Ind Vs Ban: భారత్‌ను భయపెడుతున్న ఆ ఒక్క బలహీనత.. యంగ్ సెన్సేషన్ షెఫాలీ ఏమందంటే?

Ind Vs Ban: మహిళల ఆసియా కప్ 2026 సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌తో భారత్ తలపడనుంది. టీమిండియా మిడిల్ ఆర్డర్ వైఫల్యంపై ఆందోళన వ్యక్తమవుతున్న వేళ యంగ్ ఓపెనర్ షెఫాలీ వర్మ కీలక వ్యాఖ్యలు చేసింది. భారతి ఫుల్మాలి, రిచా ఘోష్ వంటి బ్యాటర్లపై తనకు పూర్తి నమ్మకం ఉందని, కీలక మ్యాచ్‌లో వారు రాణిస్తారని ధీమా వ్యక్తం చేసింది.

Ind Vs Ban: భారత్‌ను భయపెడుతున్న ఆ ఒక్క బలహీనత.. యంగ్ సెన్సేషన్ షెఫాలీ ఏమందంటే?
Ind Vs Ban

Updated on: Sep 10, 2026 | 8:55 AM

Ind Vs Ban: మహిళల ఆసియా కప్ 2026 మొదటి సెమీఫైనల్ పోరులో భాగంగా దుబాయ్ వేదికగా గురువారం భారత్, బాంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. గత కొన్ని మ్యాచుల్లో టీమిండియా మిడిల్ ఆర్డర్ దారుణంగా విఫలం కావడం అభిమానుల్లో కలవరం రేపుతోంది. అయితే ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదని, తమ బ్యాటర్లు సెమీస్‌లో గర్జించడం ఖాయమని యంగ్ ఓపెనర్ షెఫాలీ వర్మ ధీమా వ్యక్తం చేసింది. ఆసియా కప్ లీగ్ దశలో భారత్ వరుస విజయాలు సాధించినప్పటికీ, జట్టు మధ్య వరుస బ్యాటర్ల ప్రదర్శన తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. గత మూడు మ్యాచుల నుంచి భారత్ మిడిల్ ఆర్డర్ రన్స్ సాధించడంలో తీవ్రంగా తడబడుతోంది. కీలకమైన సెమీఫైనల్ మ్యాచుకు ముందు ఈ బలహీనత జట్టును దెబ్బతీస్తుందేమోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన ఓపెనర్ షెఫాలీ వర్మ ఈ వార్తలను కొట్టిపారేసింది. ఒకటి రెండు రోజులు ఆట అనుకూలించకపోవడం సహజమని, అంతమాత్రాన జట్టు సభ్యుల నైపుణ్యాన్ని శంకించలేమని స్పష్టం చేసింది.

భారతి, రిచా ఘోష్‌లపై గట్టి నమ్మకం

జట్టులోని మిడిల్ ఆర్డర్ ఆటగాళ్లను గట్టిగా సమర్థించిన షెఫాలీ వర్మ, కీలక మ్యాచులో వారు కచ్చితంగా ఆదుకుంటారని పేర్కొంది. భారతి ఫుల్మాలి, రిచా ఘోష్ ఇద్దరూ అద్భుతమైన ఫినీషర్లుగా పేరుగాంచారని, వారిలో మ్యాచ్ గెలిపించే సత్తా ఉందంది. సెమీఫైనల్ వేళ వారి నుంచి మెరుగైన ఇన్నింగ్స్‌లు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేసింది. నాలుగు రోజుల సుదీర్ఘ విరామం తమకు బాగా కలిసివచ్చిందని, ఈ సమయంలో ఆటగాళ్లంతా అలసట నుంచి కోలుకుని నెట్స్ లో తీవ్రంగా శ్రమించారని తెలిపింది.

సున్నా నుంచి మళ్లీ కొత్తగా మొదలుపెడతా!

బాంగ్లాదేశ్ జట్టుపై గతంలో షెఫాలీ వర్మకు అద్భుతమైన రికార్డు ఉంది. ఆధిపత్యం ప్రదర్శించిన పాత ఇన్నింగ్స్‌ల నుంచి వచ్చే ఆత్మవిశ్వాసాన్ని మాత్రమే తాను మైదానంలోకి తీసుకెళ్తానని చెప్పింది. మైదానంలో అడుగుపెట్టిన ప్రతిసారీ సున్నా నుంచి ఆటను ప్రారంభించాల్సిందేనని, గత గణాంకాలను పక్కనబెట్టి మళ్లీ కొత్తగా ఇన్నింగ్స్ నిర్మిస్తానని స్పష్టం చేసింది. తుది జట్టు మార్పుల గురించి అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. తాను జట్టు కెప్టెన్‌ను కాదని, ఆ నిర్ణయాలు హర్మాన్‌ప్రీత్ కౌర్ చూసుకుంటుందని నేరుగా చెప్పేసింది.

దుబాయ్ పరిస్థితులు మన దేశం లాంటివే

దుబాయ్ మైదానంలో స్పిన్నర్లకు లభిస్తున్న సహకారం గురించి మాట్లాడుతూ.. ఇక్కడి పరిస్థితులు మన భారతీయ పిచ్‌లను పోలి ఉన్నాయని షెఫాలీ అభిప్రాయపడింది. వికెట్ కొంతవరకు స్పిన్ అవుతున్నప్పటికీ, ఈ రకమైన ట్రాక్‌లపై ఆడిన అనుభవం తమ జట్టు సభ్యులందరికీ ఉందంది. పరిస్థితులకు తగినట్లు క్రీజులో సమయం గడిపి, మ్యాచ్‌ను ఆస్వాదించేందుకు ప్రయత్నిస్తానని ఈ డాషింగ్ ఓపెనర్ వెల్లడించింది.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us