
Cricket Fans Protest: సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం తీసుకున్న ఆకస్మిక నిర్ణయం మధ్యతరగతి క్రికెట్ ప్రేమికులను తీవ్ర నిరాశకు గురిచేసింది. సాధారణంగా ఉండే ధరలను రాత్రికి రాత్రే డబుల్ చేయడంతో స్టేడియానికి వెళ్లి మ్యాచ్ చూడాలనుకునే సగటు అభిమాని జేబుకు భారీ చిల్లు పడుతోంది. పైగా ఈ పెంచిన బేస్ ధరలకు తోడు జీఎస్టీ, ప్లాట్‌ఫారమ్ రుసుములు తోడవ్వడంతో టికెట్ రేట్లు సామాన్యుడికి అందని ద్రాక్షలా మారాయి.
ఈ మ్యాచ్‌కు ఇంతలా డిమాండ్ పెరగడానికి ముఖ్య కారణం ‘విరాట్ కోహ్లీ ఫ్యాక్టర్’ అని చెప్పక తప్పదు. విరాట్ కోహ్లీ అంతర్జాతీయ టీ20, టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత, అతడిని ప్రత్యక్షంగా చూసే అవకాశాలు తక్కువయ్యాయి. దీనికి తోడు పాట్ కమిన్స్ సారథ్యంలోని సన్‌రైజర్స్, డిఫెండింగ్ ఛాంపియన్స్ ఆర్‌సీబీ మధ్య టాప్-2 స్థానం కోసం హోరాహోరీ పోరు నడుస్తోంది. ఈ రెండు అంశాలను ఆసరాగా చేసుకుని ఫ్రాంచైజీ ఇలా టికెట్ ధరలతో దోపిడీకి తెరలేపిందని సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.
జొమాటో డిస్ట్రిక్ట్ యాప్‌లో టికెట్ల బుకింగ్స్ ప్రారంభమైన కొద్ది నిమిషాలకే ‘సోల్డ్ అవుట్’ అని బోర్డులు ప్రత్యక్షమవడంపై అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 2.6 లక్షల మంది వెయిటింగ్ లిస్ట్‌లో ఉండగానే టికెట్లు ఎలా మాయమయ్యాయని ప్రశ్నిస్తున్నారు. ఉప్పల్ స్టేడియం సామర్థ్యమే దాదాపు 39 వేల సీట్లు అయితే, సాధారణ ఫ్యాన్స్‌కు టికెట్లు దక్కకుండా చేసి, తెరవెనుక వాటిని బ్లాక్ మార్కెట్‌కు మళ్లిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెడిట్, ఎక్స్ (ట్విట్టర్) వంటి వేదికల్లో రూ. 2,000 టికెట్లను రూ. 7,500 నుంచి రూ. 9,000 వరకు బ్లాక్‌లో విక్రయిస్తుండటం గమనార్హం.
ఈ దోపిడీపై స్థానిక సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు, అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. “మరి ఇంత దారుణమా.. మ్యాచ్ చూడాలా వద్దా?” అంటూ #BoycottUppalMatch అనే ట్రెండ్‌ను తెరపైకి తెచ్చారు. ఉప్పల్ స్టేడియం ఖాళీగా ఉంచి యాజమాన్యానికి బుద్ధి చెప్పాలని కొందరు పిలుపునిస్తుండగా, బ్లాక్ మార్కెట్ దందాపై హైదరాబాద్ పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
క్రికెట్‌ను కేవలం ఒక వ్యాపారంగా మార్చేసి, అభిమానుల భావోద్వేగాలను సొమ్ము చేసుకోవడం ఏమాత్రం సమర్థనీయం కాదు. లీగ్ దశలో చివరి హోమ్ మ్యాచ్‌ను పండగలా జరుపుకోవాలనుకున్న హైదరాబాద్ అభిమానులకు ఈ ధరల పెంపు కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి ధరలను తగ్గించకపోతే, స్టేడియంలో ఫ్యాన్స్ నిరసన సెగను ఎదుర్కోవాల్సి వస్తుంది.