Chris Gayle : ఒకప్పుడు ఆకలి తీర్చుకోవడానికి చెత్త మోశాడు..నేడు టీ20 వరల్డ్ కప్‌లో సిక్సర్ల కింగ్ అయ్యాడు

Chris Gayle : క్రికెట్ ప్రపంచంలో యూనివర్స్ బాస్‎గా వెలుగొందుతున్న క్రిస్ గేల్ ప్రస్థానం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయం. మైదానంలో సిక్సర్ల సునామీ సృష్టించే ఈ కెరిబియన్ వీరుడి గతం వింటే కన్నీళ్లు ఆగవు. ఆకలి తీర్చుకోవడం కోసం ఒకప్పుడు చెత్తను మోసిన చేతులే, నేడు ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యధిక సిక్సర్ల రికార్డును తన పేరు రాసుకున్నాయి.

Chris Gayle : ఒకప్పుడు ఆకలి తీర్చుకోవడానికి చెత్త మోశాడు..నేడు టీ20 వరల్డ్ కప్‌లో సిక్సర్ల కింగ్ అయ్యాడు
Chris Gayle

Updated on: Feb 04, 2026 | 3:15 PM

Chris Gayle : టీ20 వరల్డ్ కప్ 10వ ఎడిషన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో అందరి కళ్లు రికార్డులపైనే ఉన్నాయి. అయితే టీ20 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన రికార్డు ఇప్పటికీ వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ పేరునే ఉంది. 2007 నుంచి 2021 వరకు మొత్తం 33 మ్యాచ్‌లు ఆడిన గేల్, 31 ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా 63 సిక్సర్లు బాది అగ్రస్థానంలో నిలిచారు. ఈ జాబితాలో రోహిత్ శర్మ 50 సిక్సర్లతో రెండో స్థానంలో ఉండగా, జోస్ బట్లర్ (43), డేవిడ్ వార్నర్ (40), విరాట్ కోహ్లీ (35) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ప్రస్తుతం యాక్టివ్ క్రికెటర్‌గా ఉన్న జోస్ బట్లర్ ఒక్కడే గేల్ రికార్డుకు చేరువయ్యే అవకాశం కనిపిస్తోంది, కానీ అందుకు ఆయన 2026 వరల్డ్ కప్‌లో కనీసం 20 సిక్సర్లు కొట్టాల్సి ఉంటుంది.

క్రిస్ గేల్ జీవితం సినిమా కథను తలపిస్తుంది. నేడు ఆయన నికర ఆస్తి విలువ సుమారు 375 కోట్ల రూపాయలు అని సమాచారం, కానీ ఒకప్పుడు ఆయనకు కనీసం ఇటుకలతో కట్టిన ఇల్లు కూడా లేదు. జమైకాలోని ఒక మురికివాడలో నివసించిన గేల్, పొట్ట కూటి కోసం వీధుల్లో చెత్తను కూడా మోశారు. ఆయన తల్లి జమైకా రోడ్ల మీద చిప్స్ అమ్ముతూ కుటుంబాన్ని పోషించేది. ఆకలి బాధలు, పేదరికం మధ్య పెరిగిన గేల్, తన కష్టాన్నే పెట్టుబడిగా మలచుకొని క్రికెట్ మైదానంలోకి అడుగుపెట్టారు.

ఒక్కసారి క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత గేల్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆయన విధ్వంసకర బ్యాటింగ్ శైలికి ప్రపంచం ఫిదా అయిపోయింది. మైదానంలో ఆయన చేసే విన్యాసాలు బాక్సాఫీస్ దగ్గర హిట్ కొట్టే సూపర్ హిట్ సినిమాను తలపిస్తాయి. అందుకే ఆయన్ను అభిమానులు ముద్దుగా యూనివర్స్ బాస్ అని పిలుచుకుంటారు. ఎంతోమంది యువ క్రికెటర్లకు గేల్ జీవితం ఒక గొప్ప పాఠం. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, పట్టుదలతో శ్రమిస్తే అత్యున్నత శిఖరాలను అధిరోహించవచ్చని ఆయన నిరూపించారు.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి