Watch : కన్నడ బ్యూటీ ఫీల్డింగ్ విన్యాసాలు.. శ్రేయాంక క్యాచ్ చూసి ఫిదా అయిపోయిన క్రికెట్ ఫ్యాన్స్

IND-W vs PAK-W : మహిళల టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై భారత్ ఘన విజయం సాధించిన మ్యాచ్‌లో శ్రేయాంక పాటిల్ పట్టిన అద్భుతమైన డైవింగ్ క్యాచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె ఫీల్డింగ్ విన్యాసం అభిమానులను ఫిదా చేయగా, మ్యాచ్‌లో హైలైట్‌గా నిలిచింది.

Watch : కన్నడ బ్యూటీ ఫీల్డింగ్ విన్యాసాలు.. శ్రేయాంక క్యాచ్ చూసి ఫిదా అయిపోయిన క్రికెట్ ఫ్యాన్స్
Shreyanka Patil Catch

Updated on: Jun 15, 2026 | 8:29 AM

Watch : ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు అద్భుతమైన ప్రదర్శనతో బోణీ కొట్టింది. బర్మింగ్‌హామ్ వేదికగా దాయాది దేశం పాకిస్తాన్‌తో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ సేన 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యా‌చ్‌లో భారత ప్లేయర్లు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో దుమ్మురేపారు. అయితే, మ్యాచ్ గెలుపుతో పాటు కన్నడ భామ, భారత యంగ్ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ పట్టిన ఒక అద్భుతమైన క్యాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

స్మృతి మంధాన హాఫ్ సెంచరీ.. దీప్తి శర్మ ఐదు వికెట్లు

ఈ మ్యాచ్ విశేషాల్లోకి వెళితే.. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన టీం ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన 68 రన్స్‌తో అద్భుతమైన హాఫ్ సెంచరీ చేయగా, ఆఖరి ఓవర్లలో రిచా ఘోష్ మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. అనంతరం 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు భారత స్పిన్నర్ దీప్తి శర్మ (5/10) ధాటికి కేవలం 106 పరుగులకే కుప్పకూలింది. పాక్ జట్టులో మునీబా అలీ (41) మినహా మిగిలిన బ్యాటర్లు ఎవరూ రాణించలేకపోయారు.

గాల్లోకి లేచి శ్రేయాంక అద్భుతమైన డైవింగ్ క్యాచ్

ఈ మ్యాచ్‌లో ఆడే అవకాశం దక్కించుకున్న శ్రేయాంక పాటిల్‌కు బౌలింగ్‌లో వికెట్లు దక్కలేదు. కానీ, ఫీల్డింగ్‌లో మాత్రం ఆమె చూపించిన చురుకుదనం మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. పాకిస్తాన్ ఇన్నింగ్స్ 15వ ఓవర్ సమయంలో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ శ్రీ చరణి బౌలింగ్ చేయడానికి వచ్చింది. ఆ ఓవర్ నాలుగో బంతిని శ్రీ చరణి కాస్త స్లోగా వేసింది. దీనిని గమనించిన పాక్ బ్యాటర్ రమీన్ షమీమ్ కవర్స్ మీదుగా భారీ షాట్ ఆడటానికి ప్రయత్నించింది. అయితే పాయింట్ రీజియన్ పక్కన ఫీల్డింగ్ చేస్తున్న శ్రేయాంక పాటిల్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన కుడివైపునకు గాల్లోకి లేస్తూ అద్భుతమైన డైవింగ్ క్యాచ్‌ను అందుకుంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

శ్రేయాంక పాటిల్ పట్టిన ఈ అద్భుతమైన క్యాచ్ చూసి స్టేడియంలోని అభిమానులతో పాటు తోటి ఆటగాళ్లు కూడా ఆశ్చర్యపోయారు. దీనికి సంబంధించిన వీడియోలు, జీఫ్‌లు ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో తెగ వైరల్ అవుతున్నాయి. శ్రేయాంక ఫీల్డింగ్ టాలెంట్ చూసి క్రికెట్ లవర్స్ సెల్యూట్ కొడుతున్నారు. నిజానికి శ్రేయాంక బౌలింగ్ వేస్తున్న సమయంలో భారత ఫీల్డర్లు కొన్ని క్యాచ్‌లను చేజార్చారు. అయినప్పటికీ నిరాశ చెందకుండా, శ్రీ చరణి బౌలింగ్‌లో తానే స్వయంగా ఒక అసాధ్యమైన క్యాచ్‌ను సుసాధ్యం చేసి చూపించి మిగిలిన ఫీల్డర్లకు ఆదర్శంగా నిలిచింది.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us