CSK vs SRH : సంజూ వర్సెస్ క్లాసెన్.. గ్రౌండ్‌లోనే మాటల యుద్ధం.. క్లాసెన్ ప్రవర్తనపై ఫ్యాన్స్ ఆగ్రహం

CSK vs SRH : సాధారణంగా క్రికెట్ మైదానంలో సంజూ శామ్సన్ అయినా, హెన్రిచ్ క్లాసెన్ అయినా చాలా కూల్‌గా కనిపిస్తారు. కానీ ఐపీఎల్ 2026, 63వ మ్యాచ్‌లో ఈ ఇద్దరు దిగ్గజ ఆటగాళ్ల మధ్య ఊహించని రీతిలో రచ్చ జరిగింది.

CSK vs SRH : సంజూ వర్సెస్  క్లాసెన్.. గ్రౌండ్‌లోనే మాటల యుద్ధం.. క్లాసెన్ ప్రవర్తనపై ఫ్యాన్స్ ఆగ్రహం
Sanju Samson Heinrich Klaasen

Updated on: May 19, 2026 | 6:54 AM

CSK vs SRH : సాధారణంగా క్రికెట్ మైదానంలో సంజూ శామ్సన్ అయినా, హెన్రిచ్ క్లాసెన్ అయినా చాలా కూల్‌గా కనిపిస్తారు. కానీ ఐపీఎల్ 2026, 63వ మ్యాచ్‌లో ఈ ఇద్దరు దిగ్గజ ఆటగాళ్ల మధ్య ఊహించని రీతిలో రచ్చ జరిగింది. చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన ఈ పోరులో ఒక వికెట్ విషయంలో మొదలైన గొడవ.. చివరకు అసహ్యకరమైన ప్రవర్తన వరకు వెళ్లింది. క్లాసెన్ అవుట్ అయిన తర్వాత శామ్సన్ వైపు చూస్తూ ఉమ్మి వేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.

అసలేం జరిగింది?

చెన్నై విధించిన 181 పరుగుల లక్ష్యంతో హైదరాబాద్ బ్యాటింగ్ చేస్తోంది. 15వ ఓవర్‌లో నూర్ అహ్మద్ వేసిన మూడో బంతిని క్లాసెన్ భారీ షాట్ ఆడబోయి మిస్ అయ్యాడు. బంతిని అందుకున్న వికెట్ కీపర్ సంజూ శామ్సన్ మెరుపు వేగంతో క్లాసెన్‌ను స్టంప్ అవుట్ చేశాడు. క్లాసెన్ కాలు కొంచెం గాలిలో ఉండటంతో థర్డ్ అంపైర్ కూడా అవుట్ ఇచ్చాడు. అయితే తాను అవుట్ కాదని క్లాసెన్ భావించాడు. ఆ సమయంలో శామ్సన్ తన వైపు సీరియస్‌గా చూడటంతో క్లాసెన్‌కు కోపం వచ్చింది. ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. అంపైర్లు, తోటి ఆటగాళ్లు సర్దిచెప్పినా క్లాసెన్ ఆగ్రహంతో ఊగిపోయాడు.

శృతిమించిన క్లాసెన్ ప్రవర్తన

పెవిలియన్ వైపు వెళ్తున్న క్లాసెన్ ఒక్కసారిగా వెనక్కి తిరిగి సంజూ శామ్సన్ వైపు చూస్తూ ఉమ్మి వేశాడు. ఈ దృశ్యాలు కెమెరాకు చిక్కాయి. క్లాసెన్ లాంటి ప్రొఫెషనల్ ప్లేయర్ ఇలా ప్రవర్తించడం చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. సంజూ శామ్సన్ ఏమైనా దూషించాడా? లేక క్లాసెన్ కేవలం అవుట్ అయిన కోపంలో అలా చేశాడా? అన్నది చర్చనీయాంశంగా మారింది. ఇద్దరి మధ్య జరిగిన ఈ గొడవ వల్ల గ్రౌండ్‌లో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ ప్రవర్తనపై బీసీసీఐ (BCCI) ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అని అందరూ ఎదురుచూస్తున్నారు.

మ్యాన్ ఆఫ్ ది మొమెంట్.. కానీ వివాదంలో!

నిజానికి ఈ మ్యాచ్‌లో క్లాసెన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. స్పిన్నర్లకు అనుకూలిస్తున్న చెన్నై పిచ్‌పై 26 బంతుల్లో 47 పరుగులు చేసి మ్యాచ్‌ను హైదరాబాద్ వైపు తిప్పాడు. ఇషాన్ కిషన్‌తో కలిసి 75 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 180కి పైగా స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసిన క్లాసెన్.. ప్రస్తుతం ఈ సీజన్‌లో 13 మ్యాచ్‌ల్లో 555 పరుగులతో టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. కానీ ఈ గొడవ వల్ల ఆయన సాధించిన రికార్డుల కంటే వివాదమే ఎక్కువగా వినబడుతోంది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us