
Abid Mushtaq: దులీప్ ట్రోఫీ 2026లో అట్టహాసంగా మొదలైంది. ఈ సీజన్‌లో ముఖ్యంగా జమ్మూ కశ్మీర్‌కు చెందిన స్పిన్నర్ అబిద్ ముస్తాక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. నార్త్ జోన్ టీం తరపున ఆడుతోన్న ఈ ఎడమచేతి వాటం ఆర్థడాక్స్ బౌలర్ అదరగొడుతున్నాడు. స్టార్ బ్యాటర్లతో కూడిన వెస్ట్ జోన్‌కు ఇబ్బందిగా మారాడు. రుతురాజ్ గైక్వాడ్, పృథ్వీ షా వంటి తోపు బ్యాటర్లు ఉన్నప్పటికీ ముస్తాక్ బౌలింగ్‌ను తట్టుకోలేకపోతున్నారు. ఇప్పటికే 5 వికెట్లు పడగొట్టిన ఈ స్పిన్నర్.. తన జట్టు తరపున కీలక ప్లేయర్‌గా మారాడు. దేశవాళీ క్రికెట్‌లో సత్తాచాటుతున్న భారత స్పిన్నర్లకు ఐపీఎల్‌లో డిమాండ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాగా, ఈ జమ్మూ స్పిన్నర్‌పై 2027 ఐపీఎల్ సీజన్‌కు ముందే ఫ్రాంచైజీలు ఫోకస్ పెట్టాయి. ముఖ్యంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ వంటి జట్లు ఈ ఆర్థడాక్స్ బౌలర్ కోసం తీవ్రంగా ఎదురుచూస్తున్నాయి.
దులీప్ ట్రోఫీ అంటే దేశవాళీ క్రికెట్‌లో ట్యాలెంట్‌ను వెలుగులోకి తీసుకొచ్చే అద్భుత వేదిక. 2026 ఎడిషన్‌లో అబిద్ ముస్తాక్ ప్రత్యేకంగా నిలిచాడు. టీ20 క్రికెట్‌లో స్పిన్నర్ల కీలక సవాళ్లలో ఒకటి బ్యాటర్లను భారీ షాట్లు కొట్టకుండా అడ్డుకోవడం. అయితే, ముస్తాక్ మాత్రం బంతిని గాల్లోకి విసిరి, బ్యాటర్లను కవ్విస్తుంటాడు. బ్యాటర్లు ముందుకొచ్చి భారీ షాట్స్ ఆడే ప్రయత్నంలో క్యాచ్ ఔట్ లేదా స్టంప్ ఔట్ అయ్యే అవకాశం ఉంటుంది.
ఎక్కువమంది చదివినది: Video: దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ జెర్సీపై టేప్.. అసలు సీక్రెట్ ఏంటంటే..?
అబిద్ ముస్తాక్ దేశవాళీ టీ20ల్లోనూ ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటి వరకు 42 టీ20 మ్యాచ్‌లు ఆడిన ముస్తాక్.. 39 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఈక్రమంలో ముస్తాక్ ఎకానమీ రేట్ 6.52గా ఉంది. బ్యాటర్లకు అనుకూలమైన భారత పిచ్‌లపై తక్కువ ఎకానమీ రేటుతో బౌలింగ్ చేయడం ముస్తాక్ సామర్థ్యాన్ని చూపిస్తోంది. ఈ నేపథ్యంలో 2027 ఐపీఎల్ సీజన్‌కు ముందు ఈ జమ్మూ బౌలర్‌ని సొంతం చేసుకునేందుకు ఈ మూడు ఫ్రాంచైజీలు ప్రయత్నించే ఛాన్స్ ఉంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుసగా రెండు ఐపీఎల్ టైటిళ్లు గెలిచిన సంగతి తెలిసిందే. అయితే, స్పిన్ విభాగంలో మాత్రం ఈ జట్టులో భారీ లోటు కనిపిస్తోంది. క్రునాల్ పాండ్యా కీలక ఆటగాడిగా మరాడు. మరో ప్రధాన స్పిన్నర్‌గా సుయశ్ శర్మపై జట్టు ఎక్కువగా ఆధారపడుతోంది. ఆర్‌సీబీ తరపున 26 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన సుయశ్ శర్మ 17 వికెట్లు పడగొట్టాడు. ఈ యువ స్పిన్నర్ ఎకానమీ రేట్ 9.01గా ఉండడం కలవరపెడుతోంది. అప్పుడప్పుడు పర్వాలేదనిపించినా, వికెట్లు తీసే విషయంలో మాత్రం తేలిపోతున్నాడు. ఈ క్రమంలో 6.52 ఎకానమీతో బౌలింగ్ చేస్తున్న ముస్తాక్ బెంగళూరు జట్టుకు మరో కీలక స్పిన్నర్‌గా మారే అవకాశం ఉంది. వికెట్లు తీయడంతో పాటు పరుగులను నియంత్రించే సామర్థ్యం ఈ జమ్మూ కాశ్మీర్ బౌలర్‌కు అదనపు బలం.
