ఎదురుగా భారీ టార్గెట్.. ఆడేది చిన్న టీం.. విజయం దాదాపుగా గోవిందే అని అంతా అనుకున్నారు. కానీ ఇద్దరు బ్యాటర్లు ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి తమ సత్తా చాటడమే కాకుండా.. జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు. ఇక ఇందులో ఓ ఆంధ్రా ప్లేయర్ విధ్వంసకరమైన సెంచరీతో చెలరేగిపోయాడు. ఇంతకీ అతడెవరో.? ఈ మ్యాచ్ విశేషాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా.!
జింబాబ్వే వేదికగా జరుగుతోన్న వరల్డ్‌కప్ క్వాలిఫైయర్స్‌లో పెను సంచలనం నమోదైంది. పసికూన నెదర్లాండ్స్ సూపర్ ఓవర్‌లో భీకర బ్యాటింగ్ లైనప్ ఉన్న వెస్టిండీస్‌ను మట్టికరిపించింది. ఈ ఓటమితో సూపర్ సిక్స్‌లో వరుసగా రెండు ఓటములు చవిచూసింది వెస్టిండీస్. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. విండీస్ నిర్దేశించిన 375 పరుగుల భారీ లక్ష్యచేధనను చేధించే క్రమంలో నెదర్లాండ్స్ బ్యాటర్లు ఏమాత్రం తడబడలేదు. మొదటిగా ఆ జట్టు మిడిలార్డర్ బ్యాటర్, ఆంధ్రా ప్లేయర్ తేజ నిడమానూరు విద్వంసకర శతకంతో అదరగొట్టారు. అతడు 76 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 111 పరుగులు చేసి.. జట్టు విజయతీరాలను చేర్చేవరకు క్రీజులో ఉన్నాడు. అతడికి ఎడ్వర్డ్స్(67) అర్ధ సెంచరీతో సహాయపడి స్కోర్‌బోర్డును ముందుకు నడిపించాడు. అయితే ఆఖర్లో స్కోర్లు సమం కావడంతో.. ఫలితం సూపర్ ఓవర్ వరకు వెళ్లింది. ఇక ఇక్కడ లోగన్ వాన్ బీక్ ప్రతీ బంతికి బౌండరీ బాదేసి.. 6 బంతుల్లో 30 పరుగులు రాబట్టాడు. తన జట్టుకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. అటు సూపర్ ఓవర్‌లో వెస్టిండీస్ 7 పరుగులకు 2 వికెట్లు కోల్పోయింది.
తేజ నిడమానూరు పుట్టింది విజయవాడలోనే.. మన ఆంధ్రా ప్లేయర్.. నెదర్లాండ్స్ టీం తరపున ఆడుతున్నాడు. అతడు మే 31, 2022న వన్డే డెబ్యూ చేయగా.. అదే సంవత్సరం జూలై 11న టీ20ల్లో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు తేజ 16 వన్డేలు ఆడగా.. 37.62 యావరేజ్‌తో 489 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు కూడా ఉన్నాయి. అతడి అత్యధిక స్కోర్ 111. అది కూడా వరల్డ్‌కప్ క్వాలిఫైయర్స్‌లో వెస్టిండీస్‌పై నమోదు చేశాడు.