
IPL 2022:IPL 2022 సీజన్ ప్రారంభ దశలో చాలా మంది విదేశీ ఆటగాళ్లు అందుబాటులో ఉండటం లేదు. వివిధ జట్లకు చెందిన ఈ ఆటగాళ్లు తమ దేశాల సిరీస్‌లలో బిజీగా ఉన్నారు. దీని కారణంగా వారు కొన్ని మ్యాచ్‌లలో ఆడలేరు. ఈ విషయంలో చెన్నై సూపర్ కింగ్స్‌కి పెద్దగా ఇబ్బంది లేదు. అయితే మరో కారణంతో టెన్షన్ పడుతోంది. ఇది ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ గురించి. అతడు ప్రారంభ మ్యాచ్‌లో ఆడతాడో లేదో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండర్ గత 20 రోజులుగా భారత్‌కి రావడానికి వీసా లభించడం లేదు. సరిగ్గా వారం తర్వాత అంటే మార్చి 26 నుంచి ముంబైలో ఐపీఎల్ 15వ సీజన్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై గత సీజన్ రన్నరప్ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో తలపడనుంది. ఇలాంటి పరిస్థితుల్లో మోయిన్‌కు వీసా రాకపోవడంతో చెన్నై ఆందోళన పడుతోంది.
ఫిబ్రవరి 28న దరఖాస్తు చేసుకున్నాడు..
చెన్నై సూపర్ కింగ్స్ CEO కాశీ విశ్వనాథ్ దీని గురించి మాట్లాడారు. టోర్నమెంట్ ప్రారంభానికి ముందు అతను ముంబైలో జట్టులో చేరగలనని ఆశాభావం వ్యక్తం చేశాడు. “అతను ఫిబ్రవరి 28న వీసా కోసం దరఖాస్తు చేసుకున్నాడు. దరఖాస్తు చేసి 20 రోజులైంది. అతను నిరంతరం భారతదేశానికి వస్తూ ఉంటాడు కానీ అతనికి ఇంకా వీసా లభించలేదు. కారణం ఏంటో తెలియదు. త్వరలో జట్టులోకి వస్తాడని ఆశిస్తున్నాము. ఈ విషయంలో బీసీసీఐ తన వంతుగా ప్రయత్నాలు చేస్తోంది. సోమవారం నాటికి ఈ సమస్య పరిష్కారమవుతుందని ” చెప్పాడు.
8 కోట్లకి కొనుగోలు
గతేడాది వేలంలో మొయిన్ అలీని చెన్నై సూపర్ కింగ్స్ 8 కోట్లకి కొనుగోలు చేసింది. ఈ ఎడమ చేతి దూకుడు బ్యాట్స్‌మన్, కుడిచేతితో ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేస్తాడు. తన ఆల్ రౌండ్ ప్రదర్శనతో చెన్నై నాలుగో టైటిల్ విజయంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు. దీంతో ఫ్రాంచైజీ ఈ ఇంగ్లండ్ ఆల్ రౌండర్‌ను రూ.8 కోట్లకు తన వద్దే ఉంచుకుంది.