజీవని క్రికెట్ అకాడమీలో బౌలింగ్ సాధన మొదలుపెట్టాడు. ఖరీదైన క్రికెట్ సామగ్రి కొనుగోలు చేసే స్థోమత లేకపోవడంతో కొంతకాలం రబ్బర్ స్పైక్స్‌తోనే ప్రాక్టీస్ చేశాడు. లాక్‌డౌన్ కారణంగా క్రికెట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ఆలస్యమైంది. పరిస్థితులు సాధారణమైన తరువాత ముంబై మైదానాల్లో అతడి ప్రయాణం వేగం అందుకుంది.
అతడి జీవితంలో కీలక మలుపు అభిషేక్ నాయర్ (Abhishek Nayar) పరిచయం. పీజే హిందూ జిమ్ఖానాలో జరిగిన పోలీస్ షీల్డ్ మ్యాచ్‌లో జునేద్ బౌలింగ్‌ను చూసిన నాయర్ అతడితో మాట్లాడాడు. ఆటపై పూర్తిగా దృష్టి పెట్టాలని సూచించాడు. ఆ తరువాత నాయర్ అకాడమీలో జునేద్ సాధన చేశాడు. ఆ సమయంలో అతడి ఖర్చుల విషయంలోనూ నాయర్ సాయం చేసినట్లు జునేద్ తెలిపాడు.
ఆ తర్వాత ముంబై స్థానిక క్రికెట్‌లో జునేద్ తన అవకాశాలను పెంచుకున్నాడు. పీజే హిందూ జిమ్ఖానా తరఫున ఆడుతూ మంచి ప్రదర్శనలు ఇచ్చాడు. బుచ్చి బాబు టోర్నమెంట్, కేఎస్‌సీఏ ఈవెంట్‌లలో చూపిన ప్రదర్శన అతడిని ఇరానీ కప్ ఎంపికకు దగ్గర చేసింది. కేకేఆర్‌కు నెట్ బౌలర్‌గా కూడా పనిచేసిన అనుభవం అతడి ప్రయాణంలో మరో దశగా నిలిచింది.
చివరకు ముంబై జట్టులో చోటు దక్కింది. రెస్ట్ ఆఫ్ ఇండియాతో జరిగిన ఇరానీ కప్‌లో ఫస్ట్‌క్లాస్ అరంగేట్రం చేశాడు. ముంబైకి చెందిన ప్రముఖ దేశవాళీ జట్టులో ఆడటం అతడికి ఎంతో ప్రత్యేకమైన ఘట్టంగా మారింది. అంతేకాదు, ఆ మ్యాచ్ ముంబైకి ఇరానీ కప్ టైటిల్ దక్కిన సందర్భంగా కూడా నిలిచింది.
ఆటో నడిపిన రోజుల్లో రోజువారీ ఖర్చుల కోసం పోరాడిన జునేద్‌కు ముంబై జెర్సీ దక్కే వరకు ప్రయాణం సులభంగా సాగలేదు. చిన్న ఉద్యోగాలు, ఆర్థిక ఇబ్బందులు, పరిమిత వనరులు ఉన్నా బౌలింగ్‌ను కొనసాగించాడు. ఒక అవకాశం దొరికినప్పుడు దాన్ని ఉపయోగించుకున్నాడు. అందుకే జునేద్ ఖాన్ కథ కేవలం క్రికెట్ ఎంపిక కథ కాదు.. ముంబై మైదానాల్లో తనకంటూ స్థానం సంపాదించుకున్న ఒక యువ ఫాస్ట్ బౌలర్ ప్రయాణం.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..