IPL 2023: టీమిండియా అన్‌లక్కీ ప్లేయర్లు.. ఐపీఎల్‌లో దంచికొడుతున్నారు.. బీసీసీఐ కరుణించేనా?

|

Apr 05, 2023 | 1:07 PM

'గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస.. గర్జన కంటే భయంకరంగా ఉంటుంది'.. సరిగ్గా ఈ డైలాగ్ యాప్ట్..

IPL 2023: టీమిండియా అన్‌లక్కీ ప్లేయర్లు.. ఐపీఎల్‌లో దంచికొడుతున్నారు.. బీసీసీఐ కరుణించేనా?
Ipl 2023 News
Follow us on

తమను తాము నిరూపించుకునే అవకాశం ప్రతీ ఆటగాడికి ఏదొక సమయంలో కచ్చితంగా వస్తుందని అంటారు. ‘గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస.. గర్జన కంటే భయంకరంగా ఉంటుంది’.. సరిగ్గా ఈ డైలాగ్ యాప్ట్ అవుతుంది కొందరి ఆటగాళ్లు. వాళ్లంతా కూడా ఐపీఎల్ 2023లో అదరగొడుతున్నారు. టీమిండియా పొగబెట్టి.. పొమ్మన్నా.. అటు బంతితోనూ, ఇటు బ్యాట్‌తోనూ తమ అద్భుత ఆటతీరును కనబరుస్తున్నారు. బీసీసీఐతో వేస్ట్ ప్లేయర్స్ అని అనిపించుకున్న వారిలో సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్, రవి బిష్ణోయ్, యుజ్వేంద్ర చాహల్ ఉన్నారు. ఈ ఆటగాళ్లు తమ పెర్ఫార్మెన్స్‌తోనే బీసీసీఐకి గట్టి పంచ్ ఇస్తున్నారు.

  • శాంసన్‌ బ్యాట్‌తో ఎటాకింగ్..

జాతీయ జట్టులో మిడిల్ ఆర్డర్ బ్యాటర్‌గా కొన్ని మ్యాచ్‌ల్లో ఆడిన శాంసన్‌కు.. ఆ తర్వాత పెద్దగా ఛాన్స్‌లు దక్కలేదు. ఐపీఎల్ 2023కి ముందు ఆస్ట్రేలియా సిరీస్‌లో శాంసన్‌కు చోటు దక్కుతుందని అందరూ భావించారు. అయితే అది జరగలేదు. గతేడాది నవంబర్‌లో శాంసన్ భారత్ తరఫున చివరి మ్యాచ్ ఆడాడు. అయితే, ఇప్పుడు IPL 2023లో తనను తాను మరోసారి నిరూపించే అవకాశం దొరికింది. మొదటి మ్యాచ్‌లో 171 కంటే ఎక్కువ స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేశాడు. అర్ధ సెంచరీతో అదరగొట్టాడు.

  • బంతితో చాహల్‌ మాయాజాలం..

ఐపీఎల్ 2023లో యుజ్వేంద్ర చాహల్ మ్యాజిక్ చేస్తున్నాడు. ఇక జాతీయ జట్టులో అయితే అతడి పరిస్థితి.. అటూ.. ఇటూనే. ఆస్ట్రేలియా సిరీస్‌కు కూడా చోటు దక్కలేదు. చాహల్ తన చివరి మ్యాచ్‌ని 2023 జనవరిలో శ్రీలంకతో ఆడాడు. ఇక ఇప్పుడు ఈ సీజన్‌లో చాహల్ తన లెగ్-స్పిన్‌తో మాయాజాలం సృష్టిస్తున్నాడు. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న అతడు తొలి మ్యాచ్‌లోనే 17 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.

  • గైక్వాడ్‌ మెరుపులు..

భారత్ తరఫున రుతురాజ్ గైక్వాడ్ వన్డేల్లో అరంగేట్రం చేసి 6 నెలలైంది. అయితే ఇప్పటి వరకు కేవలం 1 మ్యాచ్ మాత్రమే ఆడాడు. అదే సమయంలో, అతడు 2 సంవత్సరాలలో T20Iల్లో 9 మ్యాచ్‌లు ఆడగలిగాడు. ఐపీఎల్ 2023లో రుతురాజ్ గైక్వాడ్ ఇప్పటివరకు 2 మ్యాచ్‌లు ఆడి.. రెండింటిలోనూ హాఫ్ సెంచరీలు చేశాడు. అత్యధిక స్కోరు 92 పరుగులు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 149 పరుగులు చేసి.. ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా నిలిచాడు.

  • రవి బిష్ణోయ్ గూగ్లీ..

రవి బిష్ణోయ్ కూడా గైక్వాడ్ మాదిరిగానే జాతీయ జట్టులో చోటు దక్కించుకుని 6 నెలల్లో కేవలం 1 వన్డే మ్యాచ్ మాత్రమే ఆడగలిగాడు. అలాగే గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఒక్క టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు. కానీ ఇప్పుడు ఈ ఐపీఎల్ సీజన్‌లో అదరగొడుతున్నాడు. లక్నో సూపర్ జెయింట్స్ తరఫున రవి బిష్ణోయ్ ఇప్పటివరకు ఆడిన 2 మ్యాచ్‌ల్లో 5 వికెట్లు తీశాడు.