భారత వికెట్ కీపర్-బ్యాటర్ వృద్ధిమాన్ సాహా అన్ని రకాల క్రికెట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీ సీజన్ తన చివరి సీజన్ అని వృద్ధిమాన్ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా తెలియజేశాడు. ఈ స్టంపర్ 40 టెస్టులు, 9 వన్డేల్లో భారత్ తరపున ఆడాడు. ధోనీ, పంత్ తర్వాత భారత్ తరఫున అత్యధిక సెంచరీలు సాధించిన కీపర్‌లలో వృద్ధిమాన్ సాహా రెండో స్థానంలో ఉన్నాడు. సాహా తన కెరీర్‌లో మూడు సెంచరీలతో 1353 టెస్ట్ పరుగులు చేశాడు.
సాహా తన చివరి టెస్టులో మూడేళ్ల క్రితం అంటే 2021లో న్యూజిలాండ్‌పై ఆడాడు. సిరీస్‌లో కొన్ని కీలకమైన నాక్‌లు ఆడినప్పటికీ, ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మలతో కూడిన అప్పటి కొత్త టీమ్ మేనేజ్‌మెంట్, రిషబ్ పంత్ బ్యాకప్‌గా KS భరత్‌పై దృష్టి సారించి సాహాను జట్టు నుండి తొలగించాలని నిర్ణయించుకుంది. సాహా ఈ నెలాఖరులో జరగనున్న మెగా వేలం కోసం నమోదు చేసుకోకపోవడంతో వచ్చే ఏడాది IPLలో పాల్గొనే అవకాశం లేదు. అతను ఈ విషయాన్ని బహిరంగంగా ప్రస్తావించనప్పటికీ, వేలానికి ముందు దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల కావచ్చని తెలుస్తుంది. సాహా గత మూడేళ్లుగా ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్ టైటాన్స్ ఫ్రాంఛైజీ అతని రిటైన్ చేసుకోలేదు. కోల్‌కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే), పంజాబ్ కింగ్స్ , సన్‌రైజర్స్ హైదరాబాద్, ఐదు ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించి, 2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుండి ప్రతి సీజన్‌లో పాల్గొన్న అతి కొద్ది మంది ఆటగాళ్లలో సాహా ఒకరు కావడం విశేషం.