Jemimah Rodrigues : సూపర్ హీరోలా ఫీలై దూకేసింది..కానీ సీన్ రివర్స్ అయింది…చావు అంచు దాకా వెళ్లొచ్చిన జెమిమా

Jemimah Rodrigues : భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్, ఎప్పుడూ నవ్వుతూ తుళ్లుతూ ఉండే జెమిమా రోడ్రిగ్స్ చిన్నప్పుడు ఒక పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. ఎనిమిదేళ్ల వయసులో జరిగిన ఒక సంఘటన తన ప్రాణాల మీదకు తెచ్చిందని ఆమె తాజాగా వెల్లడించింది.

Jemimah Rodrigues : సూపర్ హీరోలా ఫీలై దూకేసింది..కానీ సీన్ రివర్స్ అయింది...చావు అంచు దాకా వెళ్లొచ్చిన జెమిమా
Jemimah Rodrigues Bat

Updated on: Jan 09, 2026 | 7:00 PM

Jemimah Rodrigues : భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ బ్యాటర్, ఎప్పుడూ నవ్వుతూ తుళ్లుతూ ఉండే జెమిమా రోడ్రిగ్స్ చిన్నప్పుడు ఒక పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. ఎనిమిదేళ్ల వయసులో జరిగిన ఒక సంఘటన తన ప్రాణాల మీదకు తెచ్చిందని ఆమె తాజాగా వెల్లడించింది. ప్రముఖ షో బ్రేక్‌ఫాస్ట్ విత్ ఛాంపియన్స్‎లో పాల్గొన్న జెమిమా.. తన బాల్యంలోని ఆ భయంకరమైన, అదే సమయంలో నవ్వు తెప్పించే జ్ఞాపకాన్ని అభిమానులతో పంచుకుంది.

జెమిమాకు 8 ఏళ్లు ఉన్నప్పుడు తన బంధువులతో కలిసి ఒక చర్చి కార్యక్రమానికి వెళ్లిందట. పెద్దలంతా లోపల ప్రార్థనల్లో ఉండగా, పిల్లలంతా బయట చప్పల్ ఫైట్ అనే ఆట ఆడుకుంటున్నారు. ఒకరిపై ఒకరు చెప్పులు విసురుకోవడం, వాటిని వెళ్లి తీసుకురావడం ఆ ఆట నియమం. ఆ క్రమంలో జెమిమా కజిన్ ఒకరు తన చెప్పును మొదటి అంతస్తు నుండి అవతలికి విసిరారు. దాంతో జెమిమా ఒక నిజమైన హీరోలా ఫీలవుతూ, ఆ చెప్పును తీసుకువస్తానంటూ అమాంతం మొదటి అంతస్తు నుంచి కిందకు దూకేసింది.

మొదటి అంతస్తు నుంచి కిందపడటమంటే అది ప్రాణాంతకమైన విషయమే. కానీ జెమిమాకు ఒక వింతైన రీతిలో ప్రాణాపాయం తప్పింది. జెమిమా బిల్డింగ్ నుంచి పడినప్పుడు, సరిగ్గా కింద ఒక వ్యక్తి కూర్చుని ఉన్నారట. ఆమె నేరుగా వెళ్లి ఆ వ్యక్తి తల మీద పడింది. దీనివల్ల ఆమెకు ఎముకలు విరగడం వంటి పెద్ద గాయాలేమీ కాలేదు. కానీ ఆమె పడిపోయిన తీరు చూసి తన కజిన్స్ అంతా ఆమె చనిపోయిందేమో అని భయపడిపోయారట. ఈ విషయాన్ని జెమిమా నవ్వుతూ చెబుతుంటే షోలో అందరూ ఆశ్చర్యపోయారు.

చిన్నప్పుడు అంత ప్రమాదం నుంచి తప్పించుకున్న ఈ స్టార్ క్రికెటర్, ఇప్పుడు మహిళా ప్రీమియర్ లీగ్‎లో ఒక పెద్ద బాధ్యతను చేపట్టబోతోంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ ఈసారి జట్టు కెప్టెన్సీ పగ్గాలను జెమిమాకు అప్పగించింది. ఇటీవల జరిగిన ఐసీసీ మహిళా ప్రపంచ కప్‌లో భారత్ చారిత్రాత్మక విజయం సాధించడంలో జెమిమా కీలక పాత్ర పోషించింది. ఆ నమ్మకంతోనే ఢిల్లీ టీమ్ ఆమెను కెప్టెన్‌గా ఎంచుకుంది.

డబ్ల్యూపీఎల్ చరిత్రలో జెమిమాకు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఇప్పటివరకు ఆమె 27 మ్యాచ్‌లు ఆడి 507 పరుగులు చేసింది. ఇందులో ఆమె స్ట్రైక్ రేట్ 139.67గా ఉండటం విశేషం. మిడిల్ ఆర్డర్‌లో వేగంగా పరుగులు రాబట్టడమే కాకుండా, జట్టులో ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీ నింపే జెమిమా.. ఈసారి కెప్టెన్‌గా ఢిల్లీకి కప్పు అందిస్తుందో లేదో చూడాలి.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..