ఐపీఎల్ 2023 క్వాలిఫయర్-1లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ అద్భుతమైన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. దీంతో సీఎస్‌కే 10వ సారి ఐపీఎల్ ఫైనల్స్‌కు చేరుకుంది. ఇదిలా ఉంటే.. ఫైనల్‌కు ముందుగా చెన్నై సూపర్ కింగ్స్‌కు గట్టి షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. ఆ జట్టు కెప్టెన్ ఎం.ఎస్ ధోనిపై ఒక మ్యాచ్ నిషేధం విధించే ఛాన్స్ ఉందని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి.
గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన క్వాలిఫియర్-1లో 16వ ఓవర్ సమయంలో ధోని అంపైర్‌తో వాగ్వాదానికి దిగిన సంగతి తెలిసిందే. సుమారు 4 నిమిషాల సమయాన్ని ధోని వృథా చేశాడు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న మ్యాచ్ రిఫరీ.. ధోనిపై ఫైన్ లేదా ఒక మ్యాచ్ నిషేధం విధించే అవకాశం ఉందని జాతీయ మీడియాలో పలు కథనాలు ప్రచురితమయ్యాయి. అలాగే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కూడా ఈ విషయంపై ఆరా తీసునట్లు సమాచారం. కాగా, ధోనిపై నిషేధం పడితే మాత్రం.. ఫైనల్‌కు ముందుగా చెన్నై జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగులుతుందని చెప్పాలి. ఇక దీనిపై తుది నిర్ణయం మ్యాచ్ రిఫరీపై ఆధారపడి ఉందని తెలుస్తోంది.
గుజరాత్ ఇన్నింగ్స్ 16 ఓవర్ వేసే సమయానికి సీఎస్‌కే బౌలర్ మతీషా పతిరాణా దాదాపు 9 నిమిషాలు మైదానంలో కనిపించలేదు. అతడు సరాసరి డగౌట్ నుంచే బౌలింగ్‌కి వచ్చాడు. దీంతో అంపైర్లు మతీషాను అడ్డుకున్నారు. బౌలింగ్ చేయకూడదని వారించారు. ఈలోగా ధోని వచ్చి.. వివాదాన్ని కాస్తా సద్దుమనిగించాడు. అయితే ఐపీఎల్ రూల్స్ ప్రకారం.. ఓ ఆటగాడు మ్యాచ్ జరిగే సమయంలో ఎనిమిది నిమిషాలకు పైగా గ్రౌండ్లో లేకపోతే అంపైర్లు అతడిపై చర్యలు తీసుకోవచ్చు.