RCB For Sale: అమ్మకానికి ఆర్‌సీబీ రెడీ.. ఆలోగా డీల్ పూర్తి.. లిస్ట్ చూస్తే మైండ్ బ్లాంకే..?

Royal Challengers Bengaluru For Sale: ఆర్సీబీ కొత్త యజమాని ఎవరు అవుతారనేది, ఐపీఎల్ 2026 మెగా వేలం ముందుగా తేలిపోనుంది. ఈ పరిణామం జట్టు కూర్పుపై, ముఖ్యంగా విరాట్ కోహ్లీ వంటి కీలక ఆటగాళ్ల భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

RCB For Sale: అమ్మకానికి ఆర్‌సీబీ రెడీ.. ఆలోగా డీల్ పూర్తి.. లిస్ట్ చూస్తే మైండ్ బ్లాంకే..?
Rcb Team

Updated on: Nov 06, 2025 | 8:52 AM

Royal Challengers Bengaluru, IPL 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన జట్లలో ఒకటైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫ్రాంచైజీకి సంబంధించి ఒక సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. ఐపీఎల్ 2025 సీజన్ విజేతగా నిలిచి, ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెరదించిన ఆర్సీబీని ఇప్పుడు అమ్మకానికి పెట్టినట్లు తెలుస్తోంది.

ఆర్సీబీ ఫ్రాంచైజీని కలిగి ఉన్న యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ (యూఎస్ఎల్) మాతృ సంస్థ డియాజియో (Diageo) ఈ విక్రయ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది. ఈ ప్రక్రియ 2026 మార్చి 31వ తేదీ లోపు పూర్తయ్యే అవకాశం ఉందని బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్‌కు (బీఎస్ఈ) ఇచ్చిన ఒక లేఖలో డియాజియో వెల్లడించింది.

ప్రధాన కారణం ఏమిటంటే?

యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ ప్రధాన వ్యాపారం ఆల్కహాల్ ఆధారిత పానీయాల రంగంలో ఉంది. ఈ నేపథ్యంలో, ఆర్సీబీ ఫ్రాంచైజీ తమ ప్రధాన వ్యాపారానికి (నాన్-కోర్ బిజినెస్) సంబంధించింది కాదని కంపెనీ పేర్కొంది. దీర్ఘకాలికంగా వాటాదారులకు విలువను అందించే ఉద్దేశంతోనే కంపెనీ తన భారతీయ పోర్ట్‌ఫోలియోను సమీక్షిస్తోందని, అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూఎస్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు సీఈఓ ప్రవీణ్ సోమేశ్వర్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

ఆర్సీబీ విలువ, కొనుగోలుకు పోటీ..

విరాట్ కోహ్లీ వంటి స్టార్ ఆటగాడు ఉండటం, అపారమైన అభిమాన గణం (ఫ్యాన్ బేస్) కలిగి ఉండటం వలన, ఆర్సీబీ ఫ్రాంచైజీకి మార్కెట్లో భారీ విలువ ఉంది. నివేదికల ప్రకారం, ఈ ఫ్రాంచైజీ విలువ సుమారు రెండు బిలియన్ అమెరికన్ డాలర్లకు (దాదాపు 16000 కోట్ల రూపాయలు) పైగా ఉండొచ్చని అంచనా. ఆర్సీబీని కొనుగోలు చేయడానికి పలు ప్రముఖ వ్యాపార సంస్థలు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

అదానీ గ్రూప్

జేఎస్‌డబ్ల్యూ గ్రూప్

అదార్ పూనావాలా (సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా)

రేసులో మరికొన్ని ప్రముఖ సంస్థలు..

ఈ విక్రయ ప్రక్రియ ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ డీల్ పూర్తయితే, ఐపీఎల్ చరిత్రలో ఇది అతిపెద్ద ఫ్రాంచైజీ యాజమాన్య మార్పులలో ఒకటిగా నిలిచిపోనుంది. ఐపీఎల్ పురుషుల జట్టుతో పాటు, ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) జట్టు యాజమాన్యం కూడా ఈ డీల్‌లో భాగంగా మారనుంది.

ఆర్సీబీ కొత్త యజమాని ఎవరు అవుతారనేది, ఐపీఎల్ 2026 మెగా వేలం ముందుగా తేలిపోనుంది. ఈ పరిణామం జట్టు కూర్పుపై, ముఖ్యంగా విరాట్ కోహ్లీ వంటి కీలక ఆటగాళ్ల భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.