Rajasthan Royals : కొత్త యజమానుల చేతుల్లోకి రాజస్థాన్ రాయల్స్.. ఐపీఎల్ చరిత్రలోనే బిగ్గెస్ట్ డీల్..ఎన్ని వేల కోట్లు అమ్ముడైదంటే ?

Rajasthan Royals : రాజస్థాన్ రాయల్స్ జట్టు రూ. 15,000 కోట్లకు అమ్ముడుపోయింది. అమెరికన్ బిజినెస్‌మెన్ కాల్ సోమాని, వాల్‌మార్ట్, ఫోర్డ్ వారసులతో కలిసి ఈ భారీ డీల్ కుదుర్చుకున్నారు.ఇప్పటివరకు ఐపీఎల్ ఫ్రాంచైజీల అమ్మకాల్లో ఇదే అత్యధిక ధర కావడం విశేషం.

Rajasthan Royals : కొత్త యజమానుల చేతుల్లోకి రాజస్థాన్ రాయల్స్.. ఐపీఎల్ చరిత్రలోనే బిగ్గెస్ట్ డీల్..ఎన్ని వేల కోట్లు అమ్ముడైదంటే ?
Rajasthan Royals

Updated on: Mar 24, 2026 | 5:13 PM

Rajasthan Royals : ఐపీఎల్ 2026 సీజన్ నెమ్మదిగా వేడెక్కుతున్న వేళ క్రికెట్ ప్రపంచాన్ని ఊపేసే ఒక భారీ డీల్ కుదిరింది. ఐపీఎల్ చరిత్రలోనే మొట్టమొదటి ఛాంపియన్‌గా నిలిచిన రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) జట్టు ఇప్పుడు కొత్త యజమానుల చేతుల్లోకి వెళ్ళింది. దాదాపు 1.65 బిలియన్ డాలర్లు (అంటే మన కరెన్సీలో సుమారు రూ.15,000 కోట్లు) భారీ ధరకు ఈ జట్టు అమ్ముడుపోయింది. ఇది ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన డీల్‌గా రికార్డు సృష్టించింది. అమెరికాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కాల్ సోమాని నేతృత్వంలోని కన్సార్టియం ఈ జట్టును సొంతం చేసుకుంది.

ఐపీఎల్ మొదటి ఎడిషన్ (2008) విజేత అయిన రాజస్థాన్ రాయల్స్ జట్టు యాజమాన్యం పూర్తిగా మారిపోయింది. గత కొద్ది నెలలుగా కొనసాగుతున్న విక్రయ ప్రక్రియ ఎట్టకేలకు ముగిసింది. భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యాపారవేత్త కాల్ సోమాని, ఆయన కన్సార్టియం పెట్టిన 1.65 బిలియన్ డాలర్ల రికార్డు బిడ్‌ను ప్రస్తుత యజమానులు ఆమోదించారు. ఇప్పటివరకు ఐపీఎల్ ఫ్రాంచైజీల అమ్మకాల్లో ఇదే అత్యధిక ధర కావడం విశేషం. ఈ భారీ డీల్ వచ్చే ఐపీఎల్ సీజన్ నుంచి అమల్లోకి రానుంది.

రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఇప్పటివరకు మెజారిటీ వాటా (65 శాతం) భారత సంతతికి చెందిన బ్రిటిష్ వ్యాపారవేత్త మనోజ్ బదాలే దగ్గర ఉండేది. ఆయనతో పాటు అమెరికాకు చెందిన రెడ్‌బర్డ్ క్యాపిటల్ (15 శాతం), లచ్లన్ మర్దోక్ (13 శాతం), ఇతర ఇన్వెస్టర్లకు వాటాలు ఉన్నాయి. అయితే, ప్రస్తుత డీల్ ప్రకారం కాల్ సోమాని నేతృత్వంలోని బృందం 100 శాతం వాటాను కొనుగోలు చేసింది. అంటే ఇకపై రాజస్థాన్ రాయల్స్‌పై పాత యజమానులకు ఎటువంటి హక్కులు ఉండవు.

ఎవరీ కొత్త బాస్ కాల్ సోమాని?

రాజస్థాన్ రాయల్స్ కొత్త యజమాని కాల్ సోమాని అమెరికాలో నివసిస్తున్న భారతీయ సంతతి వ్యాపారవేత్త. ఆయన ఐటీ సర్వీసెస్ అందించే ఇంట్రాఎడ్జ్ అనే ప్రముఖ సంస్థకు యజమాని. కేవలం సోమాని మాత్రమే కాకుండా, ఈ కన్సార్టియంలో ప్రపంచంలోనే అతిపెద్ద రిటైల్ సంస్థ వాల్‌మార్ట్ (Walmart) వారసుడు రాబ్ వాల్టన్, ఫోర్డ్ మోటార్ కంపెనీకి చెందిన షీలా ఫోర్డ్ హాంప్ కూడా భాగస్వాములుగా ఉన్నారు. వీరిద్దరికీ ఇప్పటికే అమెరికాలోని ప్రముఖ రగ్బీ లీగ్ (NFL)లో జట్లు ఉన్నాయి. స్పోర్ట్స్ బిజినెస్‌లో వీరికి ఉన్న అనుభవం రాజస్థాన్ రాయల్స్‌కు ప్లస్ కానుంది.

టీమ్ భవిష్యత్తు, వ్యూహాలు

రాజస్థాన్ రాయల్స్ విక్రయ ప్రక్రియ మార్చి 15తో ముగిసింది. అంబానీ, అదానీ వంటి దిగ్గజాలు ఈ రేసులో ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చినప్పటికీ, సోమాని బృందం వేసిన భారీ బిడ్ అందరినీ ఆశ్చర్యపరిచింది. కొత్త యాజమాన్యం రాకతో జట్టులో పెను మార్పులు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా గ్లోబల్ మార్కెట్‌లో రాజస్థాన్ రాయల్స్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచడమే లక్ష్యంగా సోమాని బృందం పనిచేయనుంది. ఇప్పటికే ఐపీఎల్ 2026 కోసం సన్నాహాలు జరుగుతున్న వేళ, ఈ కొత్త యాజమాన్యం ఆటగాళ్ల ఎంపిక, కోచింగ్ సిబ్బంది విషయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us