
IPL 2027 Trading : ఐపీఎల్ 2027 సీజన్ ప్రారంభానికి ఇంకా చాలా టైం ఉన్నప్పటికీ, ఫ్రాంచైజీల మధ్య ఆటగాళ్ల ట్రేడింగుకు సంబంధించిన వార్తలు ఇప్పుడే క్రికెట్ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా భవిష్యత్తుపై సరికొత్త చర్చ మొదలైంది. ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ జట్టు పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకుని ఘోరంగా విఫలమైన సంగతి తెలిసిందే. హార్దిక్ పాండ్యా నాయకత్వంలో ముంబై జట్టు ప్లేఆఫ్స్‌కు చేరుకోలేకపోవడం ఇది వరుసగా రెండోసారి. దీంతో అతనిని జట్టు నుంచి రిలీజ్ చేస్తారా లేదా వేరే జట్టుకు ట్రేడ్ చేస్తారా అనే ఊహాగానాలు జోరందుకున్నాయి.
చెన్నై సూపర్ కింగ్స్ పెట్టిన ఆ ఒక్క పోస్ట్
ఈ ఊహాగానాలకు మరింత ఆజ్యం పోస్తూ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఫ్రాంచైజీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఒక వింతైన పోస్ట్‌ను షేర్ చేసింది. కేవలం ఒక ఫోన్ ఎమోజీ, కళ్ల ఎమోజీలతో పాటు రొటేషన్ సింబల్‌ను జత చేస్తూ.. “📞👀🔄 #WhistlePodu #LeoHotline” అని రాసుకొచ్చింది. దీనికి ఎలాంటి వివరణ ఇవ్వకపోవడంతో అభిమానులు తమకు నచ్చినట్లుగా అంచనాలు వేయడం ప్రారంభించారు. సీఎస్‌కే ఏదో పెద్ద ట్రేడింగ్ అనౌన్స్‌మెంట్ చేయబోతుందని భావించిన అభిమానులు.. “హార్దిక్ పాండ్యా చెన్నై సూపర్ కింగ్స్‌కు వస్తున్నాడా?” అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపించారు. హార్దిక్ సీఎస్‌కేలోకి వస్తే ఇక పూనకాలే అంటూ కామెంట్లు పెడుతున్నారు.
hardik coming to csk, let's goooo pic.twitter.com/8dUKaVCVeL
— Vijay Kage (@Vijayy_04) July 11, 2026
Tell me leo it's Hardik pandya please 🙌💛😭
— `Zenith (@Msdcore7) July 11, 2026
Hardik to CSK 💛
Dube and Khaleel to MI 💙Ashutosh and Vipraj to CSK 💛
Noor to DC 💙#LeoHotline #WhistlePodu— YELLOW PHOENIX (@YellowPhoenix13) July 11, 2026
శివమ్ దూబే ముంబైకి.. హార్దిక్ చెన్నైకా?
సోషల్ మీడియాలో అభిమానులు కేవలం ప్రశ్నలు అడగడమే కాకుండా, తామే సొంతంగా కొన్ని క్రేజీ ట్రేడింగ్ లెక్కలను కూడా సృష్టించి వైరల్ చేస్తున్నారు. అందులో ఒక అభిమాని రాస్తూ.. “హార్దిక్ పాండ్యా సీఎస్‌కేకు వస్తాడు.. బదులుగా శివమ్ దూబే, ఖలీల్ అహ్మద్ ముంబై ఇండియన్స్‌కు వెళ్తారు. అశుతోష్, విప్రాజ్ సీఎస్‌కేకు వస్తే, నూర్ అహ్మద్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు వెళ్తాడు” అంటూ ఒక పెద్ద ఈక్వేషన్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. నిజానికి గత కొన్ని వారాలుగా ముంబై ఇండియన్స్ గనుక హార్దిక్ పాండ్యాను వదిలేస్తే, అతనిని దక్కించుకోవడానికి చెన్నై సూపర్ కింగ్స్‌తో పాటు కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. ఎంఎస్ ధోనీతో హార్దిక్‌కు ఉన్న మంచి అనుబంధం వల్ల అతను సీఎస్‌కే వైపే మొగ్గు చూపుతాడని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.
హార్దిక్ పాండ్యా సీఎస్‌కేలోకి వస్తున్నాడనే వార్తల్లో నిజమెంత?
అయితే ఈ ట్రేడింగ్ రూమర్లపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. పైగా ఈ వార్తలను చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం గతంలోనే స్పష్టంగా తోసిపుచ్చింది. ఈ విషయంపై సీఎస్‌కే సీఈఓ కాశీ విశ్వనాథన్ స్పందిస్తూ.. “ఐపీఎల్ సీజన్‌కు సంబంధించిన రివ్యూను కూడా మేము ఇంకా నిర్వహించలేదు. ప్రస్తుతం జరుగుతున్న మేజర్ లీగ్ క్రికెట్(MLC) ముగిసిన తర్వాతే మేము దాని గురించి ఆలోచిస్తాం. నేను ప్రస్తుతం అమెరికాలో ఉన్నాను. మేము హార్దిక్ పాండ్యాతో కానీ లేదా మరే ఇతర ఆటగాడితో కానీ ఎలాంటి చర్చలు జరపలేదు. సోషల్ మీడియాలో హార్దిక్, సీఎస్‌కే ట్రేడింగ్ గురించి వస్తున్న వార్తలన్నీ ముమ్మాటికీ అవాస్తవం” అని ఆయన క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ సీఎస్‌కే పోస్ట్ చేసిన తాజా ట్వీట్ మాత్రం అభిమానుల్లో ఆశలను సజీవంగా ఉంచింది.