IND vs WI: తొలి రోజు అదరగొట్టిన కేఎల్‌ రాహుల్‌..! టీమిండియా స్కోర్‌ ఎంతంటే..?

అహ్మదాబాద్‌లో వెస్టిండీస్‌తో తొలి టెస్ట్ తొలి రోజు టీమిండియా పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. సిరాజ్ (4), బుమ్రా (3) వికెట్లతో విండీస్‌ను 162 పరుగులకే ఆలౌట్ చేశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్, కేఎల్ రాహుల్ (53 నాటౌట్) హాఫ్ సెంచరీతో పటిష్ట స్థితిలో నిలిచింది.

IND vs WI: తొలి రోజు అదరగొట్టిన కేఎల్‌ రాహుల్‌..! టీమిండియా స్కోర్‌ ఎంతంటే..?
Kl Rahul

Updated on: Oct 02, 2025 | 6:22 PM

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో వెస్టిండీస్‌తో ప్రారంభమైన తొలి టెస్ట్‌ తొలి రోజు టీమిండియా పూర్తిగా డామినేట్‌ చేసింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ను టీమిండియా బౌలర్లు కేవలం 162 పరుగులకే కుప్పకూల్చారు. ముఖ్యంగా మొహమ్మద్‌ సిరాజ్‌, జస్ప్రీత్‌ బుమ్రా జోడీ విండీస్‌ బ్యాటర్లను వణికించింది. మొత్తంగా బుమ్రా 3, సిరాజ్‌ 4, కుల్దీప్‌ 2, వాషింగ్టన్‌ సుందర్‌ ఒక వికెట్‌ తీసుకున్నారు.

ఇక ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్‌ కోసం దిగిన టీమిండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. ఓపెనర్ల యశస్వి జైస్వాల్‌, కేఎల్‌ రాహుల్‌ తొలి వికెట్‌కు 68 పరుగులు జోడించారు. 54 బంతుల్లో 7 ఫోర్లతో 36 పరుగులు చేసిన తర్వాత జైస్వాల్‌ క్యాచ్‌ అవుట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వన్‌డౌన్‌లో వచ్చిన సాయి సుదర్శన్‌ ఎక్కువ సేపు క్రీజ్‌లో నిల్చోలేదు. కేవలం 7 పరుగులు మాత్రమే చేసి ఎల్బీడబ్ల్యూగా అవుట్‌ అయ్యాడు.

ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన కెప్టెన​ శుబ్‌మన్‌ గిల్‌, ఓపెనర్‌ రాహుల్‌కు మంచి సపోర్ట్‌ ఇస్తూ మరో వికెట్ పడుకుండా జాగ్రత్తగా ఆడాడు. 42 బంతుల్లో ఒక ఫోర్‌తో 18 పరుగులు చేశాడు. ఇక సీనియర్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ జట్టులో విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ లేని లోటును పూడుస్తూ బాధ్యతాయుతంగా ఆడాడు. 114 బంతుల్లో 6 ఫోర్లతో 53 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. రాహుల్‌కు ఇది టెస్టుల్లో 20వ హాఫ్‌ సెంచరీ. ఇక రెండో రోజు కూడా మంచి బ్యాటింగ్‌ చేసి సెంచరీ సాధించాలని భారత క్రికెట్‌ అభిమానులు కోరుకుంటున్నారు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి