Champions Trophy: ఇంగ్లండ్‌ ఓటమికి కారణమైన సొంత దేశ ఆటగాడు! ఆఫ్ఘాన్‌ వెనకున్న శక్తి అతనే

ఇంగ్లండ్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నుండి నిష్క్రమించింది. ఆఫ్ఘనిస్థాన్‌ చేతిలో 8 పరుగుల తేడాతో ఓడిపోయింది. మాజీ ఇంగ్లండ్ ఆటగాడు జోనాథన్ ట్రోట్ ఆఫ్ఘనిస్థాన్ కోచ్‌గా ఉన్నాడు. అతని మార్గదర్శకత్వంలో ఆఫ్ఘనిస్థాన్ అద్భుత ప్రదర్శన చేసింది. ఇంగ్లండ్ ఓటమికి ట్రోట్ ప్రధాన కారణం అని చెప్పవచ్చు. ఈ ఓటమి ఇంగ్లాండ్‌కు గట్టి షాక్.

Champions Trophy: ఇంగ్లండ్‌ ఓటమికి కారణమైన సొంత దేశ ఆటగాడు! ఆఫ్ఘాన్‌ వెనకున్న శక్తి అతనే
England

Updated on: Feb 27, 2025 | 7:19 AM

ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 నుంచి ఇంగ్లండ్‌ నిష్క్రమించింది. బుధవారం లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో బట్లర్‌ సేన 8 పరుగుల తేడాతో ఆఫ్ఘానిస్థాన్‌ చేతిలో ఓటమి పాలైంది. ఇక మార్చ్‌ 1న సౌతాఫ్రికా మిగిలి ఉన్న మ్యాచ్‌ ఇంగ్లండ్‌కు నామమాత్రమే. సౌతాఫ్రికాకు మాత్రం చాలా కీలకం. ఆ విషయం పక్కనపెడితే.. గ్రూప్‌-బీలో బలహీనమైన టీమ్‌గా ఉన్న ఆఫ్ఘాన్‌ చేతిలో ఓటమిపాలవ్వడం ఇంగ్లండ్‌కు గట్టి షాక్‌. నిజానికి ఇంగ్లండ్ టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగింది. కానీ, తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారీ స్కోర్‌ చేసినా ఓటమి పాలైంది. ఇప్పుడు ఆఫ్ఘాన్‌ చేతిలో భారీ స్కోర్‌ ఛేజ్‌ చేయలేకపో పరాజయం పొందింది.

కాగా, ఆఫ్ఘాన్‌ చేతిలో ఓటమే ఇంగ్లండ్‌ను ఎక్కువగా బాధిస్తోంది. అయితే.. ఆఫ్ఘాన్‌ అంతలా చెలరేగడానికి, ఇంగ్లండ్‌ ఓడిపోవడానికి కారణం మాత్రం.. మరో ఇంగ్లండ్‌ మాజీ ఆటగాడు. అతనే జోనాథన్ ట్రోట్. 2009 నుంచి 2015 మధ్య కాలంలో ఇంగ్లండ్‌ తరఫున టాప్‌ ఆర్డర్‌ బ్యాటర్‌గా ఆడిన ట్రోట్‌.. 2022 నుంచి ఆఫ్ఘనిస్థాన్‌ కోచ్‌గా పనిచేస్తున్నాడు. అతని కోచింగ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌ మంచి ప్రదర్శన కనబరుస్తున్న విషయం తెలిసిందే. గతంలో 2023 వన్డే వరల్డ్‌ కప్‌లో కూడా ఆఫ్ఘాన్‌ ఇంగ్లండ్ ను ఓడించింది. ఇప్పుడో మరోసారి ఆ టీమ్ ను ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇంటికి పంపింది. ఇలా ఆఫ్ఘాన్‌ విజయాల వెనుక కనిపించని శక్తిగా అతనే ఉన్నాడు.

నిజానికి ట్రోట్‌ ఇంగ్లండ్‌ దేశస్థుడు కాదు. సౌతాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో పుట్టి పెరిగాడు. సౌతాఫ్రికా తరఫున అండర్‌-15, అండర్‌-19 క్రికెట్‌ కూడా ఆడాడు. కానీ, ఆ తర్వాత ఇంగ్లండ్‌కు వెళ్లి అక్కడ దేశవాళి క్రికెట్‌లో రాణించి.. జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. 2009లో ఆస్ట్రేలియాతో జరిగిన యాషెస్‌ సిరీస్‌ చివరి టెస్టు మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. ఆడిన తొలి టెస్ట్‌లోనే సెంచరీ సాధించి.. అందరి దృష్టిని ఆకర్షించాడు. 2011లో ఐసీసీ క్రికెట్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా కూడా ఎంపికయ్యాడు ట్రోట్‌. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్‌ అయ్యాక.. కోచింగ్‌ వైపు సెకండ్‌ ఇన్నింగ్స్‌ మొదలుపెట్టాడు. 2022లో ఆఫ్గాన్‌ హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టి.. ఆ టీమ్‌ను అద్భుతంగా ముందుకు నడిపిస్తున్నాడు. ఇప్పుడు తన సొంత జట్టుకు వ్యతిరేకంగా గెలిచేంత స్ట్రాంగ్‌గా ఆఫ్ఘాన్‌ టీమ్‌ను బిల్డ్‌ చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.