2026 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ వంటి నాణ్యమైన స్పిన్నర్లు ఉన్న సంగతి తెలిసిందే. అయితే, కుల్దీప్ కొన్ని నెలల క్రితం లక్నో సూపర్ జెయింట్స్‌కు ట్రేడ్ కావడంతో ఢిల్లీ స్పిన్ విభాగంలో భారీ లోటు ఏర్పడింది. అక్షర్ పటేల్ గత కొన్ని సీజన్లుగా తేలిపోతున్నాడు. పూర్వ వైభవాన్ని కోల్పోయాడు. దీంతో మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయగల భారత స్పిన్నర్ కోసం ఢిల్లీ చూస్తోంది. ఈ క్రమంలో ముస్తాక్ ఇందుకు ప్రత్యామ్నాయంగా మారొచ్చని మాజీలు చెబుతున్నారు. 2026 వేలంలో ఢిల్లీ.. జమ్మూ కశ్మీర్‌కే చెందిన ఔకిబ్ నబీని కొనుగోలు చేయడంతో.. ఇప్పుడు మరో జమ్మూ కశ్మీర్ ఆటగాడిపై ఆసక్తి చూపిస్తుందా లేదా అనేది తేలాల్సి ఉంది.
5సార్లు ఐపీఎల్ విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్‌కు ఇటీవలి సీజన్లలో నాణ్యమైన భారత స్పిన్నర్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. రాహుల్ చాహర్ తర్వాత ఆ స్థాయిలో ఆకట్టుకునే స్పిన్నర్ దొరకకపోవడం గమనార్హం. కొంతకాలంగా పీయూష్ చావ్లా ఆ లోటును భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మిచెల్ సాంట్నర్, అల్లా ఘజన్‌ఫర్ జట్టులో ఉన్నారు. అయితే వీరు గాయాలతో ఇబ్బందులు పడుతున్నారు. ముస్తాక్‌ను జట్టులోకి తీసుకుంటే, ముంబై టీంకు ఎంతో అనుకూలంగా మారతాడనడంలో ఎలాంటి సందేహం లేదు. ముంబై ఇండియన్స్ సొంత మైదానం వాంఖడే స్టేడియంలో బౌన్స్ లభిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ముస్తాక్ ఎంతో ఎఫెక్ట్‌గా మారే ఛాన్స్ ఉంది. అందుకే 29 ఏళ్ల ఈ స్పిన్నర్ 2027 సీజన్‌కు ముంబై జట్టుకు తరగని ఆస్తిగా మారే ఛాన్స్ ఉంది.
ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో ఇప్పటికే ఆకట్టుకున్న అబిద్ ముస్తాక్.. ఇప్పుడు టీ20ల్లోనూ తన సత్తా చాటుతున్నాడు. 6.52 ఎకానమీ రేట్, 42 మ్యాచ్‌ల్లో 39 వికెట్లతో ముస్తాక్ బౌలింగ్ సామర్థ్యాన్ని చాటి చెబుతున్నాయి. దులీప్ ట్రోఫీలో స్టార్ బ్యాటర్లక సైతం చుక్కలు చూపిస్తున్న ముస్తాక్.. ఐపీఎల్ వేలంలో హాట్ టాపిక్‌గా మారే ఛాన్స్ ఉంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..