ఐపీఎల్ 2023లో పలువురు యువ ఆటగాళ్లు తమ సత్తాను చాటుతున్నారు. మొన్నటికి మొన్న ముంబై ఇండియన్స్ బ్యాటర్ తిలక్ వర్మ(84) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా.. నిన్న గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ సాయి సుదర్శన్ కీలక ఇన్నింగ్స్‌తో తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు.
ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ బ్యాటర్ సాయి సుదర్శన్ ఆడిన ఆట చూస్తే.. కచ్చితంగా భారత్‌కు ఫ్యూచర్ స్టార్ అని అందరూ అంటారు. మిగతా బ్యాట్స్‌మెన్లు వరుసగా పెవిలియన్‌కు చేరుతున్నప్పటికీ.. సుదర్శన్ మాత్రం క్రీజులో పాతుకుపోయాడు. అంతర్జాతీయ అనుభవం ఉన్న బౌలర్లను కూడా అత్యంత సునాయాసంగా ఎదుర్కుని.. బౌండరీలు బాదేశాడు. మొదటి మ్యాచ్‌లో చెన్నైతో 22 పరుగులు చేసిన సుదర్శన్‌కు.. ఆ ఫ్రాంచైజీ రెండో మ్యాచ్‌లోనూ అవకాశం ఇచ్చింది. ఆ ఛాన్స్ సద్వినియోగం చేసుకుని 48 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 62 పరుగులు చేసి చివరి వరకు అజేయంగా నిలిచాడు.
సాయి సుదర్శన్ ఆటతీరుపై దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ ప్రశంసలు కురిపించాడు. అంతర్జాతీయ అనుభవం ఉన్న ఆటగాడి మాదిరిగానే.. సుదర్శన్ షాట్స్ కొట్టాడని.. ప్రపంచస్థాయి ఆటగాడికి ఉండాల్సిన లక్షణాలు అతడిలో ఉన్నాయని గవాస్కర్ కొనియాడాడు. అటు అనిల్ కుంబ్లే సైతం అతడి బ్యాటింగ్‌కు మంత్రముగ్ధుడయ్యాడు. కాగా, గతేడాది దేశవాళీ మ్యాచ్‌ల్లో అద్భుతంగా ఆడిన సుదర్శన్‌ను.. గుజరాత్ రూ. 20 లక్షల బేస్ ప్రైస్‌కు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.