Mumbai Indians: ఈ సీజన్‌లో రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్(Mumbai Indians) టీంకు వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. కీలక ప్లేయర్లు తొలి మ్యాచులకు దూరం అయ్యారు. ఇక నిన్న ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలైన ముంబై ఇండియన్స్‌కు మరో రెండు ఎదురుదెబ్బలు తగిలాయి. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఇషాన్ కిషన్ గాయపడడంతో ముంబై టీం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయితే, ఫీల్డింగ్ సమయంలో తిరిగి మైదానంలోకి రావడంతో కాస్త ఊపిరి పీల్చుకుంది. అయితే, స్లో ఓవర్ రేట్ కారణంగా కెప్టెన్ రోహిత్ శర్మకు భారీ షాక్ తగిలింది. ఐపీఎల్(IPL 2022) నిర్వాహకులు రూ. 12లక్షల జరిమానా విధించారు. ముంబై నిర్దిష్ట సమయంలో తన బౌలింగ్ కోటా పూర్తి చేయలేకపోవడంతో ఈ జరిమానా విధించారు. ఫలితంగా ఈ సీజన్‌లో స్లో ఓవర్ రేట్ జరిమానా ఎదుర్కొన్న తొలి కెప్టెన్‌గా రోహిత్ రికార్డులకెక్కాడు. ప్రణాళిక ప్రకారం బౌలింగ్ చేయలేకపోవడమే తమ ఓటమికి కారణమన్నాడు. తాము ఏ మ్యాచ్‌కైనా ఒకే రకమైన సన్నద్ధతతో బరిలోకి దిగుతామన్నాడు. అయితే, పరిస్థితులు కలిసి రాలేదని చెప్పుకొచ్చాడు.
కాగా, ఐపీఎల్ తొలి మ్యాచులో ఓటమి పాలవడం ముంబై ఇండియన్స్‌కు అలవాటైంది. గత సీజన్‌లోనూ ఇదే జరిగింది. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచులోనూ అదే నిరూపితమైంది. తొలి మ్యాచ్ ఓడిపోవడం ముంబైకు కలిసివస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.