
India vs New Zealand 4th T20I: న్యూజిలాండ్‌పై టీ20 సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్.. ఇప్పుడు మరో విజయంపై దృష్టి పెట్టింది. శుక్రవారం జరిగే నాలుగో టీ20లో గెలిస్తే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 4-0 ఆధిక్యంతో నిలుస్తుంది. అయితే సిరీస్ ఫలితం ఇప్పటికే తేలిపోవడంతో టీమ్ మేనేజ్‌మెంట్ కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చి, బెంచ్‌లో ఉన్న వారికి అవకాశం ఇచ్చే ఆలోచనలో ఉన్నట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav), వరుణ్ చక్రవర్తి (Varun Chakaravarthy)కు ఈ మ్యాచ్‌లో చోటు దక్కుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. బ్యాటింగ్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ భారత్ ఇప్పటివరకు ఎనిమిదో స్థానం వరకు బలమైన బ్యాటింగ్ లైనప్‌తో ఆడింది. భారీ స్కోర్లు నమోదవుతున్న ఈ సిరీస్‌లో ఆ వ్యూహం అద్భుతంగా పనిచేసింది. అయితే మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ప్రయోగాలకు అవకాశం ఉండటంతో తుది జట్టులో మార్పులు కనిపించే ఛాన్స్ ఉంది.
ముఖ్యంగా కుల్దీప్‌కు ఎక్కువకాలం బెంచ్‌పై కూర్చోబెట్టడం అతడి ఆత్మవిశ్వాసంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. వెస్టిండీస్‌తో జరిగిన స్వదేశీ సిరీస్‌లో రెండు మ్యాచ్‌లు ఆడిన అతడు.. న్యూజిలాండ్‌తో తొలి మూడు టీ20ల్లో చోటు దక్కించుకోలేదు. మిడిల్ ఓవర్లలో వికెట్లు తీసే సామర్థ్యం ఉన్న కుల్దీప్‌ను ఇప్పుడు ఉపయోగించుకోవాలని భారత్ భావించవచ్చు.
వరుణ్ చక్రవర్తి కూడా గత కొన్ని నెలలుగా స్థిరమైన ఫామ్ కోసం ప్రయత్నిస్తున్నాడు. మరోవైపు మూడో టీ20లో ఆడిన అక్షర్ పటేల్ (Axar Patel), నామన్ ధీర్ (Naman Dhir)కు బౌలింగ్ చేసే అవకాశం కూడా రాలేదు. అక్షర్ ఈ సిరీస్‌లో రెండు వికెట్లు మాత్రమే తీసుకున్నాడు. అతడి కెరీర్ టీ20 ఎకానమీ 7.70 కాగా.. ఈ సిరీస్‌లో 9.58గా ఉంది.
పేస్ విభాగంలో భువనేశ్వర్ కుమార్ (Bhuvneshwar Kumar) చివరి ఓవర్లలో యార్కర్లతో ఆకట్టుకున్నా.. తొలి మూడు మ్యాచ్‌ల్లో 72 బంతుల్లో 139 పరుగులు సమర్పించుకున్నాడు. నాలుగేళ్ల విరామం తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి తిరిగి వచ్చిన అతడు గణాంకాలను మెరుగుపరుచుకోవాలని చూస్తున్నాడు.
ప్రిన్స్ యాదవ్ (Prince Yadav) గత రెండు మ్యాచ్‌ల్లో మయాంక్ యాదవ్ (Mayank Yadav)పై పైచేయి సాధించాడు. ఇప్పుడు మయాంక్‌కు అవకాశం వస్తుందా లేదా ప్రిన్స్‌ను కొనసాగిస్తారా అనేది చూడాలి.
ఇషాన్ కిషన్ (Ishan Kishan) గజ్జ గాయం కారణంగా గత రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అతడు అందుబాటులో లేకపోతే వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) మరోసారి తన సత్తా చూపించే అవకాశం ఉంది. వెల్లింగ్టన్‌లో అతడు విధ్వంసక ఇన్నింగ్స్ ఆడినా.. అభిషేక్ శర్మ (Abhishek Sharma) అద్భుత శతకం ముందు ఆ ఇన్నింగ్స్ మరుగునపడింది.
మరోవైపు న్యూజిలాండ్‌కు భారత టాప్ ఆర్డర్ పెద్ద సమస్యగా మారింది. సంజూ శాంసన్ (Sanju Samson), అభిషేక్, వైభవ్ ఇప్పటికే భారీ ఇన్నింగ్స్‌లతో ఆ జట్టు బౌలర్లపై ఒత్తిడి పెంచారు. వెల్లింగ్టన్‌లో భారత్ పవర్‌ప్లేలోనే రికార్డు స్థాయిలో 118 పరుగులు చేసింది.
న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (Mitchell Santner) స్పిన్‌తో ఆకట్టుకుంటున్నా.. మిగిలిన బౌలర్ల నుంచి అతడికి తగిన సహకారం లభించడం లేదు. మ్యాట్ హెన్రీ తర్వాత లాకీ ఫెర్గూసన్ (Lockie Ferguson) కూడా గాయం కారణంగా సిరీస్‌లో మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు.
అందుకే నాలుగో టీ20లో భారత్ ప్రయోగాలు చేస్తుందా? కుల్దీప్, వరుణ్‌కు అవకాశం ఇస్తుందా? లేక 4-0 కోసం బలమైన జట్టుతోనే బరిలోకి దిగుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..