
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లోగల నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన ఐపీఎల్ 2024 32వ మ్యాచ్‌లో రిషబ్ పంత్ నేతృత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అరుదైన రికార్డు సృష్టించింది.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు ఢిల్లీ బౌలర్ల ధాటికి కేవలం 89 పరుగులకే కుప్పకూలింది. జట్టు తరుపున రషీద్ ఖాన్ 31 పరుగులు చేయడం మినహా మిగతా వారి సహకారం లేదు. కాగా ఈ మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

లీగ్‌లో వరుస పరాజయాలతో షాక్‌కు గురైన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు.. ఐపీఎల్ చరిత్రలో గుజరాత్ టైటాన్స్ జట్టుపై మరే జట్టు చేయలేని ఘనతను సాధించింది.

అదేమిటంటే.. ఇవాళ జరిగిన మ్యాచ్ లో గుజరాత్ జట్టును 89 పరుగులకే ఆలౌట్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు.. ఐపీఎల్ చరిత్రలో శుభ్ మన్ గిల్ దళాన్ని అతి తక్కువ మొత్తానికి ఔట్ చేసిన తొలి జట్టుగా రికార్డును లిఖించింది.

గతంలో ఐపీఎల్‌లో గుజరాత్‌ను 100 కంటే తక్కువ పరుగులకే ఆలౌట్ చేసిన జట్టు లేదు. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ ఈ ఘనత సాధించింది.

అలాగే, ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అతి తక్కువ మొత్తానికి ప్రత్యర్థి జట్టును ఆలౌట్ చేయడం ఇదే తొలిసారి. అంతకుముందు ముంబై ఇండియన్స్ జట్టును ఢిల్లీ జట్టు 92 పరుగులకే కట్టడి చేసింది.

గుజరాత్ జట్టును ఇంత తక్కువ స్కోరుకే కట్టడి చేయడంలో ఢిల్లీ బౌలర్ల పాత్ర అద్భుతం. ఢిల్లీ తరపున ముఖేష్ కుమార్ గరిష్టంగా 3 వికెట్లు తీయగా, ఇషాంత్ శర్మ, ట్రిస్టన్ స్టబ్స్ చెరో 2 వికెట్లు తీశారు. అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్ చెరో వికెట్ తీశారు.