Team India Debut : వైభవ్ సూర్యవంశీతో పాటు బ్లూ జెర్సీ వేసుకోబోయే ఆ నలుగురు ఐపీఎల్ హీరోలు ఎవరంటే?

Team India Debut : ఐపీఎల్ 2026 లో సంచలన ప్రదర్శన చేసిన వైభవ్ సూర్యవంశీ, రసిఖ్ సలామ్, ప్రిన్స్ యాదవ్‌తో కూడిన ఐదుగురు యువ ఆటగాళ్లు త్వరలోనే టీమిండియా తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేయనున్నారు. ఆ టాప్ 5 యంగ్ ప్లేయర్ల వివరాలు తెలుసుకుందాం.

Team India Debut : వైభవ్ సూర్యవంశీతో పాటు బ్లూ జెర్సీ వేసుకోబోయే ఆ నలుగురు ఐపీఎల్ హీరోలు ఎవరంటే?
Vaibhav Sooryavanshi

Updated on: Jun 01, 2026 | 4:34 PM

Team India Debut : ఆర్సీబీ వరుసగా రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకోవడంతో ఐపీఎల్ 2026 సీజన్ ఎంతో ఉత్కంఠభరితంగా ముగిసింది. ఈ సీజన్‌లో సీనియర్ ఆటగాళ్లు తమ అనుభవంతో రాణించినప్పటికీ, కొంతమంది యువ ఆటగాళ్లు మాత్రం అసాధారణ ప్రదర్శనతో లీగ్‌ను శాసించారు. అత్యధిక పరుగుల ఛేజింగ్‌లు, వివాదాలు, రికార్డులతో సాగిన ఈ సీజన్.. భారత క్రికెట్‌కు ఎంతోమంది భవిష్యత్తు స్టార్లను పరిచయం చేసింది. ఐపీఎల్ 2026 లో చూపించిన అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఆధారంగా త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టి, టీమిండియా తరఫున డెబ్యూ చేయబోతున్న ఆ టాప్ 5 యంగ్ ప్లేయర్ల వివరాలు తెలుసుకుందాం.

1. వైభవ్ సూర్యవంశీ

ఐపీఎల్ 2026 సీజన్‌కు అసలైన బ్రాండ్ అంబాసిడర్ 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ. ఈ సీజన్‌లో ఏకంగా 776 పరుగులు సాధించి, 237.31 మైండ్ బ్లాయింగ్ స్ట్రైక్ రేట్‌తో ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోశాడు. జస్ప్రీత్ బుమ్రా, ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, సునీల్ నరైన్, కాగిసో రబాడా వంటి ప్రపంచ స్థాయి బౌలర్ల లైన్ అండ్ లెంగ్త్‌ను దెబ్బతీస్తూ పవర్‌ప్లేలో వైభవ్ ఆడిన ఇన్నింగ్స్‌లు ఈ సీజన్‌కే హైలైట్‌గా నిలిచాయి. ఇప్పటికే ఇండియా-ఏ జట్టులో చోటు దక్కించుకున్న ఈ యువ సంచలనానికి, త్వరలోనే టీమిండియా మెయిన్ క్యాప్ కూడా దక్కడం ఖాయమని క్రికెట్ వర్గాలు గట్టిగా చెప్తున్నాయి.

2. ప్రిన్స్ యాదవ్

లక్నో జట్టు ఈ సీజన్లో పెద్దగా రాణించలేకపోయినా, ఆ జట్టు యువ ఫాస్ట్ బౌలర్ ప్రిన్స్ యాదవ్ మాత్రం తన బౌలింగ్ నైపుణ్యంతో అందరినీ ఆకట్టుకున్నాడు. బంతిని గాల్లోనే అద్భుతంగా స్వింగ్ చేయగల సామర్థ్యంతో పాటు లైన్ అండ్ లెంగ్త్‌పై ఇతనికి ఉన్న కంట్రోల్ అమోఘం. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (DPL) అనుభవంతో వచ్చిన ప్రిన్స్ యాదవ్, లక్నో డ్రెస్సింగ్ రూమ్‌లో మొహమ్మద్ షమీ, భరత్ అరుణ్ వంటి దిగ్గజాల నీడలో మరింత రాటుదేలాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో జరగబోయే వన్డే సిరీస్ కోసం ఇతడిని ఇప్పటికే భారత జట్టులోకి ఎంపిక చేశారు. త్వరలోనే వన్డేలతో పాటు టీ20, టెస్టుల్లోనూ ఇతను ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.

3. సూర్యాంశ్ షెడ్గే

ప్రస్తుతం భారత పరిమిత ఓవర్ల జట్టుకు లోయర్ మిడిలార్డర్‌లో మ్యాచ్‌లను ముగించగల ఒక పవర్‌ఫుల్ ఫినిషర్ అత్యవసరంగా కావాలి. ఈ స్థానానికి ఐపీఎల్ 2026 లో పర్ఫెక్ట్ ఆప్షన్‌గా నిలిచాడు 23 ఏళ్ల సూర్యాంశ్ షెడ్గే. పంజాబ్ కింగ్స్ జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు, టోర్నమెంట్ చివరి దశలో జట్టులోకి వచ్చిన సూర్యాంశ్.. అత్యంత ఒత్తిడితో కూడిన పరిస్థితుల్లో కీలకమైన పరుగులు సాధించాడు. ప్రత్యర్థులపై విరుచుకుపడే హిట్టింగ్ సామర్థ్యంతో పాటు, ఇతనికి ఉన్న సాలిడ్ టెక్నిక్ జట్టుకు పెద్ద అండగా మారింది. సెలెక్టర్ల దృష్టిలో పడ్డ సూర్యాంశ్ త్వరలోనే భారత్ తరఫున ఫినిషర్ రోల్ పోషించబోతున్నాడు.

4. ప్రభ్‌సిమ్రాన్ సింగ్

పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రభ్‌సిమ్రాన్ సింగ్ వరుసగా రెండో సీజన్‌లోనూ 500 కంటే ఎక్కువ పరుగులు సాధించి తన నిలకడను చాటుకున్నాడు. సాక్షాత్తూ క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ చేత ప్రశంసలు అందుకోవడం ఇతని ప్రతిభకు నిదర్శనం. పంజాబ్ వరుసగా 6 మ్యాచ్‌ల్లో ఓడిపోతున్నా, ఇతను మాత్రం భయం లేకుండా పవర్‌ప్లేలో జట్టుకు విధ్వంసకరమైన ఓపెనింగ్స్ ఇచ్చాడు. టాప్ ఆర్డర్ బ్యాటర్ కావడంతో వన్డే జట్టులో చోటు దక్కడం కొంచెం కష్టమే అయినా, టీ20 ఫార్మాట్‌లో సంజూ శాంసన్‌కు పక్కా బ్యాకప్ లేదా రీప్లేస్‌మెంట్‌గా ప్రభ్‌సిమ్రాన్ సింగ్ భారత జట్టులోకి రావడం ఖాయం.

5. రసిఖ్ సలామ్

ఆర్సీబీ ప్రధాన బౌలర్ యష్ దయాల్ గాయంతో ఐపీఎల్ 2026 కి దూరం కావడంతో, ఆ స్థానంలోకి వచ్చిన రసిఖ్ సలామ్ బెంగళూరు బౌలింగ్ విభాగానికి వెన్నెముకగా నిలిచాడు. భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్‌లతో కలిసి ఇతను అద్భుతమైన స్పెల్స్ వేశాడు. తన కెరీర్లోనే మొదటిసారి ఒక సీజన్లో 10 కి పైగా మ్యాచ్‌లు ఆడిన రసిఖ్.. 21.31 సగటుతో ఏకంగా 19 వికెట్లు పడగొట్టాడు. ముఖ్యంగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 3/27 ప్రదర్శనతో ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఎన్నో వేరియేషన్లు ఉన్న ఈ రైట్ ఆర్మ్ పేసర్, టీమిండియా వెతుకుతున్న మూడో సీమర్ ఆప్షన్‌గా సరిగ్గా సరిపోతాడు.

 

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us