
Team India Announcement : న్యూజిలాండ్‌తో త్వరలో జరగబోయే వన్డే సిరీస్ కోసం టీమిండియాను బీసీసీఐ ప్రకటించింది. ఈ సెలక్షన్‌లో సెలక్టర్లు కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా యువ ఆటగాళ్లు తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్‌లపై వేటు వేయడం చర్చనీయాంశంగా మారింది. గాయం నుంచి కోలుకున్న స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ తిరిగి జట్టులోకి రాగా, ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ కూడా ఎంట్రీ ఇచ్చారు.
ఆస్ట్రేలియా పర్యటనలో గాయపడిన శ్రేయస్ అయ్యర్ గత రెండు నెలలుగా ఆటకు దూరంగా ఉన్నారు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్‌నెస్ నిరూపించుకోవడంతో సెలక్టర్లు అతడిని జట్టులోకి తీసుకున్నారు. అయితే జనవరి 6న జరిగే విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్‌లో అయ్యర్ తన పూర్తి ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ మ్యాచ్‌లో అతను ఇబ్బంది పడితే కివీస్ సిరీస్ నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. అయ్యర్ రాకతో మిడిల్ ఆర్డర్ మరింత బలోపేతం కానుంది.
సౌతాఫ్రికా సిరీస్‌లో నంబర్ 4 పొజిషన్‌లో వచ్చి సెంచరీ బాదిన రుతురాజ్ గైక్వాడ్‌ను పక్కన పెట్టడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సెంచరీ చేసిన తర్వాతి సిరీస్‌లోనే అతడిని డ్రాప్ చేయడం పట్ల సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. అలాగే అద్భుతమైన ఫామ్‌లో ఉన్న తిలక్ వర్మకు కూడా చోటు దక్కలేదు. మరోవైపు యువ ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డికి సెలక్టర్లు మరోసారి అవకాశం ఇచ్చారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్లు జట్టులో ఉన్నప్పటికీ, జట్టు పగ్గాలను శుభ్‌మన్ గిల్‌కే అప్పగించారు.
🚨 News 🚨
India’s squad for @IDFCFIRSTBank ODI series against New Zealand announced.
Details ▶️ https://t.co/Qpn22XBAPq#TeamIndia | #INDvNZ pic.twitter.com/8Qp2WXPS5P
— BCCI (@BCCI) January 3, 2026
న్యూజిలాండ్ సిరీస్ కోసం ప్రకటించిన ఈ 15 మంది సభ్యుల జట్టులో 6 మంది బ్యాటర్లు, ఇద్దరు వికెట్ కీపర్లు, ముగ్గురు ఆల్ రౌండర్లు, నలుగురు స్పెషలిస్ట్ ఫాస్ట్ బౌలర్లకు చోటు కల్పించారు. రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ ఆల్ రౌండర్లుగా సత్తా చాటనున్నారు. మహమ్మద్ సిరాజ్ తిరిగొచ్చిన నేపథ్యంలో హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్‌లతో కూడిన పేస్ విభాగం బలంగా కనిపిస్తోంది. కుల్దీప్ యాదవ్ స్పిన్ బాధ్యతలు మోయనున్నారు.
షెడ్యూల్ ఇలా ఉంది
భారత్, న్యూజిలాండ్ మధ్య మూడు వన్డేల సిరీస్ జనవరి 11న ప్రారంభం కానుంది. మొదటి వన్డే వడోదరలో (జనవరి 11), రెండో వన్డే రాజకోట్‌లో (జనవరి 14), మూడో వన్డే ఇండోర్‌లో (జనవరి 18) జరగనున్నాయి. ఈ సిరీస్ గెలిచి వన్డే ఫార్మాట్‌లో తన ఆధిపత్యాన్ని చాటుకోవాలని టీమిండియా భావిస్తోంది. అయ్యర్ ఫిట్‌నెస్, గిల్ కెప్టెన్సీ ఈ సిరీస్‌కు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
భారత వన్డే జట్టు:
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, రిషభ్ పంత్, నితీష్ కుమార్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్.