
IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) సంచలన ప్రదర్శనతో దూసుకుపోతోంది. సోమవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన పోరులో హైదరాబాద్ 57 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ విజయంలో జట్టు అరంగేట్రం ఆటగాళ్లు ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్ చూపించిన తెగింపు క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. మ్యాచ్ అనంతరం ఎస్‌ఆర్‌హెచ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ తన యువ బౌలర్ల ప్రదర్శనపై ప్రశంసల వర్షం కురిపించాడు.
రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఇద్దరు యువ బౌలర్లకు అరంగేట్రం చేసే అవకాశం ఇచ్చింది. ప్రఫుల్ హింగే ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన మొదటి ఓవర్ వేసి మూడు వికెట్లు తీశాడు. మొత్తం 4 ఓవర్లలో 34 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు, సాకిబ్ హుస్సేన్ కేవలం 24 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు తీసి భారత రికార్డును సమం చేశాడు. ఈ ఇద్దరు కలిసి పడగొట్టిన 8 వికెట్లు రాజస్థాన్ రాయల్స్ 217 పరుగుల భారీ లక్ష్య చేధనను 159 పరుగులకే పరిమితం చేశాయి.
కెప్టెన్ ఇషాన్ కిషన్ ఏమన్నాడంటే?
విజయం అనంతరం కెప్టెన్ ఇషాన్ కిషన్ మాట్లాడుతూ.. “మా యువ బౌలర్లు మైదానంలోకి దిగడానికి ఎంత ఆకలితో, ఎంత ఉత్సాహంగా ఉన్నారో ఈ మ్యాచ్ చూస్తే అర్థమవుతుంది. వారు సీజన్ మొత్తం ప్రాక్టీస్ సెషన్లలో చెమటోడ్చారు. ముఖ్యంగా మా బౌలింగ్ కోచ్ వరుణ్ ఆరోన్‌తో కలిసి వారు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో చర్చిస్తూ నిరంతరం నేర్చుకుంటున్నారు. వారికి హోమ్ గ్రౌండ్‌లో అవకాశం ఇవ్వడం సరైన నిర్ణయమని ఈరోజు నిరూపితమైంది. వారు భయం లేకుండా ఆడి ప్లాన్లను పక్కాగా అమలు చేశారు” అని కొనియాడాడు.
బ్యాటింగ్ లోనూ ఇషాన్ మెరుపులు
అభిషేక్ శర్మ మొదటి బంతికే అవుట్ కావడంతో సన్‌రైజర్స్ మొదట ఒత్తిడికి లోనైంది. కానీ కెప్టెన్ ఇషాన్ కిషన్ 91 పరుగుల వీరోచిత ఇన్నింగ్స్ ఆడి జట్టుకు 216 పరుగుల భారీ స్కోరును అందించాడు. అభిషేక్ శర్మ డకౌట్ అవ్వడం గురించి అడిగినప్పుడు.. “మా బ్యాటింగ్ యూనిట్ చాలా బలంగా ఉంది. అభిషేక్ శర్మ తనదైన రోజున మ్యాచ్‌ను ఒంటిచేత్తో గెలిపించగలడు. అతను త్వరగా అవుట్ అయినా అతనికి స్వేచ్ఛగా ఆడే అవకాశం ఇస్తాం. ఎందుకంటే అతను క్లిక్ అయితే స్కోరు 270 దాటుతుంది. ఈ ఓటమి అతనికి తదుపరి మ్యాచ్‌లో మరింత స్ఫూర్తినిస్తుంది” అని ఇషాన్ ధీమా వ్యక్తం చేశాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..