
గ్రౌండ్‌లో తన యార్కర్లతో ప్రత్యర్థి బ్యాటర్ల వికెట్లు పడగొట్టే టీమిండియా స్టార్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్.. ఇప్పుడు ఒక రహస్య యువతి చేతిని పట్టుకుని నెటిజన్ల మనసు పడగొట్టారు. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో అర్ష్‌దీప్ సింగ్‌కు సంబంధించిన కొన్ని ఫోటోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ పంజాబీ గబ్బర్ ప్రేమలో పడ్డాడా? ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరు? అనే చర్చ క్రికెట్ సర్కిల్స్‌లో జోరుగా సాగుతోంది. అర్ష్‌దీప్ స్వయంగా షేర్ చేసిన ఒక ఫోటోలో ఆయన ఒక యువతి చేతిని ప్రేమగా పట్టుకుని కనిపిస్తున్నారు. అయితే ఆ ఫోటోలో సదరు యువతి ముఖం కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. కానీ మన నెటిజన్లు ఊరుకుంటారా? ఫోటోలో కనిపిస్తున్న ఆ అమ్మాయి చేతిపై ఉన్న టాటూ ఆధారంగా ఆమె ఎవరో కనిపెట్టే పనిలో పడ్డారు.
ఆ ఫోటోలో ఉన్నది పంజాబీ నటి సమ్రీన్ కౌర్ అని సోషల్ మీడియాలో గట్టి ప్రచారం జరుగుతోంది. దానికి ప్రధాన కారణం ఆ యువతి చేతిపై ఉన్న పచ్చబొట్టు, సమ్రీన్ కౌర్ చేతిపై ఉన్న టాటూతో సరిగ్గా సరిపోవడమే. గతంలో ఐపీఎల్ మ్యాచ్‌ల సమయంలో పంజాబ్ కింగ్స్ జట్టును ఉత్సాహపరచడానికి సమ్రీన్ కౌర్ స్టేడియంలో సందడి చేశారు. అప్పటి నుండి వీరిద్దరి మధ్య ఏదో ఉందనే వార్తలు వినిపిస్తున్నప్పటికీ, ఈ తాజా ఫోటోతో ఆ పుకార్లు మరింత బలపడ్డాయి.
పంజాబీ చిత్ర పరిశ్రమలో ఎదుగుతున్న నటి సమ్రీన్ కౌర్. అనేక పాపులర్ మ్యూజిక్ ఆల్బమ్స్‌లో నటించి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన 83 సినిమాలో కూడా సమ్రీన్ నటించారు. 1983 ప్రపంచకప్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ఆమె ఒక క్రికెటర్ కాబోయే భార్య పాత్రను పోషించడం విశేషం. ఇప్పుడు నిజ జీవితంలో కూడా ఆమె ఒక క్రికెటర్‌తో వార్తల్లో నిలవడం యాదృచ్ఛికం.
ఈ వ్యవహారంపై అర్ష్‌దీప్ సింగ్ గానీ, సమ్రీన్ కౌర్ గానీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ సోషల్ మీడియా వేదికగా అర్ష్‌దీప్ పోస్ట్ చేసిన ఆ మిస్టరీ ఫోటో మాత్రం అభిమానులకు ఒక క్లారిటీ ఇచ్చేసినట్లే కనిపిస్తోంది. పంజాబీ ముద్దుబిడ్డ త్వరలోనే తన జీవిత భాగస్వామిని ప్రపంచానికి పరిచయం చేస్తారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.