IND vs AUS: ఛాంపియన్ ప్లేయర్‌‌ను బెంచ్‌లో ఉంచడమేంటి.. చెత్త టీంతో గెలుపెలా సాధ్యం: మాజీ ప్లేయర్

India vs Australia ODI Series: మొత్తంగా, ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కోల్పోవడానికి బ్యాటింగ్ వైఫల్యంతో పాటు, ముఖ్యమైన వికెట్లు తీయగలిగే స్పెషలిస్ట్ స్పిన్నర్ లేకపోవడం కూడా ఒక కారణమని, కుల్దీప్‌ను పక్కన పెట్టడం వ్యూహాత్మక తప్పిదమని ఇర్ఫాన్ పఠాన్ స్పష్టం చేశారు.

IND vs AUS: ఛాంపియన్ ప్లేయర్‌‌ను బెంచ్‌లో ఉంచడమేంటి.. చెత్త టీంతో గెలుపెలా సాధ్యం: మాజీ ప్లేయర్
Ind Vs Aus

Updated on: Oct 24, 2025 | 7:50 AM

India vs Australia: ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా ఓటమి పాలవ్వడంపై మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందించారు. ముఖ్యంగా, భారత జట్టు మేనేజ్‌మెంట్ స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను తుది జట్టులో తీసుకోకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సిరీస్‌లో భారత్ ప్రదర్శన, జట్టు కూర్పుపై పఠాన్ తన అభిప్రాయాలను వెల్లడించారు.

ఆస్ట్రేలియా పర్యటనలో తొలి వన్డేలో భారత్ ఓటమి పాలైన వెంటనే ఇర్ఫాన్ పఠాన్ తన సోషల్ మీడియా వేదికగా కుల్దీప్ యాదవ్‌ను జట్టులోకి తీసుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. “తరువాత మ్యాచ్‌కు కుల్దీప్ యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకురావడానికి టీమిండియా ఏదైనా మార్గాన్ని కనుగొనగలదా? నా అభిప్రాయం ప్రకారం, వారు తప్పకుండా ప్రయత్నించాలి,” అని ఆయన ట్వీట్ చేశారు.

ఆ తర్వాతి మ్యాచ్‌లలో కూడా కుల్దీప్‌ను ఆడించకపోవడంపై పఠాన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో మరింత లోతుగా విశ్లేషించారు. ఆస్ట్రేలియా మిడిల్ ఆర్డర్‌ను ఇబ్బంది పెట్టగలిగే కీలక బౌలర్ కుల్దీప్ యాదవ్ అని ఆయన పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

బ్యాటింగ్ డెప్త్ కోసం నాణ్యతను త్యాగం చేయడం సరైనదేనా?

జట్టు మేనేజ్‌మెంట్ బ్యాటింగ్ డెప్త్‌ (ఎనిమిదో స్థానం వరకు బ్యాటింగ్ సామర్థ్యం) కోసం కుల్దీప్ యాదవ్ వంటి మ్యాచ్ విన్నర్‌ను పక్కన పెట్టడం సరికాదని పఠాన్ అభిప్రాయపడ్డారు. కుల్దీప్‌ స్థానంలో వాషింగ్టన్ సుందర్ లేదా మరో ఆల్‌రౌండర్‌ను ఆడించడంపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు.

“జట్టులో కుల్దీప్ యాదవ్‌కు చోటు ఉందా? మీరు అతనికి ఎలా చోటు కల్పిస్తారు? నితీష్ రెడ్డిని మూడవ పేసర్‌గా ఆడించి, అతన్ని ఏడెనిమిది ఓవర్లు వేయించగలిగితే, కుల్దీప్‌ను కూడా ఆడించవచ్చు. కానీ, టీమిండియా ఏమి చేస్తోంది? వారు 8వ స్థానం వరకు బ్యాటింగ్ కావాలనుకుంటున్నారు. టీమ్‌ను నడపడం అంత తేలిక కాదు, నాకు తెలుసు. కానీ, కుల్దీప్ లాంటి బౌలర్ ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ను ఇబ్బంది పెట్టగలడు. వారి మిడిల్ ఆర్డర్ అంత బలంగా లేదు,” అని పఠాన్ వ్యాఖ్యానించారు.

ఇర్ఫాన్ పఠాన్ మాత్రమే కాకుండా, రవిచంద్రన్ అశ్విన్ వంటి మాజీ క్రికెటర్లు కూడా కుల్దీప్ యాదవ్ వంటి అద్భుతమైన ఫామ్‌లో ఉన్న బౌలర్‌ను పదేపదే పక్కన పెట్టడం అతని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుందని, జట్టు కూర్పుపై ఇది తప్పుడు సందేశాన్ని పంపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆసియా కప్‌లో కుల్దీప్ యాదవ్ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచినప్పటికీ, ఆస్ట్రేలియా సిరీస్‌లో అతనికి ఒక్క మ్యాచ్‌లో కూడా అవకాశం దక్కకపోవడం గమనార్హం.

మొత్తంగా, ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కోల్పోవడానికి బ్యాటింగ్ వైఫల్యంతో పాటు, ముఖ్యమైన వికెట్లు తీయగలిగే స్పెషలిస్ట్ స్పిన్నర్ లేకపోవడం కూడా ఒక కారణమని, కుల్దీప్‌ను పక్కన పెట్టడం వ్యూహాత్మక తప్పిదమని ఇర్ఫాన్ పఠాన్ స్పష్టం చేశారు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..