
Harsh Dubey Record: ఉప్పల్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 242 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ అభిషేక్ శర్మ ఆరంభం నుంచే ఢిల్లీ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం మైదానం నలుమూలలా బౌండరీల వర్షం కురిపిస్తూ 135 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ భారీ స్కోరుతో హైదరాబాద్ జట్టు విజయం దాదాపు ఖాయమైంది.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును శ్రీలంక వేగవంతమైన బౌలర్ ఇషాన్ మలింగ ఆదిలోనే దెబ్బకొట్టాడు. తన పదునైన బంతులతో కీలకమైన 4 వికెట్లు పడగొట్టి ఢిల్లీ బ్యాటింగ్ వెన్నెముకను విరిచాడు. 18 ఓవర్లు ముగిసేసరికి మ్యాచ్ హైదరాబాద్ వైపు మొగ్గు చూపినా, చివరి ఓవర్‌లో చోటుచేసుకున్న పరిణామాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి.
Always knew about his finishing touch 🖌️🤩 pic.twitter.com/qvGCpvOpmR
— SunRisers Hyderabad (@SunRisers) April 21, 2026
ఢిల్లీ విజయానికి చివరి ఓవర్‌లో 51 పరుగులు అవసరమైన తరుణంలో కెప్టెన్ ఇషాన్ కిషన్ బంతిని యువ స్పిన్నర్ హర్ష్ దూబేకు అందించాడు. అంతకుముందు ఒక ఓవర్ వేసి 10 పరుగులు ఇచ్చిన హర్ష్, ఆఖరి ఓవర్‌లో అద్భుతం చేశాడు. కేవలం పరుగులు నియంత్రించడమే కాకుండా, ఒకే ఓవర్‌లో 3 వికెట్లు తీసి ఢిల్లీని 195 పరుగుల వద్దే కట్టడి చేశాడు. దీంతో హైదరాబాద్ 47 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
ఈ ప్రదర్శనతో హర్ష్ దూబే ఐపీఎల్ చరిత్రలో ఒక అరుదైన ఘనత సాధించారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఇన్నింగ్స్ 20వ ఓవర్‌లో మూడు వికెట్లు పడగొట్టిన తొలి స్పిన్నర్‌గా ఆయన రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలో ఈ ఘనత సాధించిన ఐదో స్పిన్నర్‌గా హర్ష్ నిలిచాడు. గతంలో అమిత్ మిశ్రా, ఆడమ్ జంపా, రాహుల్ తెవాటియా, కృనాల్ పాండ్యా మాత్రమే ఈ మైలురాయిని చేరుకున్నారు.
ఈ విజయంతో ఐపీఎల్ 2026 పట్టికలో హైదరాబాద్ తన అగ్రస్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసి ఈసారి టైటిల్ రేసులో తాము ఎంత బలంగా ఉన్నామో నిరూపించుకుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..