IPL Trade Deal: ఆర్‌సీబీ ప్లేయర్‌పై కన్నేసిన కావ్య మారన్.. కట్ చేస్తే షాకింగ్ ట్విస్ట్

IPL Trade Deal: ఐపీఎల్ తదుపరి సీజన్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ వేస్తుంటే ఆర్‌సీబీ సంచలన ట్విస్ట్ ఇచ్చింది. ఆర్‌సీబీ నుంచి జితేష్ శర్మను ట్రేడ్ చేసుకోవాలని చూసిన ఆరెంజ్ ఆర్మీకి, ప్రతిగా స్టార్ ఓపెనర్ ఇషాన్ కిషన్‌ను అడిగి బెంగళూరు యాజమాన్యం షాక్ ఇచ్చింది.

IPL Trade Deal: ఆర్‌సీబీ ప్లేయర్‌పై కన్నేసిన కావ్య మారన్.. కట్ చేస్తే షాకింగ్ ట్విస్ట్
Kavya Maran

Updated on: Aug 13, 2026 | 5:10 PM

IPL Trade Deal: ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుతమైన ప్రదర్శనతో ప్లే ఆఫ్స్‌కు చేరినప్పటికీ ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓడిపోయి ఐపీఎల్ రేసు నుంచి నిష్క్రమించింది. ఈ క్రమంలోనే రాబోయే సీజన్‌లో ఎలాగైనా కప్పు కొట్టాలనే పట్టుదలతో కావ్య మారన్ నేతృత్వంలోని ఎస్‌ఆర్‌హెచ్ యాజమాన్యం ఇప్పటినుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ముఖ్యంగా జట్టులో లోయర్ ఆర్డర్‌లో వేగంగా పరుగులు సాధించే సరైన భారతీయ ఫినిషర్ లేకపోవడం ప్రధాన సమస్యగా మారింది. ఈ బలహీనతను అధిగమించడానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వికెట్ కీపర్ బ్యాటర్ జితేష్ శర్మపై సన్‌రైజర్స్ కన్నేసింది. అతడిని ట్రేడ్ డీల్ ద్వారా జట్టులోకి తీసుకోవాలని ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

ఖంగుతిన్న కావ్య మారన్

జితేష్ శర్మను ఇచ్చేందుకు సిద్ధమేనని సూచనలు ఇచ్చిన ఆర్‌సీబీ, ప్రతిగా ఎస్‌ఆర్‌హెచ్ నుంచి స్టార్ ఓపెనర్ ఇషాన్ కిషన్‌ను ఇవ్వాలని డిమాండ్ చేయడంతో హైదరాబాద్ యాజమాన్యం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఈ ట్రేడ్ చర్చలు తీవ్రంగా జరుగుతున్నాయని, త్వరలోనే ఒక తుది నిర్ణయానికి రానున్నారని సమాచారం. అయితే ఇషాన్ కిషన్ లాంటి ఫామ్‌లో ఉన్న మ్యాచ్ విన్నర్‌ను వదులుకోవడం అంటే సన్‌రైజర్స్‌కు పెద్ద దెబ్బే. ప్యాట్ కమిన్స్ గైర్హాజరీలో జట్టును నడిపించిన ఇషాన్ కిషన్‌ను ఎస్‌ఆర్‌హెచ్ భవిష్యత్తు కెప్టెన్‌గా చూస్తోంది. రాబోయే సీజన్‌లో కమిన్స్ ఆడటంపై సందేహాలు ఉన్న నేపథ్యంలో ఇషాన్‌ను వదులుకునే సాహసం హైదరాబాద్ అసలు చేయకపోవచ్చు.

గణాంకాల లెక్కలు ఏం చెబుతున్నాయి?

గత సీజన్ ప్రదర్శనను పరిశీలిస్తే ఇషాన్ కిషన్ 15 మ్యాచ్‌ల్లో 40.13 సగటుతో ఏకంగా 602 పరుగులు చేసి అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. మరోవైపు ఆర్‌సీబీ బ్యాటర్ జితేష్ శర్మ 12 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 12.89 సగటుతో 116 పరుగులు మాత్రమే చేసి దారుణంగా విఫలమయ్యాడు. ఫామ్‌లో లేని ఒక ఫినిషర్ కోసం, ఆరెంజ్ ఆర్మీ తరఫున అత్యధిక పరుగులు చేసిన నిలకడైన ఓపెనర్‌ను ఎలా వదులుకుంటారని సన్‌రైజర్స్ అభిమానులు సోషల్ మీడియాలో యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ ట్రేడ్ డీల్ చర్చలు ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఆరెంజ్ ఆర్మీ అభిమానుల ఒత్తిడి, జట్టు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కావ్య మారన్ ఎలాంటి కీలక నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us