IND vs WI : యశస్వి జైస్వాల్‌ను టార్గెట్ చేసిన వెస్టిండీస్ బౌలర్.. డబుల్ పనిష్మెంట్ ఇచ్చిన ఐసీసీ

భారత్, వెస్టిండీస్ మధ్య ఢిల్లీలో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో విండీస్ జట్టు ప్రదర్శన పేలవంగా ఉంది. మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా 518 పరుగులు చేస్తే, వెస్టిండీస్ 248 పరుగులకే ఆలౌటై ఫాలోఆన్ ఆడే పరిస్థితి వచ్చింది. జట్టు ప్రదర్శన ఒకవైపు అయితే, విండీస్ యువ ఫాస్ట్ బౌలర్ జేడెన్ సీల్స్ తన ప్రవర్తన కారణంగా మరో సమస్యలో చిక్కుకున్నాడు.

IND vs WI : యశస్వి జైస్వాల్‌ను టార్గెట్ చేసిన వెస్టిండీస్ బౌలర్.. డబుల్ పనిష్మెంట్ ఇచ్చిన ఐసీసీ
Jayden Seales

Updated on: Oct 12, 2025 | 7:27 PM

IND vs WI : భారత్, వెస్టిండీస్ మధ్య ఢిల్లీలో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో విండీస్ జట్టు ప్రదర్శన పేలవంగా ఉంది. మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా 518 పరుగులు చేస్తే, వెస్టిండీస్ 248 పరుగులకే ఆలౌటై ఫాలోఆన్ ఆడే పరిస్థితి వచ్చింది. జట్టు ప్రదర్శన ఒకవైపు అయితే, విండీస్ యువ ఫాస్ట్ బౌలర్ జేడెన్ సీల్స్ తన ప్రవర్తన కారణంగా మరో సమస్యలో చిక్కుకున్నాడు. మొదటి ఇన్నింగ్స్‌లో వికెట్ తీయలేకపోయిన ఫ్రస్టేషన్లో భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను ఉద్దేశిస్తూ బంతిని ప్రమాదకరంగా విసిరినందుకు ఐసీసీ నుంచి భారీ జరిమానా, డిమెరిట్ పాయింట్‌ రూపంలో డబుల్ పనిష్మెంట్ ఎదుర్కొన్నాడు.

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన టెస్టు మ్యాచ్‌ తొలి రోజు ఈ ఘటన జరిగింది. భారత ఇన్నింగ్స్ 29వ ఓవర్‌లో సీల్స్ బౌలింగ్ చేస్తుండగా, యశస్వి జైస్వాల్ ఆ బంతిని తిరిగి బౌలర్ వైపు ఆడాడు. ఆ బంతిని సీల్స్ పట్టుకున్న వెంటనే, వికెట్ తీయలేకపోయాననే కోపంతో బంతిని తిరిగి జైస్వాల్ వైపు దూకుడుగా విసిరాడు. ఆ బంతి నేరుగా భారత బ్యాట్స్‌మెన్ ప్యాడ్‌కు తగిలింది.

బంతిని విసిరిన వెంటనే జేడెన్ సీల్స్ క్షమాపణ చెప్పినప్పటికీ, ఈ దూకుడు ప్రవర్తన గురించి అంపైర్లు మ్యాచ్ రెఫరీకి ఫిర్యాదు చేశారు. మ్యాచ్ రెఫరీ ఈ ఆరోపణల గురించి సీల్స్‌కు వివరించినప్పుడు, అతను మొదట తన తప్పును అంగీకరించడానికి నిరాకరించాడు. జైస్వాల్ క్రీజ్ నుంచి బయట ఉండడం వల్ల తాను అతన్ని రనౌట్ చేయాలనుకున్నానని, అందుకే బంతి విసిరానని సీల్స్ వివరణ ఇచ్చాడు. అయితే, రెఫరీ అతనికి ఆ ఘటనకు సంబంధించిన రీప్లేలను చూపించి, అతని చర్య ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ లోని ఆర్టికల్ 2.9 ను ఉల్లంఘించిందని స్పష్టం చేశారు. ఈ ఆర్టికల్ ప్రకారం బంతిని లేదా మరేదైనా వస్తువును ఆటగాడి వైపు లేదా అతనిపైకి ప్రమాదకరంగా విసరడం నిబంధనలకు విరుద్ధం.

ఈ ఉల్లంఘన కారణంగా జేడెన్ సీల్స్‌పై ఐసీసీ డబుల్ పనిష్మెంట్ విధించింది. సీల్స్ మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించారు. అంటే, అతనికి రావాల్సిన మ్యాచ్ ఫీజులో 25% కోత పడుతుంది. అతనికి ఒక డిమెరిట్ పాయింట్ కూడా ఇచ్చారు. గడిచిన 24 నెలల్లో సీల్స్‌కు ఇది రెండో డిమెరిట్ పాయింట్ కావడం గమనార్హం. ఒక ఆటగాడికి 4 డిమెరిట్ పాయింట్లు లభించినట్లయితే, అతన్ని ఒక టెస్ట్ లేదా రెండు వన్డేలు లేదా రెండు టీ20 మ్యాచ్‌ల నుంచి నిషేధించే అవకాశం ఉంటుంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..