IPL 2026 : డామిట్ కథ అడ్డం తిరిగింది.. ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేస్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ అవుట్

IPL 2026 : లక్నోపై పంజాబ్ కింగ్స్ గెలవడంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా తప్పుకుంది. అక్షర్ పటేల్ జట్టుకు నిరాశే మిగిలింది. టోర్నమెంట్‌లో ఈ సీజన్ నుండి తప్పుకున్న నాలుగో జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ నిలిచింది.

IPL 2026 :  డామిట్ కథ అడ్డం తిరిగింది.. ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ రేస్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ అవుట్
Delhi Capitals

Updated on: May 24, 2026 | 7:27 AM

IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ (DC) ప్రయాణం లీగ్ స్టేజ్ లోనే ముగిసిపోయింది. శనివారం రాత్రి జరిగిన ఉత్కంఠభరిత పోరులో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పై పంజాబ్ కింగ్స్ (PBKS) 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించడంతో, ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్స్ ఆశలు అధికారికంగా గాల్లో కలిసిపోయాయి. మే 25న కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ఢిల్లీ తన చివరి లీగ్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. అయితే ఆ మ్యాచ్ జరగడానికి ఒక రోజు ముందే అక్షర్ పటేల్ నేతృత్వంలోని ఢిల్లీ జట్టు టోర్నమెంట్ నుంచి నిష్క్రమించాల్సి రావడం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. టోర్నమెంట్‌లో ఈ సీజన్ నుంచి తప్పుకున్న నాలుగో జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్ నిలిచింది.

లక్నోతో జరిగిన మ్యాచ్‌కు ముందు పంజాబ్ కింగ్స్ 13 పాయింట్లతో ఐదో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్‌లో లక్నో గెలిస్తేనే ఢిల్లీకి ప్లేఆఫ్స్ వెళ్లేందుకు కాస్తో కూస్తో ఛాన్స్ ఉండేది. ఎందుకంటే ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ 13 మ్యాచ్‌లలో 12 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో ఉంది. చివరి మ్యాచ్‌లో కోల్‌కతాపై భారీ తేడాతో గెలిచినా ఢిల్లీ గరిష్టంగా 14 పాయింట్లకు మాత్రమే చేరుకోగలదు. కానీ ఇప్పుడు లక్నోను ఓడించడం ద్వారా పంజాబ్ కింగ్స్ నేరుగా 15 పాయింట్లతో టాప్-4 లోకి దూసుకెళ్లింది. దీనితో ఢిల్లీ క్యాపిటల్స్ తమ తదుపరి మ్యాచ్ గెలిచినా లాభం లేకుండా పోయింది. ఆదివారం మధ్యాహ్నం జరగబోయే రాజస్థాన్, ముంబై మ్యాచ్ లపై ఢిల్లీ పెట్టుకున్న ఆశలన్నీ పంజాబ్ దెబ్బకు చెల్లాచెదురయ్యాయి.

ఢిల్లీ క్యాపిటల్స్ ఈ 2026 సీజన్ ప్రయాణం చాలా హెచ్చుతగ్గులతో సాగింది. టోర్నీ ఆరంభంలో లక్నో, ముంబై ఇండియన్స్‌లపై వరుస విజయాలతో దూకుడు ప్రదర్శించిన అక్షర్ పటేల్ సేనకు గుజరాత్ టైటాన్స్ మ్యాచ్‌లో ఊహించని షాక్ తగిలింది. ఆ మ్యాచ్‌లో గుజరాత్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ ఆఖరి ఓవర్లలో సింగిల్ తీసేందుకు నిరాకరించి ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించాడు. కేవలం 1 పరుగు తేడాతో ఢిల్లీ ఓడిపోయింది. ఆ ఒక్క పరుగు ఓటమే ఇప్పుడు ఢిల్లీ ప్లేఆఫ్స్ రేసును ముంచేసింది. ఆ తర్వాత చెన్నై చేతిలో ఓడి, బెంగళూరుపై గెలిచినప్పటికీ మిడ్ సీజన్ వచ్చేసరికి జట్టు లయ తప్పింది.

మిడ్ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా మూడు మ్యాచ్‌లలో ఓడిపోవడం వారి కొంపముంచింది. ముఖ్యంగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఒక మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసి 264 పరుగుల భారీ స్కోరు బోర్డుపై ఉంచినప్పటికీ, ఢిల్లీ బౌలర్లు ఆ టార్గెట్‌ను డిఫెండ్ చేయలేకపోయారు. పంజాబ్ బ్యాటర్లు ఆ రికార్డు స్కోరును కూడా ఊదేశారు. ఈ ఓటమి ఢిల్లీ జట్టు ఆత్మవిశ్వాసాన్ని బాగా దెబ్బతీసింది. ఆ తర్వాత మరో రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయి ఎలిమినేషన్ అంచుకు చేరింది. చివరి రెండు మ్యాచ్‌లలో వరుసగా గెలిచి రేసులో ఎలాగోలా నిలిచినప్పటికీ, పంజాబ్-లక్నో మ్యాచ్ ఫలితం ఢిల్లీని టోర్నీ నుండి ఖరారుగా బయటకు పంపేసింది.

ఈ ఓటమితో ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ ట్రోఫీ నిరీక్షణ మరో ఏడాది కాలం ముందుకు సాగింది. వరుసగా ఐదో సంవత్సరం కూడా ఢిల్లీ జట్టు ప్లేఆఫ్స్ చేరడంలో విఫలమైంది. చివరిసారిగా వారు 2021 సీజన్‌లో లీగ్ టేబుల్‌లో 20 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి టాప్-4లోకి వెళ్లారు. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు ఆ స్థాయి ప్రదర్శన చేయలేకపోయారు. ఐపీఎల్ 19 ఏళ్ల చరిత్రను ఒకసారి పరిశీలిస్తే, అన్ని సీజన్లు ఆడిన ఢిల్లీ ఫ్రాంచైజీ కేవలం 6 సార్లు మాత్రమే ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. ఇంత పెద్ద జట్టుకు ఈ విధమైన ట్రాక్ రికార్డ్ ఉండటం నిజంగా అభిమానులకు తీవ్ర నిరాశ కలిగించే విషయమేనని చెప్పాలి.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us