
BCCI vs BCB : భారతదేశంపై నిరంతరం విషం చిమ్మే పాకిస్థాన్‌తో మన క్రికెట్ సంబంధాలు తెగిపోయి ఏళ్లు గడుస్తున్నాయి. ఇప్పుడు అదే దారిలో బంగ్లాదేశ్ కూడా పయనిస్తున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. భారత్ అంటేనే కన్నెర్ర జేస్తున్న బంగ్లాదేశ్ యువత, అక్కడి ప్రస్తుత పరిస్థితులు క్రికెట్ బంధాన్ని తుంచేసేలా ఉన్నాయి. ప్రపంచ క్రికెట్‌ను శాసించే బీసీసీఐ పవర్ ఏంటో తెలిసి కూడా, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆడుతున్న ఈ ప్రమాదకరమైన ఆట ఆ దేశ క్రీడా భవిష్యత్తునే ప్రశ్నార్థకం చేస్తోంది. 2008 ముంబై దాడుల తర్వాత భారత్, పాకిస్థాన్‌లో పర్యటించడం మానేసింది. ఫలితంగా పాక్ బోర్డు వేల కోట్ల ఆదాయాన్ని కోల్పోయి, ఇప్పుడు ప్రపంచ క్రికెట్‌లో ఒక సామాన్య జట్టుగా మిగిలిపోయింది. గతేడాది ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలోనూ భారత్ కఠినంగా వ్యవహరించడంతో పాక్ దిగిరాక తప్పలేదు. సరిగ్గా ఇలాంటి సంక్షోభంలోకే ఇప్పుడు బంగ్లాదేశ్ అడుగుపెడుతోంది. షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత భారత్-బంగ్లా మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. అక్కడ హిందువులపై జరుగుతున్న దాడులు భారతీయులను ఆగ్రహానికి గురిచేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్ వంటి స్టార్ ప్లేయర్లను కోల్‌కతా నైట్‌రైడర్స్ విడుదల చేయడం అగ్నికి ఆజ్యం పోసింది.
వచ్చే నెలలో భారత్, శ్రీలంక సంయుక్తంగా టీ20 ప్రపంచకప్‌కు ఆతిథ్యమిస్తున్నాయి. షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ తన మ్యాచ్‌లన్నీ భారత్‌లోనే ఆడాలి. కానీ తమ మ్యాచులను శ్రీలంకకు మార్చాలని బంగ్లా బోర్డు ఐసీసీని కోరింది. అందుకు ఐసీసీ నిరాకరించడంతో, తాము అసలు భారత్‌కే రాబోమంటూ బంగ్లాదేశ్ భీష్మించుకు కూర్చుంది. ఇది కేవలం మొండితనం మాత్రమే కాదు, ఆ దేశ క్రికెట్ పతనానికి ఆరంభం కూడా. ప్రపంచ క్రికెట్ ఆదాయంలో 70 శాతానికి పైగా వాటా ఉన్న బీసీసీఐని కాదని ఏ బోర్డు కూడా మనుగడ సాగించలేదు. ముఖ్యంగా ఐసీసీ ఛైర్మన్ పదవిలో భారతీయుడైన జై షా ఉన్న సమయంలో బంగ్లాదేశ్ ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం ఆత్మహత్యాసదృశ్యమే.
భారత్, బంగ్లాదేశ్ మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు ఆగిపోతే, బీసీబీకి వందల కోట్ల నష్టం వాటిల్లుతుంది. ఇప్పటికే బంగ్లాలో అంతర్గత అల్లర్ల వల్ల ఏ దేశం కూడా అక్కడికి వెళ్లి క్రికెట్ ఆడే పరిస్థితి లేదు. భారతీయ స్పాన్సర్లు కూడా బంగ్లా ఆటగాళ్లతో ఒప్పందాలను రద్దు చేసుకునే ఆలోచనలో ఉన్నారు. తమీమ్ ఇక్బాల్ వంటి సీనియర్ ఆటగాళ్లు ఇది చాలా ప్రమాదకరమని హెచ్చరిస్తున్నా, బంగ్లా బోర్డు మాత్రం వినడం లేదు. తమ మాట వినని ఆటగాళ్లను ఇండియా ఏజెంట్లు అని ముద్ర వేయడం గమనార్హం.
క్రీడలను దౌత్యానికి దూరంగా ఉంచాలని అందరూ కోరుకుంటారు, కానీ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, పొరుగు దేశంలో భారత్ పట్ల పెరుగుతున్న విద్వేషం అటు బీసీసీఐని, ఇటు భారత ప్రభుత్వాన్ని కఠిన నిర్ణయాల వైపు నడిపిస్తున్నాయి. బంగ్లాదేశ్ కనుక తన పంథా మార్చుకోకపోతే, ఆ దేశంలో క్రికెట్ కేవలం ఒక జ్ఞాపకంగా మిగిలిపోయే రోజులు దగ్గరలోనే ఉన్నాయి.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..