
ఐపీఎల్ 2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ‘వడ్డీతో సహా లెక్క సరిచేయడం’ అంటే ఏంటో పంజాబ్ కింగ్స్‌కు చూపించింది. రాజీవ్ గాంధీ స్టేడియంలో జరిగిన హై-వోల్టేజ్ పోరులో 33 పరుగుల తేడాతో విజయం సాధించిన ఆరెంజ్ ఆర్మీ, పాయింట్ల పట్టికలో సింహాసనాన్ని అధిష్టించింది. అప్పటివరకు 13 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న పంజాబ్‌ను రెండో స్థానానికి పరిమితం చేసి, 14 పాయింట్లతో హైదరాబాద్ టేబుల్ టాపర్‌గా నిలిచింది. ఈ విజయం కేవలం హైదరాబాద్‌కు ప్లే ఆఫ్స్ బెర్తును దాదాపు ఖరారు చేయడమే కాకుండా, మరో రెండు ప్రధాన జట్లను చిక్కుల్లో పడేసింది.
అవే చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్ 12 పాయింట్లతో ఐదో స్థానంలో, చెన్నై 10 పాయింట్లతో ఆరో స్థానంలో ఉన్నాయి. హైదరాబాద్ ఆడాల్సిన తదుపరి మూడు మ్యాచ్‌లలో గుజరాత్, చెన్నై జట్లతో కూడా మ్యాచ్‌లు ఉన్నాయి. ఈ రెండు జట్లకు ఇవి నాకౌట్ మ్యాచ్‌లతో సమానం. ఒకవేళ సన్‌రైజర్స్ ఇదే ఫామ్‌ను కొనసాగిస్తూ ఈ రెండు జట్లపై విజయం సాధిస్తే, చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ ఆశలు దాదాపు గల్లంతైనట్టే. గుజరాత్ పరిస్థితి కూడా గాల్లో దీపంలా మారుతుంది.
అంటే, ఈ రెండు జట్లు తదుపరి దశకు వెళ్లాలంటే హైదరాబాద్ అనే అడ్డుగోడను బద్దలు కొట్టక తప్పదు. కానీ ప్రస్తుతం క్లాసెన్, ఇషాన్ కిషన్ లాంటి ఆటగాళ్లతో సునామీలా విరుచుకుపడుతున్న హైదరాబాద్‌ను అడ్డుకోవడం ఏ జట్టుకైనా సవాలుతో కూడుకున్న పని. హైదరాబాద్‌కు ప్లే ఆఫ్స్ చేరడానికి కేవలం ఒక్క విజయం మాత్రమే అవసరం. మిగిలిన మూడు మ్యాచ్‌లలో(ఆర్సీబీ, గుజరాత్, చెన్నై) ఏదో ఒక మ్యాచ్ గెలిచినా హైదరాబాద్ దర్జాగా ప్లే ఆఫ్స్‌లో అడుగుపెడుతుంది. ఈ కంఫర్ట్ జోన్‌లో ఉన్న హైదరాబాద్ ఇకపై మరింత స్వేచ్ఛగా, దూకుడుగా ఆడే అవకాశం ఉంది. ఇదే ఇప్పుడు ప్రత్యర్థి జట్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఉప్పల్ గడ్డపై మొదలైన ఈ ఆరెంజ్ ఆర్మీ ప్రభంజనం టోర్నీ చివరలో ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.