IPL 2025: సెంచరీ చేస్తే మ్యాచ్ ఓడిపోవుడే.. ఐపీఎల్ హిస్టరీలో చెత్త ప్లేయర్..

Rishabh Pant's Century: రిషబ్ పంత్ ఐపీఎల్ కెరీర్‌లో రెండు సెంచరీలు చేసినా, రెండు సార్లు కూడా అతని జట్టు ఓటమిపాలవడం గమనార్హం. ఒక బ్యాట్స్‌మెన్ సెంచరీ చేసినా జట్టు ఓడిపోవడం క్రికెట్‌లో అరుదైన సంఘటన. అవి ఎప్పుడు జరిగాయో ఇప్పుడు తెలుసుకుందాం..

IPL 2025: సెంచరీ చేస్తే మ్యాచ్ ఓడిపోవుడే.. ఐపీఎల్ హిస్టరీలో చెత్త ప్లేయర్..
Rishabh Pant Century

Updated on: May 28, 2025 | 9:25 AM

Rishabh Pant’s Century: లక్నో సూపర్ జెయింట్స్ (LSG) కెప్టెన్ రిషబ్ పంత్ ఐపీఎల్ 2025 సీజన్‌లో చివరి లీగ్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)పై అద్భుతమైన సెంచరీతో మెరిశాడు. కానీ, పంత్ శతకం జట్టును విజయతీరాలకు చేర్చలేకపోయింది. ఇప్పటికే లక్నో ప్లేఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమించిన సంగతి తెలిసిందే. ఈ సెంచరీ పంత్‌కి ఏడేళ్ల తర్వాత వచ్చింది. మొత్తంగా ఐపీఎల్‌లో రెండో సెంచరీ కావడం విశేషం.

పంత్ మెరుపులు వృథా..

ఇవి కూడా చదవండి

ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన లక్నోకు ఓపెనర్లు నిరాశపరిచినా, వన్ డౌన్‌లో వచ్చిన రిషబ్ పంత్ బాధ్యతాయుతమైన, విధ్వంసకర ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు. కేవలం 61 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లతో 118 పరుగులతో అజేయంగా నిలిచాడు. మిచెల్ మార్ష్ (67)తో కలిసి రెండో వికెట్‌కు 155 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దీంతో లక్నో 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగుల భారీ స్కోరు సాధించింది.

సెంచరీ చేసినా ఓటమి..

పంత్ అద్భుతమైన సెంచరీతో లక్నో భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా, ఆర్‌సీబీ జితేష్ శర్మ (85 నాటౌట్), విరాట్ కోహ్లీ (54) అద్భుతమైన బ్యాటింగ్‌తో 228 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది. దీంతో పంత్ సెంచరీ చేసిన మ్యాచ్‌లో కూడా లక్నో ఓటమిని చవిచూసింది. ఈ సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ రూ. 27 కోట్ల రికార్డు ధర పెట్టి పంత్‌ను కొనుగోలు చేసి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. కానీ, ఈ సీజన్ మొత్తంలో పంత్ బ్యాటింగ్‌లో పెద్దగా రాణించలేకపోయాడు. ఈ సెంచరీకి ముందు 13 ఇన్నింగ్స్‌లలో కేవలం ఒకే ఒక హాఫ్ సెంచరీ మాత్రమే నమోదు చేయగలిగాడు.

పంత్ కెరీర్‌లో సెంచరీ చేసిన మ్యాచ్‌లలో ఫలితాలు..

  • IPL 2018: సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 128* పరుగులు చేశాడు. ఆ మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ (అప్పటి ఢిల్లీ క్యాపిటల్స్) 9 వికెట్ల తేడాతో ఓడిపోయింది.
  • IPL 2025: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై 118* పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 6 వికెట్ల తేడాతో ఓడిపోయింది.

పంత్ ఐపీఎల్ కెరీర్‌లో రెండు సెంచరీలు చేసినా, రెండు సార్లు కూడా అతని జట్టు ఓటమిపాలవడం గమనార్హం. ఒక బ్యాట్స్‌మెన్ సెంచరీ చేసినా జట్టు ఓడిపోవడం క్రికెట్‌లో అరుదైన సంఘటన. ఈ సీజన్‌లో లక్నో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించకుండానే నిష్క్రమించింది. పంత్ ఈ సీజన్‌లో 14 మ్యాచ్‌లలో 269 పరుగులు సాధించి, 24.45 సగటు, 133.16 స్ట్రైక్ రేట్‌తో ముగించాడు. ఈ సెంచరీ అతనికి వ్యక్తిగతంగా ఆత్మవిశ్వాసం ఇచ్చినా, జట్టుకు మాత్రం నిరాశే మిగిల్చింది. అయితే, ఈ ఫాం రాబోయే ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో ఎంతగా ఉపయోగపడుతుందో చూడాలి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..