
IPL 2026 : ఐపీఎల్ 19వ సీజన్ (IPL 2026) రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో క్రికెట్ అభిమానులకు డబుల్ ధమాకా ఇచ్చేలా కామెంటరీ ప్యానెల్ ప్రకటన వచ్చేసింది. ఈసారి మైదానంలో ఆటగాళ్లు సిక్సర్లు కొడుతుంటే, కామెంటరీ బాక్స్‌లో దిగ్గజాలు తమ మాటలతో మ్యాజిక్ చేయనున్నారు. అయితే ఈ జాబితాలో ఒక ఆసక్తికరమైన పేరు అందరినీ ఆకర్షిస్తోంది. వెస్టిండీస్ మాజీ కెప్టెన్, ప్రస్తుతం ప్రముఖ కామెంటరేటర్ అయిన డారెన్ గంగా గురించి ఇప్పుడు నెట్టింట చర్చ జరుగుతోంది. ఆయన క్రికెట్ కెరీర్ కంటే, ఆయన వ్యక్తిగత జీవితం వెనుక ఉన్న ఒక చిన్నపాటి సెంటిమెంట్ కథ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
డారెన్ గంగా
వెస్టిండీస్ మాజీ కెప్టెన్ డారెన్ గంగా తన కెరీర్‌లో 48 టెస్టులు, 35 వన్డేలు ఆడారు. అయితే ఆటగాడిగా కంటే కామెంటరేటర్‌గా ఆయనకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. కానీ ఆయన వ్యక్తిగత జీవితం చాలా సింపుల్ గా ఉంటుంది. ట్రినిడాడ్‌లో ఆయనకు ఒక జ్యూస్ సెంటర్ ఉంది, దాని పేరు గంగా జ్యూస్ బార్. దీనిని ఆయన భార్య పరిణీత విజయవంతంగా నడుపుతున్నారు. ఆస్ట్రేలియాలో పుట్టి న్యూయార్క్‌లో పెరిగిన పరిణీతకు భారతీయ సంస్కృతి అంటే చాలా ఇష్టం. 2020 లాక్ డౌన్ సమయంలో తన భార్య సూచన మేరకే గంగా ఈ వ్యాపారం ప్రారంభించారు. ఇప్పుడు ఆయన ఐపీఎల్ ఇంగ్లీష్ కామెంటరీ ప్యానెల్ లో కీలక సభ్యుడిగా ఉన్నారు.
కామెంటరీ బాక్స్‌లోకి అశ్విన్ ఎంట్రీ
ఈ సీజన్‌లో మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. భారత దిగ్గజ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కామెంటరేటర్‌గా అవతారమెత్తడం. సాధారణంగా అశ్విన్ మాతృభాష తమిళం, ఆయన ఇంగ్లీష్ లో అనర్గళంగా మాట్లాడగలరు. కానీ ఈసారి ఆయన హిందీ ప్యానెల్‌లో కామెంటరీ చేయనుండటం విశేషం. తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఇప్పటికే హిందీలో విశ్లేషణలు చేస్తూ అభిమానులను అలరిస్తున్న అశ్విన్, ఇప్పుడు ప్రత్యక్షంగా ఐపీఎల్ మైదానంలో తన విశ్లేషణలతో ఆకట్టుకోనున్నారు.
ఐపీఎల్ 2026 కామెంటరీ ప్యానెల్స్ వివరాలు
ఇంగ్లీష్ కామెంటరీ టీమ్:
డారెన్ గంగాతో పాటు ఏబీ డివిలియర్స్, డేల్ స్టెయిన్, ఫాఫ్ డుప్లెసిస్, కెవిన్ పీటర్సన్, ఆరోన్ ఫించ్, ఇయాన్ మోర్గాన్, మైఖేల్ క్లార్క్, మిచెల్ మెక్లెనాగన్, దీప్ దాస్‌గుప్తా, సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి, హర్షా భోగ్లే, ఇయాన్ బిషప్, సైమన్ డౌల్, డానియల్ మోరిసన్, నిక్ నైట్, గ్రేమ్ స్మిత్ వంటి దిగ్గజాలు ఉన్నారు.
హిందీ కామెంటరీ టీమ్:
రవిచంద్రన్ అశ్విన్ తో పాటు సురేష్ రైనా, హర్భజన్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, వీరేంద్ర సెహ్వాగ్, అనిల్ కుంబ్లే, పీయూష్ చావ్లా, ఉమేష్ యాదవ్, ఆకాష్ చోప్రా, ఛెతేశ్వర్ పుజారా, ఆదిత్య తారే, నవజ్యోత్ సింగ్ సిద్ధూ, సునీల్ గవాస్కర్, సంజయ్ బంగర్, అజయ్ జడేజా, మహమ్మద్ కైఫ్, సబా కరీమ్, దీప్ దాస్‌గుప్తా, పదంజీత్ సెహ్రావత్, అనంత్ త్యాగి, సునీల్ తనేజా ఉండనున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..