
క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన ఐపీఎల్ 2026 సీజన్ ముగిసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన హోరాహోరీ ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ 2026 టైటిల్‌ను సగర్వంగా కైవసం చేసుకుంది. ఈ అద్భుత విజయంతో రజత్ పాటిదార్ తన జట్టుకు వరుసగా రెండవ ఐపీఎల్ టైటిల్‌ను అందించినట్లయింది. ఫైనల్ మ్యాచ్‌లో బౌలర్ల అద్భుతమైన ప్రదర్శన, ఆ తర్వాత రన్ మెషీన్ విరాట్ కోహ్లీ అజేయ హాఫ్ సెంచరీ తోడవడంతో బెంగళూరు ఈజీగా విజయం సాధించింది. అయితే టైటిల్ చేజారినప్పటికీ గుజరాత్ టైటాన్స్ జట్టుకు ఒక అరుదైన అవార్డు లభించింది. ఆ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడా ఈ సీజన్‌లో అత్యధికంగా 29 వికెట్లు పడగొట్టి ప్రతిష్టాత్మక పర్పుల్ క్యాప్‌ను తన సొంతం చేసుకున్నాడు.
ఫైనల్ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ మధ్య టైటిల్ కోసం జరిగినప్పటికీ, తెరవెనుక భువనేశ్వర్ కుమార్ – కగిసో రబాడాల మధ్య అత్యధిక వికెట్ల రేసు కూడా అత్యంత ఆసక్తికరంగా సాగింది. ఈ ఫైనల్ మ్యాచ్‌కు ముందే రబాడా కేవలం ఒకే ఒక్క వికెట్ ఆధిక్యంలో ఉన్నాడు. అంతకుముందు జరిగిన 16 మ్యాచ్‌లలో రబాడా 28 వికెట్లు తీయగా, భువనేశ్వర్ కుమార్ 15 మ్యాచ్‌లలో 27 వికెట్లతో రెండో స్థానంలో నిలిచాడు. దీనివల్ల ఫైనల్ మ్యాచ్‌లో ఎవరైనా అద్భుతం చేస్తే పర్పుల్ క్యాప్ రేసు ఎటువైపైనా తిరిగే అవకాశం కనిపించింది.
ఈ రేసులో మొదట ఆర్‌సీబీ స్టార్ భువనేశ్వర్ కుమార్ గుజరాత్‌పై అద్భుతంగా బౌలింగ్ చేసి ఒక వికెట్ తీయడం ద్వారా మొదటి అడుగు వేశాడు. అయితే ఈ వికెట్ కేవలం రబాడా వికెట్ల సంఖ్యను సమం చేయడానికే సరిపోయింది. ఆ తర్వాత రబాడా వంతు వచ్చినప్పుడు, అతనికి మ్యాచ్ ఆరంభంలో అంతగా కలిసి రాలేదు. ప్రత్యర్థి బ్యాటర్లు భారీగా రన్స్ చేశారు. అయినప్పటికీ రబాడా తన మూడో ఓవర్‌లో దేవదత్ పడిక్కల్ వికెట్ తీసి ఈ సీజన్‌లో తన 29వ వికెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా భువనేశ్వర్ కుమార్‌ను కేవలం ఒకే ఒక్క వికెట్ తేడాతో ఓడించి పర్పుల్ క్యాప్‌ను కైవసం చేసుకున్నాడు.
ఈ విధంగా రబాడా మొత్తం 17 మ్యాచ్‌లలో 29 వికెట్లు తీసి ఈ ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకున్నాడు. ఈ సీజన్‌లో అతని బౌలింగ్ సగటు 21.58 కాగా, ఎకానమీ రేటు 9.68గా నమోదైంది. ఈ విజయంతో ఐపీఎల్ చరిత్రలో పర్పుల్ క్యాప్‌ను రెండుసార్లు గెలుచుకున్న నాల్గవ బౌలర్‌గా రబాడా అరుదైన రికార్డు సృష్టించాడు. రబాడా గతంలో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతూ ఐపీఎల్ 2020 సీజన్‌లో 30 వికెట్లతో ఈ అవార్డును మొదటిసారి గెలుచుకున్నాడు. ఈ ఘనతతో అతను రెండుసార్లు పర్పుల్ క్యాప్ సాధించిన భువనేశ్వర్ కుమార్ (2016, 2017), డ్వేన్ బ్రావో (2013, 2015), హర్షల్ పటేల్ (2021, 2024)ల ఆల్‌టైమ్ రికార్డును సమం చేయడం విశేషం.