IPL 2027: ఈసారి 74 మ్యాచ్‌లు కాదండోయ్.. అంతకుమించి.. సరికొత్తగా 20వ సీజన్..?

IPL 2027 Schedule: ఐపీఎల్ 2027 సరికొత్త రికార్డులకు, మరిన్ని మ్యాచ్‌లకు వేదిక కానుంది. భారీ అంచనాల మధ్య జరగనున్న ఈ 20వ సీజన్ భారత క్రికెట్ అభిమానులను మరోస్థాయి వినోదంలో ముంచెత్తడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో షెడ్యూల్ ఎలా ఉంటుందో ఓసారి చూద్దాం..

IPL 2027: ఈసారి 74 మ్యాచ్‌లు కాదండోయ్.. అంతకుమించి.. సరికొత్తగా 20వ సీజన్..?
Ipl Trophy

Updated on: Jun 03, 2026 | 1:30 PM

IPL 2027: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ ముగిసిందో లేదో, అప్పుడే క్రికెట్ ప్రియుల్లో తదుపరి సీజన్ లీగ్ గురించిన ఉత్కంఠ మొదలైంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత విజయంతో 19వ సీజన్ ముగియగా, ఇప్పుడు అందరి చూపు ఐపీఎల్ 2027 సీజన్ వైపు మళ్లింది. వచ్చే ఏడాది మ్యాచ్‌లు ఎప్పుడు ప్రారంభమవుతాయి, ఎక్కడ చూడాలనే పూర్తి వివరాలు మీకోసం.

ఆర్‌సీబీ సంచలన విజయం.. అప్పుడే తదుపరి సీజన్‌పై కన్ను!

ఇటీవలే ముగిసిన ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) అద్భుత విజయాన్ని అందుకుంది. విరాట్ కోహ్లీ వీరోచిత ఇన్నింగ్స్ సాయంతో గుజరాత్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించి, ఆర్‌సీబీ వరుసగా రెండోసారి ట్రోఫీని ముద్దాడింది. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ ముగిసిన వెంటనే, క్రీడాభిమానులు 2027లో జరగబోయే ఐపీఎల్ 20వ సీజన్ కోసం ఆరా తీయడం ప్రారంభించారు.

మార్చి 14 నుంచి మే 30 వరకు ఐపీఎల్ ధమాకా?

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఐపీఎల్ 2027 సీజన్‌ను వచ్చే ఏడాది మార్చి 14 నుంచి మే 30 వరకు నిర్వహించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ప్రతి ఏటా లాగే మార్చి మధ్యలో ప్రారంభించి మే నెలాఖరుకల్లా ముగించేలా విండోను కేటాయించారు. ఈ 20వ మైలురాయి సీజన్ గతంలో కంటే మరింత వినోదాత్మకంగా, ఉత్కంఠభరితంగా సాగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే దీనిపై బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఈసారి 74 కాదండోయ్.. ఏకంగా 94 మ్యాచ్‌లు!

ఐపీఎల్ 2027 సీజన్‌లో క్రికెట్ అభిమానులకు డబుల్ వినోదం లభించనుంది. ఇప్పటివరకు సాధారణంగా 74 మ్యాచ్‌లు జరుగుతుండగా, వచ్చే సీజన్‌లో మ్యాచ్‌ల సంఖ్యను ఏకంగా 94కి పెంచే అవకాశం ఉన్నట్లు మీడియా నివేదికలు చెప్తున్నాయి. అంటే దాదాపు రెండున్నర నెలల పాటు క్రికెట్ పండుగ దేశాన్ని ఊపేయనుంది.

లైవ్ ప్రసారాలు ఎక్కడ చూడొచ్చు?

టెలివిజన్ హక్కులను కలిగిన స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ద్వారానే టీవీల్లో ఈ మ్యాచ్‌లను వీక్షించవచ్చు. డిజిటల్ ప్రసారాల విషయానికి వస్తే, వయాకామ్ 18 సంస్థ భారీ మొత్తంతో ఐదేళ్ల డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. జియోసినిమా, డిస్నీ+ హాట్‌స్టార్ విలీనం తర్వాత ఏర్పడిన నూతన వేదిక ‘జియో హాట్‌స్టార్’ ద్వారా ఈ మ్యాచ్‌ల డిజిటల్ లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది.

కొత్త వ్యూహాలతో బరిలోకి ఫ్రాంచైజీలు.. కఠినతరం కానున్న నిబంధనలు..

19వ సీజన్ ముగియడంతో అన్ని ఫ్రాంచైజీలు వచ్చే సీజన్ కోసం సరికొత్త వ్యూహాలను రచిస్తున్నాయి. ఖాళీ చేతులతో వెనుదిరిగిన జట్లు వచ్చే ఏడాది ఎలాగైనా ట్రోఫీ సాధించాలనే పట్టుదలతో కొత్తగా జట్లను పునర్నిర్మించేందుకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు, గత సీజన్‌లో కొందరు ఆటగాళ్లు ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన నేపథ్యంలో, ఐపీఎల్ 2027 నుంచి బీసీసీఐ నిబంధనలను మరింత కఠినతరం చేయనుందని సమాచారం.

2026 సీజన్‌ను శాసించిన 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ!

గత సీజన్‌లో ఆర్‌సీబీ విజేతగా నిలిచినప్పటికీ, అభిమానుల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయింది మాత్రం రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ. కేవలం 15 ఏళ్ల వయసులోనే ఈ యువ సంచలనం విధ్వంసకర బ్యాటింగ్‌తో క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. 16 మ్యాచ్‌ల్లో 48.50 సగటుతో, 237.31 స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 776 పరుగులు సాధించాడు. ఇందులో ఒక శతకం, 5 అర్ధశతకాలు ఉన్నాయి. లీగ్ మొత్తంలో 63 ఫోర్లు, 72 సిక్సర్లు బాది భవిష్యత్తు సూపర్ స్టార్‌గా అవతరించాడు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us